రాష్ట్రీయం

నీట మునిగిన సంగమేశ్వరాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 6: కర్నూలు జిల్లాలోని సప్తనదీ సంగమేశ్వరుడు జలాధివాసంలోకి వెళ్లిపోయారు. గత ఎనిమిది నెలలుగా భక్తుల పూజలతో కళకళలాడిన ఆలయం శనివారం కృష్ణాజలాల్లో మునిగిపోయింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 840 అడుగులకు చేరుకోగానే ఆలయంలోకి నీరు ప్రవేశించింది. శనివారం ఉదయానికి ఆలయం మొత్తం నీట మునిగి శిఖరం మాత్రమే దర్శనమిస్తోంది. మరో 10 అడుగుల మేర నీటిమట్టం పెరిగితే శిఖరం కూడా మునిగిపోతుంది. గత రెండేళ్లలో ఏకంగా 512 రోజులు సంగమేశ్వరుడు భక్తుల పూజలందుకున్నాడని ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. ఆలయం మునిగిపోతున్న సమయంలో ఆయన నాటుపడవలో ఆలయ శిఖరం వద్దకు చేరుకుని శిఖర పూజలు నిర్వహించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఆలయం బయట పడకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే సంగమేశ్వరం వద్ద పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు శివుడిని కృష్ణమ్మ అభిషేకించిన నీటిలో పుష్కర స్నానం చేసినట్లవుతుందని తెలిపారు. అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి కృష్ణా జలాలతో నిత్యాభిషేకం జరుగుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

చిత్రం..వరద నీటిలో మునిగిపోయిన సంగమేశ్వరాలయం