రాష్ట్రీయం

పుష్కరాల్లో రోజూ 22 గంటలు దుర్గమ్మ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఆగస్టు 10: కృష్ణా పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులకు రోజుకు 22 గంటల పాటు దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఇవ్వాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. కేవలం 2 గంటలపాటే అమ్మవారి దర్శనాన్ని నిలుపుదల చేస్తారు. అమ్మవారికి నివేదన, అలంకారం, నైవేద్యం కోసమే ఈ రెండు గంటలు దర్శనం నిలుపుదల చేస్తారు. బుధవారం ఉదయం దుర్గగుడి పరిపాలనా కార్యాలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ సూర్యకుమారి విలేఖర్లతో మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ తెల్లవారు ఝాము ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తుల క్యూమార్గంలో రద్దీని తగ్గించడానికే అంతరాలయ దర్శనం, శఠగోపం, తదితర సేవలను రద్దు చేసినట్లు చెప్పారు. విఐపి దర్శనం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిమితం చేసినట్లు తెలిపారు.
ప్రతిరోజూ సుమారు 25 వేల మంది భక్తులకు బఫే పద్ధతిలో అన్నదానం ఏర్పాటు చేసినట్లు వివరించారు. సాధారణ భక్తులు అమ్మవారిని త్వరితగతిన దర్శించుకునేందుకు వీలుగా విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన 700 మంది సిబ్బంది, 600 మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలు, 1000 మంది ఎన్‌సిసి వలంటీర్లు, తదితరుల సేవలను వినియోగించుకుంటున్నామని సూర్యకుమారి వివరించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ వైవి అనూరాధ మాట్లాడుతూ భవిష్యత్తులో దుర్గగుడిని తిరుమల - తిరుపతి దేవస్థానం స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జెవిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో మల్లికార్జున మహా మంటపాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, కృష్ణా పుష్కరాల అనంతరం ఈ పనులు ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. ఈసందర్భంగా కృష్ణా పుష్కరాల ప్రత్యేక పోస్టల్ కవర్‌ను ప్రసాద్ ఆవిష్కరించారు. పోస్టల్ డైరెక్టర్ కె సోమసుందరం మాట్లాడుతూ పోస్టల్ కవర్ విలువ పది రూపాయలని, పుష్కర జలాలు కావాల్సిన వారు రూ.30 చెల్లిస్తే పోస్టల్ శాఖ ద్వారా బాటిల్‌లో అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో దేవస్థానం సహాయక ఇవో శ్రవణం అచ్యుతరామయ్య నాయుడు, దేవస్థానం స్థానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్ పాల్గొన్నారు.

పోస్టల్ కవర్‌ను విడుదల చేస్తున్న అధికారులు