ఆంధ్రప్రదేశ్‌

శేషాచలం అడవిలో కూంబింగ్ ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూలై 24: శేషాచలం అడవిలో పోలీసుల కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కడప ఓఎస్‌డి సత్యయేసుబాబు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా గమనించిన ఎర్ర చందనం కూలీలు మారణాయుధాలతో దాడులకు దిగడంతో పోలీసులు ఏడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఎర్రకూలీల దాడుల్లో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలు కాగా అతికష్టం మీద కొందరు ఎర్రకూలీలను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు.. గత వారం రోజులుగా శేషాచలం అడవుల్లో ఓ పక్క టాస్క్ఫోర్స్ డిఐజి కాంతారావు నేతృత్వంలో మరోపక్క కడప ఓఎస్‌డి సత్యయేసుబాబు నేతృత్వంలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులు కూడా ఇప్పటి వరకూ ఏడుగురిని అరెస్టు చేసి పెద్దఎత్తున ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓఎస్‌డి సత్యయేసుబాబు ఆదివారం తన సిబ్బందిని వెంట పెట్టుకుని కూంబింగ్ నిర్వహిస్తుండగా వందలాది మంది ఎర్రచందనం కూలీలు శేషాచలం అడవుల్లో తారసపడి గుంజేటివాగు ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను చూసి రాళ్లు, మారణాయుధాలతో దాడి చేశారు. ఆ దాడుల్లో పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఏడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. పారిపోతున్న పలువురు ఎర్రకూలీలను పోలీసులు అదుపులోకి తీసుకుని రైల్వేకోడూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. దీంతో మళ్లీ శేషాచలం అడవుల్లో భీకర వాతావరణం నెలకొని అలజడి మొదలైంది.
దుబాయ్, చైనాకు ఎర్రచందనం రవాణా..
కడప జిల్లాలో విస్తరించి ఉన్న శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ దాడులు ఫలితాలివ్వలేదనే చెప్పవచ్చు. జిల్లా నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు వందలాది మంది సిబ్బంది, ఒక డిఐజి అధికారిని నియమించారు. అయినా స్మగ్లర్లు ఎర్రచందనాన్ని విదేశాలకు యథేచ్ఛగా ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దుబాయ్, చైనాకు ఎర్రచందనం తరలించినట్లు శనివారం పోలీసులు అరెస్టు చేసిన స్మగ్లర్ల విచారణలో వెల్లడైంది. రైల్వేకోడూరుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు నరేష్, నరసింహారెడ్డి, గంగయ్య, బాలిరెడ్డిలను శనివారం జిల్లా పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. దీంతో దుబాయ్‌కి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ అమీద్‌షాహుల్, తమిళనాడుకు చెందిన తిరుత్తణిమణి, సింగపూర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం, చెన్నై నగరానికి చెందిన భాస్కర్ ఇటీవల దుబాయ్, చైనాకు పెద్దఎత్తున ఎర్రచందనం దుంగలు ఎగుమతి చేసినట్లు విచారణలో వెల్లడైంది.
జిల్లాలోని చోటామోటా స్మగ్లర్లు దుబాయ్, చైనాకు చెందిన చెన్‌చెంగ్యూ, కె.దావోద్, ఫిరోజ్ దస్తగిరి, చెన్‌చెంగాయ్‌లకు ఎర్రచందనం విక్రయించినట్లు పోలీసుల విచారణలో స్మగ్లర్లు ఒప్పుకున్నారు. ఎర్రచందనం దుంగలను తమిళనాడుకు చెందిన బడా స్మగ్లర్ జాకీర్‌కు చేరిస్తే ఆయన కోల్‌కత్తా నుంచి కొలంబో మీదుగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిసింది. అలాగే తమిళనాడుకు చెందిన పలువురు ప్రముఖులు, ఒక విశ్రాంత డిఎఫ్‌ఓ భాగస్వామ్యంతో కూడా ఎర్రచందనాన్ని విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అంతర్జాతీయ స్మగ్లర్లు మకాం వేసి ఫోన్ల ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఒప్పందం కుదుర్చుకుని హవాలా బ్రోకర్ల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.