తెలంగాణ

ఎంసెట్-2 రద్దు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. జూలై 9న నిర్వహించిన ఎంసెట్-2 పేపర్ లీకైందన్న అనుమానాల నేపథ్యంలో ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది. వరంగల్ కేంద్రంగా ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకైనట్టు విచారణ చేస్తున్న సిఐడి అధికారులు నిర్దారణకు వచ్చారని తెలిసింది. రెండు మూడుసార్లు ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు, గత ఎంసెట్‌లో వేలల్లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులకు ఎంసెట్-2లో వందలోపు ర్యాంకులు రావడం, సరిగ్గా చదవని విద్యార్థులకు టాప్ ర్యాంకులు రావడంతో పేపర్ లీకేజీపై అనుమానాలు చెలరేగాయి. ఎంసెట్-2 పేపర్ లీకైనట్టు సిఐడి విచారణలో ప్రాథమిక సాక్ష్యాలు లభించడంతో, ఇప్పుడు పరీక్షనే రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంసెట్-2 పరీక్షకు సుమారు 50 వేలమంది విద్యార్థులు హాజరుకాగా, వీరిలో 47 వేలమంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎంసెట్-2 పేపర్ లీకైందన్న అంశంపై విచారణ జరిపించాలని ఎంసెట్ కన్వీనర్ ఎన్‌వి రమణారావు పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) అనురాగ్ శర్మను వారం క్రితమే కోరారు. ఈ అంశంపై విచారణ చేయిస్తున్నట్టు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ప్రకటించారు. తప్పు చేసినట్టు తేలితే కఠినంగా శిక్షిస్తామని మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిఐడి ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి పూర్తిస్థాయి విచారణ మొదలుపెట్టింది. తప్పు జరిగినట్టు ప్రాథమిక సాక్ష్యాలు ఉండటంవల్ల ఎంసెట్-2ను రద్దు చేయడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు సమాచారం.
రద్దు ఆలోచన లేదు
ఎంసెట్-2 పరీక్షను రద్దు చేసే ఆలోచన ఏమీ లేదని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టిఎస్‌సిహెచ్‌ఇ) చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఆంధ్రభూమి పతినిధితో మాట్లాడుడూ సిఐడి విచారణ జరుగుతోందని గుర్తు చేశారు. విచారణ పూర్తయి తప్పు జరిగినట్టు తేలితే ఏదైనా చర్య చేపట్టేందుకు ఆలోచిస్తామన్నారు. విచారణ కొనసాగుతుండగానే పరీక్ష రద్దు గురించి ఆలోచించే ప్రసక్తే లేదన్నారు.