రాష్ట్రీయం

సాయిధామం ధర్మాధికారి మాతా శుకవాణి అస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కీసర, ఆగస్టు 20: హైదరాబాద్ శివార్లలోని కీసర సమీపంలో ఉన్న శ్రీసాయిధామం ఆశ్రమ ధర్మాధికారి మాతా శుకవాణి శనివారం తెల్లవారు జామున స్వర్గస్థులయ్యారు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్న ఆమె ఆశ్రమంలోనే తుది శ్వాస విడిచారు. ఆశ్రమ పీఠాధిపతి స్వర్గీయ శ్రీ సత్యపదానంద ప్రభూజీ శిష్యరికంలో ఆమె ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుండి పాఠశాల, వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, తదితర నిర్వహణ బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆమె స్వస్ధలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె. 1943 సంవత్సరం నవంబర్ 25న జన్మించారు. పుట్టగుప్ప రామప్ప చౌదరి, తల్లి సుశీలల మొదటి సంతానం అయిన ఆమె భాషా ప్రవీణ, ఎంఓఎల్, ఎంఏ చదివారు. 17 వ ఏట నుండే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. అప్పటినుంచి 1988 వరకు వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో అధ్యాపకురాలిగా విధులు నిర్వహించి తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారు. స్వామీజీ సత్యపదానంద ప్రభూజీ ఆశ్రమ స్థాపనతో పూర్వాశ్రమాన్ని వదిలి గురుదేవుల ఆజ్ఞ మేరకు సమాజ సేవకు నడుంబిగించారు. బడి, గుడి రెండూ సమాజ శ్రేయస్సుకు అవసరమని భావించి తుది శ్వాస వరకు ఆమె ధర్మమార్గాన్ని కొనసాగించారు.
ఉచిత విద్య, వైద్య సేవలు
పరిసర గ్రామ ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందించేందుకు ఆశ్రమంలోనే పాఠశాలను, ప్రకృతి హోమియో వైద్యశాలను ఏర్పాటు చేసారు. వీటి ద్వారా పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించి గ్రామీణులను చైతన్యం చేసారు. సమాజంలోని రుగ్మతలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ 26 సంవత్సరాలుగా శ్రీసాయివాణి పేరిట మాసపత్రికను నడుపుతూ సంపాదకులుగా వ్యవహరించారు. తన కష్టార్జితాన్ని, ఆస్తులనూ సమాజ సేవకు వినియోగించి చివరి వరకూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. మాతాజీ మరణవార్తను తెలుసుకున్న స్థానికులు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, సాయి భక్తులు పెద్ద సంఖ్యలో ఆశ్రమానికి చేరుకొని మాతాజీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
నేడు అంత్యక్రియలు
శివైక్యమైన మాతాజీ శుకవాణి అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని సాయిధామం నిర్వాహకులు తెలిపారు.

చిత్రాలు..మాతా శుకవాణి పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న ఆశ్రమ విద్యార్థులు.
మాతా శుకవాణి (ఫైల్‌ఫొటో)