రాష్ట్రీయం

మోదీ- కెసిఆర్ కొత్త స్నేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారిగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ ఈనెల ఏడవ తేదీన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆగస్టు 7 ప్రపంచ స్నేహితుల దినోత్సవం. అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. తెలంగాణ ఏర్పడిన తరువాత మోదీ ఇప్పటి వరకు తెలంగాణలో అడుగు పెట్టలేదని పలు సందర్భాల్లో టిఆర్‌ఎస్ విమర్శలు చేస్తూ వచ్చింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపిపై ప్రధానంగా ఈ అంశంపైనే విమర్శలు చేసింది. తెలంగాణ ఏర్పాటులో విపక్షంగా బిజెపి సహకరించినా, నరేంద్ర మోదీ మాత్రం తెలంగాణపై ఇప్పటివరకు బహిరంగంగా సానుకూలత వ్యక్తం చేయలేదు. పైగా ఎన్నికల సమయంలో ఆంధ్రలో బాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ బలవంతంగా తల్లీబిడ్డను వేరు చేశారని విమర్శలు చేశారు.
ప్రత్యేక హోదా కోసం ఆంధ్రలో ఆందోళనలు సాగుతున్న సమయంలో మోదీ తెలంగాణ పర్యటన ఆసక్తికలిగిస్తోంది. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని బిజెపిపై అధికారంలో ఉన్న టిడిపి విమర్శలు ఎక్కుపెట్టిన సమయంలో మోదీ తెలంగాణ పర్యటనలో ఇచ్చే హామీలు, చేసే ప్రకటనలపై రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన పలు హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని తెలంగాణ నాయకత్వం ఇప్పటి వరకు విమర్శిస్తూ వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని గజ్వేల్‌లో ప్రారంభించనున్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా ఆసక్తిరేకెత్తించింది. నీతి ఆయోగ్ సైతం అన్ని రాష్ట్రాలకు ఈ పథకాన్ని పరిశీలించాలని, తమతమ రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించింది. ప్రధానమంత్రి సైతం ఈ పథకంపై ఆసక్తి చూపడంతో, ముఖ్యమంత్రి కెసిఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనే ఈ పథకాన్ని ప్రధానమంత్రితో ప్రారంభోత్సవం చేయించాలని నిర్ణయించారు. ఉదయం గజ్వేల్‌లో ఈ పథకాన్ని ప్రారంభించి తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని, పథకాలను ప్రధాని వివరిస్తారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే బిజెపి బహిరంగ సభలో టిఆర్‌ఎస్‌పై బిజెపి నేతగా విమర్శలు చేయాల్సి ఉంటుంది.
తెలంగాణకు సంబంధించి హామీలను అమలు చేయమని డిమాండ్ చేయడం మినహా ఇప్పటివరకు కెసిఆర్ ప్రధానమంత్రిపై, కేంద్రంలో బిజెపి పాలనపై పెద్దగా విమర్శలు చేయలేదు. ఒకవైపు రాష్ట్రంలో ఎంఐఎంతో స్నేహాన్ని కొనసాగిస్తూనే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పట్ల కెసిఆర్ సానుకూలంగా ఉంటున్నారు. అంశాల వారీగా మద్దతు ఇస్తాం , అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఒత్తిడి తీసుకు వచ్చి సాధించుకుంటామని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వంలో చేరమని స్వయంగా కెసిఆర్ ఎంఐఎంను ఆహ్వానించారు. ఎంఐఎం దానికి ఒప్పుకోలేదు. ఇక బిజెపి ప్రభుత్వం పట్ల కెసిఆర్ సానుకూలంగా ఉండడంతో ఎన్‌డిఏలో టిఆర్‌ఎస్ చేరుతుందని రెండేళ్లనుంచి ప్రచారం సాగుతూనే ఉంది. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, కేంద్రంతో ఘర్షణ వైఖరి అనవసరం అని కెసిఆర్ టిఆర్‌ఎస్‌ఎల్‌పి, టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఇక తెలంగాణ బిజెపి నాయకులు మాత్రం 2019లో మేం అధికారంలోకి వస్తాం, మోదీ బహిరంగ సభ నుంచి తెలంగాణ ప్రభుత్వంపై మా పోరాటం ఉధృతంగా సాగుతుందని చెబుతున్నారు. హైకోర్టు విభజనతో పాటు విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన పలు హామీల అమలు గురించి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో చెబుతారని ప్రభుత్వం ఆశిస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణ ఆశిస్తున్న వివిధ అంశాలపై ప్రభుత్వం ఒక నివేదిక రూపొందించింది.