రాష్ట్రీయం

కృష్ణం.. వందే పుష్కరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్రం కృష్ణా మహా పుష్కర శోభ సంతరించుకుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత వచ్చిన కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశిస్తున్న సందర్భంలో కృష్ణా పుష్కరాలు శుక్రవారం తెల్లవారుజామున 5.58కు ప్రారంభమవుతాయని పండితులు ప్రకటించారు. తెలంగాణలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలోని అలంపూర్ జోగులాంబ, బీచ్‌పల్లి హనుమాన్ ఆలయం, మట్టపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయం, శ్రీ రంగాపూర్, జటప్రోలు, కొల్లాపూర్, తంగిడి, కృష్ణ రైల్వేస్టేషన్ వద్దనున్న దత్తాత్రేయ ఆలయం, సోమశిల తదితర ప్రాంతాల ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో పెద్దఎత్తున ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలతో పుష్కర శోభ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సిఎం కెసిఆర్ గత ఆరు నెలలుగా పుష్కర పనులు సమీక్షించడమేక కాదు, గురువారమే అలంపూర్ చేరుకుని అక్కడి ఏర్పాట్లు పర్యవేక్షించారు. రాష్ట్ర మంత్రులు అలోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జగదీశ్వరరెడ్డి తదితరులు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని వేర్వేరు పుష్కర ఘాట్లకు వెళ్లి పనులు దగ్గరుండి పర్యవేక్షించారు. పుష్కర ఘాట్లకు వెళ్లేందుకు రోడ్ల నిర్మాణం, స్నానపుఘాట్ల నిర్మాణం, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు తదితర వౌలిక సదుపాయాలు కల్పించడం కోసం దాదాపు వెయ్యికోట్లు ఖర్చు చేసినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2004 వరకు జరిగిన కృష్ణా పుష్కరాలకు తెలంగాణలో పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. గతంలో తెలంగాణ నుంచి కూడా కృష్ణా పుష్కరాల సమయంలో భక్తులు విజయవాడ వెళ్లేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. గోదావరి పుష్కరాలతో తెలంగాణలో పుష్కరాలకు ప్రాధాన్యత లభిస్తోంది. కృష్ణా పుష్కరాలకు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో 81 స్నానపు ఘాట్లు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తులు పుష్కర స్నానాలకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 12నుంచి 23 వరకూ జరుగుతున్న కృష్ణా ఆది పుష్కర స్నానాలకు కనీసం మూడు కోట్లమంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనావేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి కృష్ణా పుష్కరాలు జరుగుతుండటంతో, వీటిని ప్రతితిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో 52 స్నానపుఘాట్లు, నల్లగొండ జిల్లాలో 28 స్నానపుఘాట్లు ఏర్పాటు చేశారు. ఘాట్లవద్ద భక్తులకు ఎలాంటి ప్రమాదం ఏర్పడకుండా పడవలు, గజీతగాళ్లను నియమించారు. ఇదిలావుంటే, సిఎం స్వయంగా ఆలంపూర్ సమీపంలోని గొందిమళ్ల వద్ద పుష్కరస్నానం చేసి పుష్కరాలను ప్రారంభిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మఠాధిపతులు, పీఠాధిపతులు, యోగులు, సన్యాసులు తొలిరోజు పుష్కరస్నానం చేసేందుకు వస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ 1365 బస్సులను రోజూ వివిధ ఘాట్లకు నడిపించేందుకు ఏర్పాట్లు చేసింది. మహబూబ్‌నగర్ రీజియన్ నుంచి 434 బస్సులు, నల్లగొండ జిల్లా నుంచి 230 బస్సులు, రంగారెడ్డి జిల్లా నుంచి 175, మెదక్ నుంచి ఏడు, ఆదిలాబాద్ రీజియన్ నుంచి 15, కరీంనగర్ నుంచి 50, ఖమ్మం రీజియన్ నుండి 255, వరంగల్ నుండి 50, నిజామాబాద్ నుండి 50 బస్సులను ప్రత్యేకంగా నడిపిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి విజయవాడ వెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎక్కువ మొత్తంలో బస్సులను మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని వివిధ పుష్కర ఘాట్లను నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రైవేట్ సంస్థలు కూడా పుష్కరఘాట్లకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో మాగనూరు, మక్తల్, గద్వాల, ఆత్మకూరు, పెబ్బేరు, ధరూరు, వీపనగండ్ల, ఆత్మకూరు, ఆలంపూర్ తదితర ప్రాంతాల్లో స్నానపుఘాట్లు ఏర్పాటు చేశారు. అలాగే నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, పెద్దమునగాల, మట్టపల్లి, వాడపల్లి ప్రాంతాల్లో స్నానపు ఘాట్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయితీరాజ్, తాగునీటి సరఫరా, రోడ్లుభవనాలు, రవాణా, అగ్నిమాపకదళం, నీటిపారుదల తదితర శాఖల సిబ్బంది పుష్కరాల కోసం పని చేస్తున్నారు. పుష్కరాలు జరిగే అన్ని ప్రాంతాల్లోనూ భక్తులకోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను సాంస్కృతిక శాఖ రూపొందించింది.