తెలంగాణ

ఫైనల్‌కు కొత్త జిల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత కొత్త జిల్లాలను శనివారం అఖిలపక్షం ముందుంచబోతుంది. కొత్తగా అదనపు జిల్లాలను ప్రతిపాదించాల్సిన అవశ్యకతను ప్రతిపక్షాలకు వివరించిన అనంతరం, వాటి ఆమోదానికి సాయంత్రం మంత్రిమండలి సమావేశం కాబోతుంది. మంత్రిమండలి ఆమోదం పొందిన తర్వాత రెండు రోజులు అనంతరం కొత్త జిల్లాలపై ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాలకు 30 రోజుల గడువిచ్చిన అనంతరం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్ సెప్టెంబర్ 25లోగా విడుదల చేసేందుకు ప్రభుత్వం రోడ్ మ్యాప్ సిద్థం చేసుకుంది. ఆలోగా కొత్త జిల్లాలకు వౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగులు, సిబ్బంది, అధికారుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. ఇలావుండగా, కొత్తగా 17 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో ప్రస్తుత 10 జిల్లాలు కలిపి రాష్ట్రంలో 27 జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇవి దసరా నుంచి మనుగడలోకి రానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా కసరత్తు చేసింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని మొదట మంత్రిమండలి నిర్ణయించింది. తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి కొత్త జిల్లాలపై అధ్యయనం చేసి నివేదిక తెప్పించుకుంది. కొత్త జిల్లాలకు అవసరమైన పాలనాపరమైన వ్యవస్థ (కలెక్టర్ కార్యాలయాలు, ఉద్యోగులు, అధికారుల కేటాయింపు, ఇతర వౌలిక సదుపాయాలు) తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అధ్యక్షతన మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత వారంకిందట ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘం జిల్లాలవారీగా ప్రజాప్రతినిధులతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తీసుకుంది. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయ, సిబ్బంది సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారినుంచి కూడా కొత్త జిల్లా ప్యాటర్న్‌పై సూచనలు, సలహాలు సేకరించింది. అనంతర మంత్రివర్గ ఉప సంఘం తన అధ్యయన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. తొలుత సిఎం కెసిఆర్ కొత్తగా 14 జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నట్టు స్వయంగా ప్రకటించారు. అయితే మంత్రివర్గ ఉప సంఘం, ప్రజాభిప్రాయ సేకరణలో 17 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయి. దీంతో 14 కాకుండా 17 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల్లో వరంగల్ జిల్లా జనగామ, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల జిల్లాల కోసం అనేక ఆందోళనలు జరిగినప్పటికీ మంత్రివర్గ ఉప సంఘం వాటిని పరిగణనలోకి తీసుకోకుండా తిరస్కరించింది. కొత్త జిల్లాల కసరత్తులో అనూహ్యంగా చివరి దశలో నాలుగు జిల్లాలు తెరపైకి వచ్చాయి. వీటిలో రంగారెడ్డి జిల్లా నుంచి శంషాబాద్, మల్కాజ్‌గిరి, కరీంనగర్ జిల్లా నుంచి పెద్దపల్లి, వరంగల్ జిల్లా నుంచి హన్మకొండ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 17 జిల్లాలను శనివారం జరుగనున్న అఖిలపక్ష సమావేశం ముందు పెట్టి అనంతరం వాటి ఆమోదానికి మంత్రిమండలి సమావేశం కాబోతుంది. కొత్త జిల్లాల ఏర్పాటులో శనివారం జరుగబోయే అఖిలపక్ష సమావేశం, మంత్రిమండలి సమావేశం కీలక ఘట్టం కాబోతుంది.