జాతీయ వార్తలు

హోదా ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో ప్రతిపక్షాలన్నీ గట్టిగా డిమాండ్ చేశాయి. అయితే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాత్రం ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చనందుకే అమలు చేయటం సాధ్యం కావటం లేదని చెప్పారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు ప్రతిపాదించిన సవరణ బిల్లుపై ఓటింగ్‌కు ప్రతిగా రాజ్యసభలో గురువారం ఏపి పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమలు తీరుపై దాదాపు నాలుగున్నర గంటలపాటు చర్చ జరిగింది. రాజ్యసభలో జరిగిన చర్చకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం సమాధానం ఇస్తారు. తెలుగుదేశంతోపాటు సమాజ్‌వాదీ, బిఎస్‌పి, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు కూడా ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేననీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీని ఎన్‌డిఏ ప్రభుత్వం గౌరవించాల్సిందేనని ముక్తకంఠంతో డిమాండ్ చేయటం గమనార్హం. ప్రైవేట్ మెంబర్ బిల్లును ఎటువంటి పరిస్థితిలోనూ ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు స్పష్టం చేశారు. పార్లమెంటు వేదికపై ప్రధాన మంత్రి ఇచ్చే హామీలను ఆ తరువాత అధికారంలోకి వచ్చే పార్టీలు అమలు చేయకపోతే పార్లమెంటరీ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పోతుందని ప్రతిపక్షం సభ్యులందరూ హెచ్చరించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతోపాటు ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్, సీనియర్ నాయకుడు జయరాం రమేష్, రమేష్ అగర్‌వాల్, సుఖేందర్ రాయ్, అలీ అన్వర్ అన్సారీ, వీర్ సింగ్, సి.ఎం.రమేష్, విజయసాయి రెడ్డి, కెవిపి, డి రాజా, అనుపమ మహంతీ, కె కేశవరావు, టి సుబ్బిరామిరెడ్డి, గరికపాటి మోహన్‌రావు, రేణుకాచౌదరి, సీతారాం ఏచూరి రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలుపై జరిగిన చర్చలో పాల్గొన్నారు.
విభజన సమయంలో తాను ఎంతో మానసిక వ్యధకు లోనయ్యానని వెంకయ్యనాయుడు అన్నారు. బిల్లుకు మద్దతు ఇస్తామని మొదటే చెప్పామనీ, అదే విధంగా చేశామనీ ఆయన చెప్పుకొచ్చారు. ఏపికి అన్యాయం జరుగుతోందనే ప్రత్యేక హోదా ప్రతిపాదన తెచ్చాం, దీనిని చట్టంలో పెట్టాలని తాము కోరినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని వెంకయ్య ఆరోపించారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలనటంతో మిగతా రాష్ట్రాలు తమకూ ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఏపికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తున్నామన్నారు. చట్టంలో ఉన్న అన్ని అంశాలనూ అమలు చేస్తున్నామన్నారు. విపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ఎన్‌డిఏ ప్రభుత్వం అమలు చేస్తుందని గత రెండు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నామనీ, ప్రభుత్వం నుండి ఎలాంటి కదలిక లేకపోవటంతోనే తాము ఇప్పుడీ చర్య చేపట్టామని చెప్పారు. ఏపికి ఐదు సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని తాము ప్రతిపాదిస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందనీ, ఇప్పుడు వారు అధికారంలో ఉన్నందున ఏపికి వెంటనే పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ విభజన చట్టంలో ఉన్న ఆరు ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ ఎన్‌డిఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ప్రత్యేక హోదా ఏమైంది? రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యేక రాయితీలను ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు? కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డు ఏర్పాటు పరిస్థితి ఏమిటి?, ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు మీరు ఇంతవరకు ఏ మేరకు నిధులు కేటాయించార’ని ఆయన నిలదీశారు. సిపిఎం పక్ష నేత సీతారాం ఏచూరి తెలుగులోమాట్లాడుతూ తాము మొదటి నుండి విభజనకు వ్యతిరేకమనీ, అయితే విభజన జరిగిన తరువాత రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని సూచించారు.
ప్రధాని మోదీ ఏపిని అభివృద్ధి చేస్తారనే విశ్వాసంతోనే బిజెపితో పొత్తు పెట్టుకున్నాం కానీ తాము ఆశించిన విధంగా పనులు జరగటం లేదని తెలుగుదేశం సభ్యుడు సిఎం రమేష్ వాపోయారు. కాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తోందని టిఆర్‌ఎస్ సభ్యుడు కె కేశవరావు ఆరోపించారు. ‘ఏపి డిమాండ్లకు మద్దతు ఇస్తున్నామనీ, అయితే ఏపితోపాటు తెలంగాణకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు విభజన వెంటనే చేయాలని కేశవరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశంపై మాట మార్చటం మంచిది కాదని కాంగ్రెస్ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తారన్నందుకే విభజన బిల్లు పాస్ అయ్యిందనేది మరిచిపోరాదని ఆయన సూచించారు.
ఏపికి ప్రత్యేక హోదా కోసం తాను ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కెవిపి ప్రకటించారు. తన బిల్లు కారణంగానే ప్రత్యేక హోదాపై ఇంతచర్చ జరగటం శుభ పరిణామమన్నారు. ఇది ద్రవ్య బిల్లంటే ఇంత సేపు దీనిపై ఎందుకు చర్చ జరగనిచ్చారని రామచందర్‌రావు నిలదీశారు.

చిత్రాలు.. రాజ్యసభలో గురువారం మాట్లాడుతున్న వెంకయ్య నాయుడు, జైరాం రమేశ్