ఆంధ్రప్రదేశ్‌

కోస్తాకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 29: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో చెదురు, మదురు వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో పశ్చిమ దిశగాను, ఉత్తర కోస్తాలో నైరుతి దిశగాను గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

2 కోట్ల ఎర్రచందనం స్వాధీనం

చిత్తూరు, జూలై 29: చిత్తూరు జిల్లాలో గత రెండు రోజులుగా టాస్క్ఫోర్స్ సిబ్బంది పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు వాహనాలు సుమారు రెండు కోట్లు విలువ చేసే నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల చిత్తూరు సమీపంలోని మురకంబట్లు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండంగా ఇద్దరు వాహనంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తూ పట్టుపడ్డారని చెప్పారు. అనంతరం వారు ఇచ్చిన సమాచారంతో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద ఆరుగురిని , అనంతపురం జిల్లా డి,హైరిహల్ గ్రామం వద్ద 12 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు, వీరి వద్ద నుంచి మూడు సుమోలు, లారీని తో పాటు సుమారు రెండు కోట్లు విలువ చేసె నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. అరెస్టు అయిన వారిలో చిత్తూరు జిల్లా పీలేరు మండలానికి చెందిన మురళి(33), శివ (34)లోతపాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరో 18 మంది ఉన్నారని వీరిని రిమాండ్‌కు పంపి నట్లు ఎస్పీ తెలిపారు.

నకిలీ పత్రాలతో ఆలయ భూముల్లో పాగా

సింహాచలం, జూలై 29: నకిలీ పత్రాలు సృష్టించి దేవాలయ భూములను కాజేయాలని ప్రయత్నించిన వారి గుట్టు రట్టయింది. ఈ నేపథ్యంలో మూడు నకిలీ డాక్యుమెంట్లు బయటపడ్డాయని, వాటిని విశాఖ దేవాదాయశాఖ అధికారులు త్వరలో బయటపెడతారని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ వైవి అనురాధ ప్రకటించారు. సింహాచలంలో ఆమె విలేఖరులతో శుక్రవారం మాట్లాడారు. నకిలీ పత్రాలు సృష్టంచిన వారెవరిని వదలమని, పోలీసులకు ఫిర్యాదుచేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అలయ భూముల రిజిస్ట్రేషన్‌కి సంబధించి 22 ఎ 1 సి చట్టం అనుసరించి భూములు పరిశీలించామన్నారు. ఇందుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పది జిల్లాలకు చెందిన భూముల వివరాలతో ఇప్పటికే నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేశామన్నారు. విశాఖ, కడప, నెల్లూరు జిల్లాలకు సంబంధించి వివరాలను ప్రకటించాల్సి ఉందని ఆమె చెప్పారు. వీటిలో 30 మండలాల భూముల నోటిఫికేషన్ సిద్ధమైందని ఆమె తెలిపారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని గర్భిణి మృతి

విశాఖపట్నం(క్రైం), జూలై 29: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ నిండు గర్భిణి దుర్మరణం పాలైంది. జనం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ విషాదకరమైన సంఘటన జరగడంతో అక్కడున్న వారిని కలిచి వేసింది. నగరంలోని టౌన్‌కొత్తరోడ్డు ప్రాంతంలో ఉంటున్న తమ్మిరి నూకరత్నం(21) నిండు గర్భిణి. వైద్య పరీక్షల కోసం శుక్రవారం నగరంలోని ఘోషా ఆసుపత్రికి వెళ్లింది. నాలుగు, ఐదు రోజుల్లో డెలివరీ జరిగే అవకాశముందని వైద్యులు చెప్పడంతో అక్కడి నుంచి ఆమె భర్త ఇంటికి వెళ్లింది. మధ్యాహ్నం భర్త, ఒదిన లక్ష్మి, కుమారునితో కలిసి జడ్జి కోర్టు ఎదురుగా గల బస్‌స్టాప్ వద్ద నిరీక్షిస్తుండగా కాంప్లెక్స్ నుండి జగదాంబ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఆమెను, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో గర్భవతి లక్ష్మిపై నుండి బస్సు వెళ్లడంతో ఆమె, కడుపులో ఉన్న శిశువు మృతి చెందారు. సంఘటనలో పసికందు బయటకు రావడంతో అక్కడి వాతావరణం విషాదంగా మారిపోయింది. హఠాత్పరిణామానికి విస్తుపోయిన స్థానికులు ఆ దృశ్యాని చూసి చలించిపోయి కన్నింటి పర్యంతమయ్యారు. కళ్ల ముందే భార్య మృతి చెందడంతో భర్త, ఆడపడుచు బోరుమన్నారు.

విజిలెన్స్ పేరిట అక్రమ వసూళ్లు: నలుగురి అరెస్ట్

ఎచ్చెర్ల, జూలై 29: వారం పదిరోజులుగా జిల్లాలో ఓ బృందం విజిలెన్స్ అధికారులమని ప్రైవేటు పాఠశాలల తనిఖీల పేరుతో బెదిరింపులకు పాల్పడి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన నలుగురిని అరెస్ట్ చేశామని ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విశాఖకు చెందిన జెటి రామారావు, మరో సమైక్యాంద్ర ఉద్యమ నేత లగుడు గోవిందరావుఆధ్వర్యంలో ఎయులో చదువుతున్న అవినాష్, నరేష్‌కుమార్, జగదీష్ ఒక బుగ్గ కారులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని 54 స్కూళ్ల నుంచి 8.5 లక్షల రూపాయలను పాఠశాలల యాజమాన్యాలను భయపెట్టి వసూలు చేశారని ఎస్పీ వెల్లడించారు. విజిలెన్స్ పేరిట భయపెట్టి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పది ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. వీరిని అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి పంపించామని, అనంతరం పోలీసు కస్టడీకు తరలించి విచారిస్తామన్నారు. కాగా మరో ఎయు విద్యార్థి జగదీష్ పరారీలో ఉన్నాడన్నారు. విలేఖరుల సమావేశంలో ఎఎస్పీ వివేకానంద కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ రాకెట్ గుట్టును రట్టు చేసేలా సమర్థవంతంగా విధులు నిర్వహించిన జె ఆర్ పురం సిఐ వై.రామకృష్ణ, ఎచ్చెర్ల, రణస్థలం నరససన్నపేట ఎస్సైలు వి.సందీప్‌కుమార్, సత్యన్నారాయణ, లక్ష్మణరావు, పొందూరు పిఎస్సై ఆశోక్‌లను ఎస్పీ అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు.

గ్రేటర్ రాయలసీమ నివురుగప్పిన నిప్పు!

కర్నూలు, జులై 29: గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం నినాదం మరుగున పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించవద్దని, ప్రజల్లో ఆ కోరిక నివురుగప్పిన నిప్పులా ఉందని మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి అన్నారు. కర్నూలులో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ప్రజల కోరిక మరింత పెరిగేలా పాలకుల చర్యలు ఉన్నాయన్నారు. రాయలసీమకు వరప్రసాదినిగా ఉన్న శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రా, తెలంగాణకు వరప్రసాదినిగా మార్చారని మండిపడ్డారు. భారీవర్షాలు కురుస్తూ వాగులు, వంకలు పొర్లుతుంటే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో పాలకులే చెప్పాలన్నారు. నిప్పులు గక్కిన వేసవిలో లేని తాగునీటి ఇబ్బందులు ఇప్పుడెలా వచ్చాయో అర్ధం చేసుకోలేనంత మూర్ఖులు ప్రజలు కాదన్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువ కింద పంటల సాగు కోసమే శ్రీశైలం నీటిని తరలిస్తున్నారన్నారు. మరి రాయలసీమవాసులేం కావాలని ప్రశ్నించారు. ఎగువన ఆల్మట్టి, జూరాల జలాశయాలు నిండి పోయాయని అక్కడి నుంచి 10 టిఎంసిలు తీసుకోకుండా ఇపుడిపుడే నీరు చేరుతున్న శ్రీశైలం జలాశయం నుంచి నీటిని దిగువకు తరలించి రాయలసీమవాసుల గొంతు కోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు పాలకులు చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఏదో ఒకనాడు వారిలో ఆగ్రహావేశాలు మిన్నంటి తమ ప్రతాపం చూపే రోజు దగ్గర్లోనే ఉందని గంగుల హెచ్చరించారు.

బ్యాక్‌లాగ్‌ల భర్తీలో జాప్యం సహించం

కాకినాడ, జూలై 29: అన్ని ప్రభుత్వ శాఖలు ఎస్సీ, ఎస్టీల పోస్టుల విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కారెం శివాజీ స్పష్టంచేశారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ జెఎన్‌టియులో ఎస్సీ, ఎస్టీ పోస్టుల రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ జెఎన్‌టియు అధికారులు, యాజమాన్యం రిజిస్టర్ల నిర్వహణలో పూర్తిగా విఫలమైందన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగ్గా పాటించడంలేదని, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయడంలేదన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు సంబంధించిన రికార్డులన్నీ వారం రోజుల్లోగా సాంఘిక సంక్షేమ శాఖ డిడితో పరిశీలన చేయించాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్యార్ధులకు అమలుచేసే సంక్షేమ పధకాలు కమిషన్ ముందు ఉంచడంలో సంబంధిత అధికారులు దృష్టిసారించలేదన్నారు. సమస్యల పరిష్కార నిమిత్తం జెఎన్‌టియులో ఒక ప్రత్యేక లైజన్ అధికారిని నియమించాలని సూచించారు. విద్యార్ధుల సమస్యలను లైజన్ అధికారి పరిష్కరిస్తారని శివాజీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల ఖాళీలు, అవుట్ సోర్సింగ్‌లో రిజర్వేషన్‌ను పాటిస్తున్నారా అనే అంశాలపై ఆరాతీశారు. బ్యాక్‌లాగ్ పోస్టులకి ప్రభుత్వ జిఓ విడుదల చేసిందని ఇందులో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో జెన్‌టియుకె వైస్- ఛాన్స్‌లర్ విఎస్‌ఎస్ కుమార్, రిజిష్ట్రార్ జివిఆర్ ప్రసాదరాజు, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంసుందర్ పాల్గొన్నారు.