రాష్ట్రీయం

తెలంగాణకు ప్రత్యేక ‘క్రీడా విధానం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడావిధానాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో రజతపతకం సాధించిన పివి సింధు సోమవారం సిఎం క్యాంపుకార్యాలయంలో కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రకటించిన విధంగానే ఐదుకోట్ల రూపాయల చెక్‌ను సింధుకు ముఖ్యమంత్రి అందించారు. అలాగే సింధుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న గోపీచంద్‌కు కోటిరూపాయల చెక్‌ను అందించారు. సింధుకు ఫిజియోథెరపిస్టుగా వ్యవహరించిన చల్లగుండ్ల కిరణ్‌కు 25 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని కెసిఆర్ ప్రకటించారు. ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబరిచిన కిడాంబి శ్రీకాంత్‌కు 25 లక్షల రూపాయల నగదును ప్రోత్సాహకంగా అందిస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, ప్రపంచంలో టాప్ 50 మంది బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఆరుగురు గోపీచంద్ అకాడమీకి చెందినవారే కావడం హర్షణీయమన్నారు. గోపీచంద్ అకాడమీకి ఆర్థిక చేయూత నిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లో కూడా అకాడమీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది ప్రతిభావంతులు ఉన్నారని, వారికి ప్రోత్సాహం అందిస్తే రాష్టస్థ్రాయి, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులుగా రూపొందుతారని వెల్లడించారు.
పివి సింధు రజతపతకం సాధించడం గొప్పవిషయమని, అయితే ఇంతపెద్ద దేశానికి ఒలింపిక్స్‌లో కేవలం రెండుపతకాలే రావడం ఆలోచించాల్సిన అంశమన్నారు. దేశంలో క్రీడాకారులు ఎవరికి వారే ఎదిగి పతకాలు సాధిస్తున్నారే తప్ప, ప్రభుత్వపరంగా సరైన ప్రోత్సాహం లభించడం లేదన్న విమర్శ ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ పరిస్థితిలో మార్పురావలసి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడాసంఘాలు, అధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తానని, ఉత్తమమైన క్రీడావిధానాన్ని రూపొందిస్తామని వెల్లడించారు. వచ్చే సంవత్సరం వార్షిక బడ్జెట్ సమయానికి క్రీడా విధానం రూపొందించి, అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. గతంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులు క్రీడల్లో తప్పక పాల్గొనే వారని, నేడు పరీక్షలే పరమావధిగా చదువులు సాగిస్తూ, క్రీడలను నిర్లక్ష్యం చేస్తున్నారని కెసిఆర్ తెలిపారు. ఈ కారణంగానే ప్రభుత్వ పరంగా సరైన ప్రోత్సాహాన్ని అందిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది క్రీడాకారులున్నారని, పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న క్రీడా ప్రాంగణాలను ఉపయోగంలోకి తీసుకువస్తామన్నారు. హకీంపేట వద్ద క్రీడాపాఠశాలకోసం కేటాయించిన 300 ఎకరాల స్థలం పూర్తిగా ఉపయోగపడేలా చూస్తామన్నారు. హైదరాబాద్‌ను విశ్వక్రీడలకు వేదికగా మారుస్తామని హామీ ఇచ్చారు.
గవర్నర్‌తో భేటీ
సియంతో భేటీ అనంతరం సింధు, గోపీచంద్‌లు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ దంపతులు వారిద్దరినీ అభినందించారు.
సింధుకు అభినందనమాల
సిఎం క్యాంపు కార్యాలయంలో సింధును పలువురు ప్రముఖులు అభినందించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మున్సిపల్ మంత్రి కెటి రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ తదితులు సింధును అభినందించారు.

చిత్రాలు..సోమవారం రాజ్‌భవన్‌లో రియో ఒలంపిక్స్‌లో రజతం సాధించిన పి.వి.సింధుకు జ్ఞాపికను బహుకరిస్తున్న గవర్నర్ నరసింహన్ దంపతులు.
క్యాంప్ కార్యాలయంలో .సింధుకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 5కోట్ల రూపాయల చెక్కును బహూకరిస్తున్నతెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ.