రాష్ట్రీయం

ప్రస్తుతానికి జోనలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: కొత్త జిల్లాలకు ప్రస్తుతానికి జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల కేటాయింపు జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో జరిగే నియామకాలకు మాత్రమే జోనల్ విధానం అవసరమా? కాదా? అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత ఉద్యోగుల సీనియార్టీకి, పదోన్నతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటూనే జోనల్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. కొత్త జిల్లాల పరిపాలన వ్యవస్థ, ఉద్యోగుల కేటాయింపు, జోనల్ విధానం తదితర అంశాలపై సచివాలయంలో గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాలతో సమావేశమయ్యారు.
కొత్త జిల్లాల ఏర్పాటు తక్షణమే జరుగనుండటంతో కొత్తగా నియామకాలు లేకుండానే ప్రస్తుతం ఉన్న ఉద్యోగులనే సర్దుబాటు చేయబోతున్నట్టు రాజీవ్ శర్మ వెల్లడించారు. టిఎన్‌జివో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు, అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్, గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు మమత, నగర అధ్యక్షుడు కృష్ణయాదవ్ తదితరులు తమ సంఘాల తరఫున వాదన వినిపించారు. జోనల్ విధానంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా జరిగిన అన్యాయాన్ని పూడ్చడానికి జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని దేవిప్రసాద్ కోరారు. అయితే జోనల్ వ్యవస్థ స్ఫూర్తి దెబ్బకుండా జిల్లాస్థాయిల్లో నియామకాలు జరపాలని, తర్వాతనే రాష్టస్థ్రాయి నియామకాలు జరగాలని సూచించారు. కొత్త జిల్లాలకు కేటాయించే ఉద్యోగులకు అప్షన్లు పెట్టుకునే వెసులుబాటు కల్పించాలని దేవిప్రసాద్ కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటును తమ సంఘం స్వాగతిస్తుందన్నారు. కొత్త జిల్లాల నుంచి పాలన సజావుగా జరగడానికి ఉద్యోగుల నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని రవీందర్‌రెడ్డి హామీ ఇచ్చారు.
తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు పద్మాచారి మాట్లాడుతూ జోనల్ వ్యవస్థ స్ఫూర్తి దెబ్బకుండా భవిష్యత్‌లో ఉద్యోగ నియామకాలు జరగాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ఉద్యోగుల పాత ప్యాటర్న్‌ను కొనసాగించాలన్నారు. కొత్త జిల్లాలకు సరిపడినంత ఉద్యోగులు లేరన్న కారణంగా శాఖలను కుదించే యోచన వద్దని పద్మాచారి సూచించారు. జిల్లాలు కొత్తవైనా పాతవైనా ఉద్యోగులు ఒకేరకమైన విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని అన్నారు. తెలంగాణ సచివాలయ సంఘ అధ్యక్షుడు మాధవరం నరేందర్‌రావు మాట్లాడుతూ కొత్త జిల్లాల కలెక్టరేట్లలో మొదట రెవిన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాతనే ఇతర శాఖలకు కేటాయింపులు జరగాలన్నారు. పెరుగనున్న కొత్త జిల్లాలకు అనుగుణంగా సచివాలయంలో హెచ్‌ఒడీలతో పాటు ఇతర క్యాడర్ సంఖ్యను పెంచాలని సూచించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జోనల్ వ్యవస్థను కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
ఇలాఉండగా ఉపాధ్యాయ సంఘాల తరఫున ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్, జనార్దన్‌రెడ్డితో పాటు వివిధ సంఘాల తరఫున ప్రతినిధులు హాజరయ్యారు. అయితే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు జోనల్ వ్యవస్థ రద్దు చేయాలని కోరగా, మరికొన్ని సంఘాలు జోనల్ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశాయి. జోనల్ వ్యవస్థను రద్దు చేయడం వల్ల భవిష్యత్‌లో జరిగే నియామకాల్లో వెనుకబడిన జిల్లాలకు మళ్లీ అన్యాయం జరిగే ప్రమాదం లేకపోలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.