రాష్ట్రీయం

ఏపి కొత్త సచివాలయానికి మరో ముగ్గురు మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మరో మూడు కీలక విభాగాలను తరలించారు. ఇప్పటి వరకు ఐదు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. గురువారం రెండో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పురపాలకశాఖ మంత్రి పి నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి ఎంపి కన్నబాబు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనూరాధ తమ చాంబర్లను ప్రారంభించారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు హాజరయ్యారు. కాగా ఐదో బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్‌లో రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తన పేషీని లాంఛనంగా ప్రారంభించారు. రవాణాశాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని విజయవాడ పీఎన్‌బీఎస్‌లో ఈ నెలాఖరుకు ప్రారంభిస్తామని, రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు తన చాంబర్లు సచివాలయంలో అందుబాటులో ఉంటాయని మంత్రి శిద్దా తెలిపారు. ఉదయం 9.45 గంటలకు మంత్రి నారాయణ, 11 గంటలకు శిద్దా రాఘవరావు, 12.30 గంటలకు డిప్యూటీ సిఎం చినరాజప్ప శాస్త్రోక్తంగా కార్యాలయాల్లో ప్రవేశించారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణతో పాటు హోం, పురపాలకశాఖ, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇనె్వస్టుమెంట్ డిపార్టుమెంట్‌తోపాటు మెప్మా తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులలో తరలివచ్చి కార్యాలయాల్లో వసతులను పరిశీలించారు. ఈ నెల పదో తేదీలోగా మిగిలిన అన్ని విభాగాలను ఇక్కడికి తరలించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. కాగా స్వస్థలంలో విధులు నిర్వర్తించటం తమకు ఆనందంగా ఉందని, సచివాలయానికి తరలిరావటంలో తమకెలాంటి ఇబ్బందులులేవని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. మంత్రులే తమ కార్యాలయాలను ఏర్పాటుచేసుకుంటే తమను మినహాయించాలని కోరటం సమంజసంకాదని ప్రభుత్వమిచ్చిన పిలుపుతో ఇబ్బందులకోర్చి తరలి వస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా మునిసిపల్ మంత్రి నారాయణ మెప్మా ఉద్యోగులతో కలసి సచివాలయంలో కోలాటమాడటంతో పాటు పెద్దఎత్తున తరలివచ్చిన ఉద్యోగులతో ఆనందంగా గడిపారు. రెండో బ్లాక్ నిర్మాణం చేపట్టిన షాపోర్ జీ, పల్లోంజీ సంస్థలకు చెందిన కూలీలు మంత్రి నారాయణకు సచివాలయ భవన నిర్మాణ పనులను వివరించడంతో పాటు నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేస్తామని ఇందుకోసం ఎంతటి కష్టాన్నయినా భరిస్తామని భరోసా ఇచ్చారు.
వచ్చే నెల 20నాటికి శాసనసభ భవనం పూర్తి
సచివాలయం నుంచి మరి కొద్దిరోజుల్లో పాలనాయంత్రాంగం సేవలందిస్తారని, వచ్చే నెల 20వ తేదీ నాటికి శాసనసభ భవనాలు సైతం సిద్ధమవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో తన చాంబర్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల్లో రెండో బ్లాక్ మొదటి అంతస్తుకు ఆర్థిక, రెవెన్యూ శాఖలు తరలివస్తాయని చెప్పారు. వచ్చే శాసనసభ సమావేశాలను సొంత రాజధానిలో నిర్వహించాలనే సంకల్పంతో సిఎం చంద్రబాబు లక్ష్యాలను నిర్దేశించారని వివరించారు.
పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు
కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో తన పేషీని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూకబ్జాలు, గనుల తవ్వకాలు, స్మగ్లింగ్ కార్యకలాపాలు పెచ్చరిల్లాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేరాల నియంత్రణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అక్రమాలకు అడ్డుకట్ట వేసిందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో అరికట్టామని తెలిపారు.
మరిన్ని అదనపు బలగాలు: డీజీపీ
కృష్ణా పుష్కరాల కోసం అవసరమైతే కేంద్రం, ఇతర రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను రప్పిస్తామని ఇందుకు తగిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని డీజీపీ నండూరి సాంబశివరావు మీడియాకు వివరించారు. ఇప్పటి వరకు 24వేల మందిని బందోబస్తుకు కేటాయించామన్నారు. కర్నాటక, చత్తీస్‌గఢ్, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా కొన్ని బలగాలు వస్తాయని చెప్పారు.

చిత్రం.. సచివాలయంలో తన కార్యాలయాన్ని ప్రారంభించి చాంబర్‌లో పూజలు చేస్తున్న మంత్రి నారాయణ