రాష్ట్రీయం

తెరపైకి మళ్లీ ఓసీ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24:అగ్రకులాల రిజర్వేషన్ల వ్యవహారంపై మళ్లీ జాతీయ స్థాయి చర్చ మొదలుకానుంది. వివిధ రాష్ట్రాల్లో, వివిధ పేర్లతో ఉన్న ఓసీ సంఘాలు, రిజర్వేషన్ పోరాట సంఘాలన్నీ ఒకేతాటిపైకొచ్చి రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండుతో, సర్కారుపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. అందుకు ఢిల్లీ వేదిక కానుంది. ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఈనెల 29,30వ తేదీల్లో ఢిల్లీ వేదికగా అగ్రకుల సమస్యలపై జాతీయ సదస్సు జరగనుంది.
జాట్లు, పటేళ్లు, గుజ్జర్లు, కాపులకు రిజర్వేషన్లపై జాతీయ సదస్సు చర్చించనుంది. ఇప్పటికే ఏపి, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే, అవి ఇప్పటివరకూ కార్యరూపం దాల్చకపోవడంతో ఆందోళనలు చెలరేగుతున్నాయి. గుజ్జర్లు, పటేళ్లు, కాపుల ఆందోళన హింసకు దారితీసిన విషయం తెలిసిందే. పటేళ్ల నాయకుడు హార్దిక్ పటేల్ ఇటీవలే జైలు నుంచి విడుదలవగా, ఏపిలో కాపుల రిజర్వేషన్ల కోసం దీక్ష చేసిన ముద్రగడ పద్మనాభం కూడా, ఆసుపత్రిలోనే ఆమరణ నిరాహారదీక్ష కొనసాగించారు. గుజ్జర్లయితే రైళ్ల వ్యవస్థను నిలిపివేశారు. ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న ఓసీల ప్రత్యేక పరిస్థితులను జాతీయ స్థాయిలో చర్చించడం ద్వారా, జాతీయ దృష్టిని ఆకర్షించి, ప్రభుత్వాలకు హెచ్చరిక సంకేతం పంపాలని ఓసీ సంక్షేమ సంఘం నిర్ణయించింది. చట్టబద్ధత కల్పించకుంటే రాష్ట్రాల వారీగా ఉద్యమాలను ఉధృతం చేయాలన్న వ్యూహంతో కార్యాచరణ రూపొందించారు. అందుకే వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మంది ప్రతినిధులతో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు జి కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.
ఓసీలకు రిజర్వేషన్లు ప్రకటించడం వల్ల ఉపయోగం లేకుండా పోతోందని, న్యాయపరమైన కారణాలతో అవి కోర్టులో వీగిపోతున్నందున, రాజ్యాంగసవరణ చేయాల్సి ఉందన్న డిమాండుతో జాతీయ సదస్సు నిర్వహించనున్నామని కరుణాకర్‌రెడ్డి వివరించారు. ‘ఏపిలో కూడా ఓసీ కార్పొరేషన్ పెడతామని బాబు మహానాడులో ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా పెట్టలేదు. ఇప్పటివరకూ బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ పెట్టడం వల్ల ఆయా కులాల వారికి ప్రయోజనం జరగడం మంచిదే. కానీ ఓసీ కార్పొరేషన్‌తోపాటు ఓసీలకూ రిజర్వేషన్లు ఇస్తేనే వారికి మనుగడ ఉంటుంద’ని ఆయన వ్యాఖ్యానించారు.