రాష్ట్రీయం

ఉద్యోగులకు డిఎ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డిఎ మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. శనివారం విజయవాడ సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు వివరించారు. డిఏ పెంపు వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి 1178.76 కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు. నెలకు 98.23 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పారు. ఉద్యోగులకు జూలై నెలాఖరు వరకూ రావల్సిన డిఏ బకాయిలను వారి వారి పిఎఫ్ ఖాతాలకు జమ చేస్తామని, ఆగస్ట్ నెల నుంచి ఉద్యోగుల జీతాల్లో విలీనం చేస్తామని సిఎం చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటుగా పిఆర్‌సి అమలు కాలేదని, ప్రస్తుతానికి ఆ ఉద్యోగులకు కూడా పిఆర్‌సిని అమలు చేస్తామని, భవిష్యత్‌లో వారికి పిఆర్‌సి ఇచ్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదని సిఎం స్పష్టం చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం 1968 47(1)లో అపరాధ రుసుము లక్ష రూపాయలకు మించకుండా అన్న పదాన్ని తొలగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నేరాన్ని బట్టి అప్పటికప్పుడు అపరాధ రుసుము విధించే అవకాశం కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఐటి రంగంలో మరింత మందికి ఉద్యోగావకాశాలు లభించేందుకు వీలుగా ఆయా కంపెనీలకు రాయితీలను ప్రకటిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వమే భూమిని కేటాయించిన ఐటి కంపెనీ ఒక వ్యక్తికి ఉద్యోగాన్ని ఇస్తే, ఆ కంపెనీకి 50 వేల రూపాయలు ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. అలాగే భూమి ఇవ్వని కంపెనీ ఒక వ్యక్తికి ఉద్యోగాన్ని ఇస్తే లక్ష రూపాయల రాయితీ ఇస్తుంది. అలాగే ఎంఎస్‌ఎంఇ, మహిళా, ఎస్సీ, ఎస్టీలు స్థాపించిన కంపెనీల్లో ఒక్కో ఉద్యోగానికి లక్షా 50 వేల రూపాయల రాయితీ ప్రకటించింది.
విజయవాడ, తిరుపతి నగరాల్లో పెండింగ్‌లో ఉన్న గృహాలను పూర్తి చేయడానికి 211.56 కోట్ల రూపాయలు కావల్సి ఉంది. ఇందుకుగాను 180 కోట్ల రూపాయలను ప్రభుత్వం గ్యారెంటీతో హడ్కో నుంచి రుణంగా తెచ్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.
‘కేంద్రం సహాయంపై స్పష్టత లేదు’
కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న ఆర్థిక సహాయంపై విలేఖరులు ప్రశ్నించగా, కేంద్రం రాష్ట్రానికి ఎంత మొత్తం ఇవ్వనుందో స్పష్టత లేదని అన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ఏటా ఇవ్వాల్సిన మొత్తాన్ని మాత్రమే ఇస్తోందని, లోటు బడ్జెట్‌ను పూడ్చేందుకు చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబు చెప్పారు.
పేరు మార్చడానికి అభ్యంతరం లేదు!
విజయవాడ పేరును బెజవాడగా మార్చమని ఒకరు తనకు లేఖ రాసిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విజయవాడ పేరు బాగానే ఉందికదా! ఎవరో ఒక వ్యక్తి పేరు మార్చమని కోరినంత మాత్రాన మార్చలేమని, ఇక్కడ ప్రజలు సెంటిమెంట్‌గా కోరితే, పేరు మార్చడానికి తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
వెమ్ టెక్నాలజీస్‌కు 350 ఎకరాలు
పశ్చిమగోదావరి జిల్లా వట్లూరు గ్రామం, పెదవేగి మండలం భోగాపురం గ్రామంలో 350 ఎకరాల స్థలాన్ని ఏపిఐఐసి ద్వారా వెమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించింది. 2,135 కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటుకానుంది. ఇందులో 2510 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎపిసిఆర్‌డిఏ పరిధిలోని 200 ఎకరాల భూమిని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫార్సు మేరకు ఎకరా 50 లక్షల చొప్పున ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీకి కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామంలోని 37.19 ఎకరాల భూమిని ఎకరా రెండు లక్షల చొప్పున భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ టెస్ట్‌బెడ్ ఫెసిలిటీ ఫర్ రాడార్స్ అండ్ వెపన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కోసం కేటాయించింది. విశాఖ జిల్లా పెదగంట్యాడ గ్రామంలోని 22.68 ఎకరాల భూమిని వుడాకు కేటాయించింది.
ఇదిలాఉండగా రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌లను భర్తీ భర్తీ చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
సిఎస్‌టిపై కీలక నిర్ణయం
ఇదిలాఉండగా వ్యాపారులు చెల్లించే సెంట్రల్ సేల్స్ టాక్స్ (సిఎస్‌టి) కింద రెండు శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ టాక్స్‌ను వ్యాపారులు చాలాకాలంగా చెల్లించడం లేదు. ఇదేమంటే, తమకు తెలియదని ప్రభుత్వానికి సమాధానం చెప్పారు. అందువలన 2011 నుంచి 2014 మధ్య చెల్లించాల్సిన సిఎస్‌టిని మాఫీ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి ఇప్పటి వరకూ చెల్లించాల్సిన సిఎస్‌టిని ఈ ఏడాది డిసెంబర్‌లోగా వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాలి. లేకుంటే, పాత బకాయిలను కూడా చెల్లించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

చిత్రం.. విజయవాడలో శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు