రాష్ట్రీయం

మల్లన్న బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 25: మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలపై పోలీసులు జరిపిన లాఠీ చార్జీ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి భారీగా పరిణమించింది. ఆదివారం నాటి లాఠీచార్జీ ఘటనకు నిరసనగా అఖిలపక్షం, ప్రజాసంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మెదక్ జిల్లా బంద్ సోమవారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా సంపూర్ణంగా ముగిసింది. ముంపు గ్రామాలున్న గజ్వేల్ సెగ్మెంట్ పోలీసుల అష్టదిగ్బంధనంలో బందీ అయింది. అడుగడుగునా చెక్‌పోస్ట్‌లు.. ఏ ఒక్క రాజకీయ నాయకుడినీ రానివ్వకుండా ఆంక్షలతో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. విపక్ష నేతలను అడ్డుకోవటానికి అధికార పక్షం ఎత్తులు వేస్తే.. ప్రతిపక్ష నేతలు పై ఎత్తులు వేసి నిర్వాసితుల వద్దకు చేరుకుని పరామర్శలు చేశారు. ఒకరు బస్సెక్కితే, మరొకరు బైక్‌పై వెళ్లారు. ఇంకొకరు ఆటోలో ప్రయాణించారు. పోలీసుల చెక్‌పోస్ట్‌లను చాకచక్యంగా తప్పించుకుని ముంపు గ్రామాలకు చేరుకున్నా.. అక్కడ పోలీసుల చేతికి చిక్కక తప్పలేదు. పోలీసులు సైతం ఒక్కో నేతను ఒక్కో రూట్‌లో, ఒక్కో పోలీస్ స్టేషన్‌కు తరలించి మీడియాను మాయ చేశారు. లాఠీ దెబ్బలతో తీవ్రంగా గాయపడి, బూటుకాళ్లకు నలిగిపోయి తీవ్ర ఆగ్రహంతో ఉన్న వేములఘాట్ ప్రజలు మాత్రం మరింత ఆక్రోశంతో సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు మంత్రి హరీష్‌రావు దిష్టిబొమ్మకు చీరకట్టించి ఊరేగింపు నిర్వహించి దగ్ధం చేయడం గమనార్హం. సింగారం గ్రామంలో ఒక దశలో కొందరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వేములఘాట్ గ్రామానికి వచ్చిన ఓ పోలీసు వాహనాన్ని గ్రామస్థులు వెంబడించడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే జిల్లాలోని అన్ని బస్సు డిపోల వద్దకు కాంగ్రెస్, టిడిపి, బిజెపి, సిపిఎం, సిపిఐల నాయకులు, ప్రజాసంఘాల నేతలు చేరుకుని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. సిద్దిపేటలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, అధికార టిఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం కొద్దిసేపు ఉత్కంఠకు దారితీసింది. ఉదయం 9.30 గంటలకు ముంపు గ్రామాలకు బయలుదేరిన తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను ములుగు మండలం ఒంటిమామిడి వద్దే పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గౌరారం, ములుగు, జిన్నారం మీదుగా ఐడిఎ బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. గజ్వేల్ సెగ్మెంట్ చుట్టూ పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న టిడిఎల్‌పి నేత రేవంత్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారు. తన కాన్వాయన్‌ను రాజీవ్ రహదారి మీదుగా తరలించి తాను మాత్రం మేడ్చల్ మీదుగా ఆర్టీసి బస్సులో గజ్వేల్‌కు చేరుకున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు బిజెపి ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావులు కూడా బస్సులో గజ్వేల్ చేరుకున్నారు. అయితే, రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో లేకపోవడం, బస్సులో వస్తున్నట్లు తెలియటంతో గజ్వేల్‌లో బస్సులోంచి దిగుతుండగానే రేవంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని దౌల్తాబాద్ మండలం బేగంపేట, దౌల్తాబాద్, చేగుంటల మీదుగా దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి సాయంత్రం వరకూ వదిలిపెట్టలేదు. గజ్వేల్ చేరుకున్న కాంగ్రెస్ నేత దామోదర్ రాజనర్సింహా, ఇతర నేతలు శ్రవణ్, అద్దంకి దయాకర్‌లను అరెస్టు చేసి తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి, డిసిసి అధ్యక్షురాలు సునితాలక్ష్మారెడ్డిని అరెస్టు చేసి దుండిగల్ పిఎస్‌కు తరలించారు. జెఎసి చైర్మన్ కోదండరాంకు మద్దతుగా బయలుదేరిన ఓయు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి గౌరారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రజాగాయకురాలు విమలక్క, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిలను కుకునూర్‌పల్లి వద్ద అరెస్టు చేసి జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి)ని కొత్త బస్టాండ్ వద్ద అరెస్టు చేసి ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎంపి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలో ప్రెస్‌మీట్ నిర్వహించి వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పిఎస్‌కు తరలించారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు కొనసాగుతున్న నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ జస్టిస్ చంద్రకుమార్‌లు ఆర్టీసి బస్సులో ప్రయాణించి బైక్‌లపై దీక్షలు కొనసాగుతున్న వేముల్‌ఘాట్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. సిపిఐ నాయకురాలు పశ్య పద్మ సైతం ఆటోలో బాధిత గ్రామాలకు చేరుకోవడం విశేషం. బస్సులతో పాటు విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలన్ని ఉదయం పూట అన్ని పట్టణాల్లో పూర్తిగా మూతపడ్డాయి. జిల్లాలోని 46 మండల కేంద్రాలు, ఐదు మున్సిపల్ పట్టణాలు, మూడు నగర పంచాయతీల్లో అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

చిత్రం.. వేములఘాట్‌లో సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్న గ్రామస్తులు,