ఆంధ్రప్రదేశ్‌

బాబు ‘అనంత’ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: రెండోసారీ రాయలసీమలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు నిర్వహించడంద్వారా ఆ ప్రాంతంలో తన ప్రభుత్వంపై సీమ వస్తున్న అసంతృప్తిని తొలగించే ఎత్తుగడకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన తర్వాత కర్నూలులో తొలి స్వాతంత్య్ర ఉత్సవాలు నిర్వహించిన బాబు ఈసారి ప్రాధాన్యతా క్రమంలో ఉత్తరాంధ్రలో కాకుండా, మళ్లీ రాయలసీమలోనే నిర్వహించడం వెనుక భారీ రాజకీయ వ్యూహమే కనిపిస్తోంది.
విభజన జరిగిన తర్వాత రాజధాని ఎక్కడో నిర్ధారణ కాని పరిస్థితుల్లో బాబు ప్రభుత్వం 2014లో కర్నూలులో కోటిన్నర రూపాయల ఖర్చుతో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరిపింది. రాజధానిని కర్నూలులోనే ఏర్పాటుచేయాలన్న డిమాండ్ సీమవాసుల నుంచి వినిపించింది. శ్రీబాగ్ ఒప్పందాన్ని కూడా పలువురు నేతలు గుర్తుచేశారు. ఆ డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని స్వాతంత్య్ర సంబరాలు కర్నూలులోనే నిర్వహించారు. ఆ సందర్భంగా రాయలసీమను మెగా ఇండస్ట్రియల్ హబ్‌గా ఏర్పాటుచేస్తామని బాబు ప్రకటించారు. అదే సభలో దాదాపు 40వేల కోట్ల రూపాయల వ్యయంతో పలు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాజధానిని గుంటూరు-విజయవాడ మధ్య ప్రకటించిన తర్వాత రెండో స్వాతంత్య్ర ఉత్సవాలను 2015లో విజయవాడలో నిర్వహించారు. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ ప్రకారంగా ఈసారి ఉత్తరాంధ్రలో నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ బాబు హఠాత్తుగా వ్యూహం మార్చారు. కొద్దినెలల నుంచి రాయలసీమలో అలజడులు మళ్లీ మొదలయ్యాయి. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌పై సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలన్న డిమాండును మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. ఆ మేరకు శ్రీశైలంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు భారీ ధర్నా నిర్వహించారు.
ఆ తర్వాత కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ కొద్దిరోజుల నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రొద్దుటూరులో నిర్వహించిన ధర్నాకు పట్టణమంతా కదలివచ్చింది.
ఇలావుండగా బిజెపి నేతలు కూడా సీమపై దృష్టి సారించారు. త్వరలో కడపలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. సోము వీర్రాజు, పురంధ్రీశ్వరి, కన్నా, సురేష్‌రెడ్డి వంటి సీనియర్లంతా సీమలో తరచూ పర్యటిస్తున్నారు.
బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోస్తాప్రాంతంమీదే దృష్టి సారిస్తున్నారన్న విమర్శలు ఊపందుకుంటున్నాయి. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిని ఏర్పాటుచేయగా, గుంటూరులో హైకోర్టును ఏర్పాటుచేశారని, ఇప్పుడు కూడా అదేవిధంగా కర్నూలులో హైకోర్టును ఏర్పాటుచేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. రాయలసీమకు ఇచ్చిన ప్రాజెక్టులు కూడా కోస్తాకు తరలించుకు వెళుతున్నారన్న ఆందోళన సీమవాసుల్లో మొదలయింది.
ఈ డిమాండ్లు సీమ ప్రజలను ప్రభావితం చేస్తున్నాయన్న వాస్తవాన్ని గ్రహించిన బాబు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని సీమలో నిర్వహించడం ద్వారా, సీమప్రాంత ప్రజలపై తన ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకునే ఎత్తుగడకు తెరలేపారని పార్టీ వర్గాలు విశే్లషిస్తున్నాయి.
ఈ సందర్భంగా సీమకు రానున్న ప్రాజెక్టులను బాబు వెల్లడిస్తారని చెబుతున్నారు. ఇప్పటివరకూ వివిధ కంపెనీలతో జరిగిన ఒప్పందాల వివరాల జాబితాను రూపొందించాలని, సీఎంఓను బాబు ఆదేశించినట్లు సమాచారం.