రాష్ట్రీయం

దగాపడిన అన్నదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 16: రైతు సంక్షేమం అజెండాతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ, కెసిఆర్ హామీలను తుంగలోతొక్కి రైతులను నిలువెల్లా దగా చేశారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు. రుణమాఫీ, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర సాధన కోసం రైతులకు అండగా కాంగ్రెస్ గల్లీనుండి ఢిల్లీవరకు పోరాటాలు సాగిస్తోందన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చి రైతు సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ రైతుగర్జన పేరిట బహిరంగ సభ నిర్వహించింది. సభలో రాష్ట్ర, జిల్లా నేతలంతా విభేదాలు మర్చి ఐక్యతారాగం వినిపించారు. సభలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం, కమిషన్లకు కక్కుర్తిపడి కెసిఆర్ ప్రభుత్వం ఆనాలోచిత విధానాలతో సాగునీటి ప్రాజెక్టులకు ప్రజా సొమ్ము దుర్వినియోగం చేస్తోందని, కాంగ్రెస్ పాలనలో చేపట్టిన ప్రాజెక్టుల డిజైన్ల మారుస్తూ రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ పప్పు దినుసు పంటలు ప్రోత్సహించకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటానని ప్రకటిస్తూ, దేశ రైతులపై నమ్మకం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పప్పు దినుసుల ఉత్పత్తిపై కార్యాచరణ లేకుండా పోయిందని, దేశ వ్యాప్తంగా పప్పు దినుసుల ధరలు ఆకాశాన్ని అంటుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణ లేకపోగా, పంటకు కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రైతు సమస్యలు పరిష్కరిస్తామని హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టిన సిఎం కెసిఆర్‌ను ప్రజలు ఇక నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందనడానికి ఈ బహిరంగ సభే నిదర్శనమన్నారు. పత్తి సాగులో ఆగ్రగామియైన తెలంగాణలో పత్తి సాగు చేయొద్దని సిఎం ప్రకటించి రైతులను అయోమయంలో నెట్టేశారన్నారు. రాష్ట్రంలో పత్తి పరిశ్రమలు మూతపడి ఉపాధి దెబ్బ తింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారి వ్యవస్థతో కెసిఆర్ కుమ్మక్కై వందకోట్ల టెక్స్‌టైల్ పార్క్ ప్రాజెక్టు అంచనాను 200 కోట్లకు పెంచి జిమ్మిక్కులు చేస్తున్నారే తప్ప, దీనివల్ల ప్రజల ప్రయోజనాలు తీరవన్నారు. రైతు సమస్యలపై కార్యకర్తలు సమరశంఖం పూరించాలని, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని దిగ్విజయ్ పిలుపునిచ్చారు. ఏఐసిసి కార్యదర్శి రాంచంద్ర కుంతియా మాట్లాడుతూ గత ఏడాది రాహుల్ చేపట్టిన రైతు భరోసా యాత్రకు ఆదిలాబాద్ జిల్లాలో విశేష స్పందన లభించిందని, తిరిగి ఈ జిల్లాలో రైతు గర్జనకు ప్రజలు పెద్దఎత్తున హాజరవ్వడం చూస్తుంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం ఖాయమనిపిస్తోందన్నారు. మైనార్టీలు, గిరిజనుల రిజర్వేషన్లపై సిఎం కెసిఆర్ ఇస్తోన్న హామీలు ఉత్తి మోసమన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఏకకాలంలో రుణమాఫీ ఫార్సుగా మారిందన్నారు. సభలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నేతలు సబితా ఇంద్రారెడ్డి, షబ్బీర్ అలీ, వి హనుమంతరావు, జానారెడ్డి, చిన్నారెడ్డి, బలరాం జాదవ్, మధుయాష్కి, జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కాంగ్రెస్ ర్యాలీలో ఎడ్లబండిపై వస్తున్న దిగ్విజయ్‌సింగ్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు