రాష్ట్రీయం

28న టి.ఎమ్సెట్-3?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: తెలంగాణ ఎంసెట్-2ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో, తరువాతి కార్యక్రమాలను ‘యుద్ధప్రాతిపదికన’ చేపట్టాలని సర్కారు భావిస్తోంది. సిఎం కె చంద్రశేఖరరావు వద్ద శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తర్వాత మంత్రులు, అధికారులు తమ పరిధిలో చేపట్టాల్సిన పనులను వేగవంతం చేశారు. ఇప్పుడు ఎంసెట్-3కి ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. ఎమ్సెట్ -3కి ఆగస్టు తొవివారంలో నోటిఫికేషన్ జారీ చేసి, 28న పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 4లోగా ఫలితాలు వెల్లడించి, ఆలస్యం చేయకుండా తక్షణం కౌన్సిలింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అధికారికంగా సోమవారం ఎంసెట్-2 రద్దు ప్రకటన వెలువడిన వెంటనే ఎంసెట్-3 నోటిఫికేషన్ వెలువరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎంసెట్ (మెడిసిన్) పరీక్షల నిర్వహణ బాధ్యత వైద్యమంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి పర్యవేక్షణలో జరిగింది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ బాధ్యతను విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరికి అప్పగిస్తున్నట్టు తెలిసింది. వాస్తవంగా ఎంసెట్ నిర్వహణ విద్యాశాఖ చేపట్టిన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ హెల్త్ యూనివర్సిటీ చేపడుతుంది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం ఉదయం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో చర్చలు జరిపారు. ఎంసెట్-3 నిర్వహణకు ప్రభుత్వపరంగా పూర్తి సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైతే నిధులను ప్రభుత్వపరంగా విడుదల చేసేందుకు కూడా అంగీకరించారు.
ఇలాఉండగా ఎంసెట్-3 నిర్వహణ బాధ్యతను జెన్‌టియు (హైదరాబాద్)కే అప్పగిస్తున్నారు. పరీక్ష నిర్వహణకు మరో సంస్థను ఎంపిక చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని తేల్చివేశారు. ఎంసెట్ పరీక్షలకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఎన్‌వి రమణారావునే ఎంసెట్-3కి కూడా కొనసాగించాలని భావిస్తున్నారు. రమణారావును మార్చాలని ఒక దశలో ప్రభుత్వం భావించింది. అందుకు తగిన వ్యక్తి దొరికితే మార్చే అవకాశం ఉంది. రమణారావును మారుస్తారా? లేదా? అన్న అంశం రెండుమూడు రోజుల్లో తేలిపోతుంది. అయితే జెన్‌టియు వైస్ ఛాన్సలర్ వేణుగోపాల్‌రెడ్డి శనివారం ఎంసెట్-2 కన్వీనర్ రమణారావుతో భేటీ అయ్యారు. ఎంసెట్-3 పరీక్షల బాధ్యతలను జెన్‌టియుకే అప్పగిస్తామని సిఎం కెసిఆర్ చెప్పారని, అందువల్ల ఎంసెట్-3ని పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించారు. సాంప్రదాయంగా వస్తున్న విధానాలకు భిన్నంగా ఎంసెట్-3ని నిర్వహించాలని, గతంలో ఉన్న సిబ్బందిని పూర్తిగా మార్చాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కూడా శనివారం తన ఛాంబర్‌లో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం, ఎంసెట్-3 నిర్వహణలపై చర్చలు జరిపారు. ఎంసెట్-3 నిర్వహణను జెన్‌టియుకే అప్పగించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. ఎంసెట్ నిర్వహణను ఎవరికి అప్పగించాలన్న అంశంపై ఈ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. శనివారం జరిగిన పరిణామాల ఫలితాలు ఈవిధంగా ఉన్నాయి. ఎంసెట్ (మెడిసిన్ స్ట్రీం)-3కి నోటిఫికేషన్ ఆగస్టు మొదటి వారంలో ఇస్తారు. ఆగస్టు 28న (ఆదివారం) పరీక్ష నిర్వహిస్తారు. సాధారణంగా నోటిఫికేషన్ ఇచ్చిన 30నుంచి 40 రోజుల్లోగా పరీక్ష నిర్వహించాలి. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మొత్తం వ్యవహారాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నారు. సెప్టెంబర్ 4లోగా ఫలితాలు వెల్లడిస్తారు. తర్వాత కౌన్సిలింగ్ చేపడతారు. అక్టోబర్‌లో మెడిసిన్, బిడిఎస్ తదితర కోర్సుల క్లాసులు ప్రారంభమవుతాయి. ప్రభుత్వ పరువు కాపాడేలా ఎంసెట్-3ని నిర్వహించాలని నిర్ణయించారు.

చిత్రం.. సచివాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసు బలగాలు