తెలంగాణ

గలగలా గోదారి తరలివస్తుంటేను..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: గోదావరి జలాలు శుక్రవారం నగర ప్రవేశం చేయనున్నాయి. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌నుంచి ఇప్పటికే ఘన్‌పూర్‌కు చేరుకున్న 28 ఎంజిడిల నీటిని ప్రస్తుతమున్న నీటి సరఫరా వ్యవస్థతో అనుసంధానం చేసే పనులు లింగంపల్లి రిజర్వాయర్ వద్ద ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ పనులు చేపట్టిన నేపథ్యంలో గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఇదివరకే ప్రకటించారు. అల్వాల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలకు 27న గోదావరి జలాలు అందుబాటులోకి రానున్నాయి. సింగూరు, మంజీరా రిజర్వాయర్ల నీటికి బదులుగా గోదావరి జలాలను సరఫరా చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణా మూడో దశలో భాగంగా తరలించిన 90 ఎంజిడిల నీటితో కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీరింది. గోదావరి జలాలు కూడా వస్తున్నందున, నగర శివారు ప్రాంతాల్లో అధిక భాగం నీటి ఎద్దడినుంచి బయటపడినట్టే.
హైదరాబాద్ మహానగర తాగు నీటి అవసరాల కోసం 2007లో అప్పటి ప్రభుత్వం రూ. 3375 కోట్లతో చేపట్టిన వౌలానా అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకం కింద ఈ పనులు చేపట్టింది. కరీంనగర్ జిల్లాలో గోదావరిపై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ద్వారా తాగునీటిని తరలించేందుకు ఈ పథకాన్ని చేపట్టారు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల వరకు 186 కిలోమీటర్లు మేర పైప్‌లైన్ నిర్మాణం చేపట్టారు. వీటి ద్వారా రోజుకు 176 ఎంజిడిల నీటిని సరఫరా చేసేలా రూపకల్పన చేశారు. ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న జలమండలి అధికారులు అక్టోబర్ 27న ఎల్లంపల్లి నుంచి బొమ్మకల్ వరకు ట్రయల్ రన్, ఆ తర్వాత బొమ్మకల్ నుండి మెదక్ జల్లా మల్లారం వరకు, మల్లారం నుండి కొండపాక వరకు, కొండపాక నుండి ఈనెల 23న విడతల వారీగా ట్రయల్న్‌న్రు చేపట్టి, ఎట్టకేలకు గోదారమ్మను నగరానికి తీసుకువస్తున్నారు.
దశల వారీగా నీళ్లు
ఎల్లంపల్లి బ్యారేజీ నుండి నాలుగు దశల్లో నీటిని తరలిస్తున్నారు. కరీంనగర్ ప్రజ్ఞాపూర్ దాటి తుర్కపల్లి నుండి ఘన్‌పూర్ రిజర్వాయర్‌కు చేరుకున్నాయి. గోదావరి ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి విడత కింద నగరానికి రావల్సిన 48 ఎంజిడిల్లో ప్రస్తుతం 28 ఎంజిడిలను తీసుకువస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ నీళ్లు గాక, అదనంగా మరో 48 ఎంజిడిల నీటిని తీసుకువచ్చే అవకాశమున్నట్లు తెలిపారు. గోదావరి ప్రాజెక్ట్‌లో భాగంగా నగరానికి తీసుకురావాల్సిన 172 ఎంజిడిల నీటిలో డిసెంబర్ చివరి నాటికి విడతల వారీగా మొత్తం 86 ఎంజిడిల నీటిని ప్రజలకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వెల్లడించారు.
మూడు ప్యాకేజీలుగా పనులు
గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు పనులను జలమండలి అధికారులు మూడు ప్యాకేజీలుగా చేపట్టారు. దాదాపు రూ. 3775 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పనులను మొత్తం మూడు ప్యాకేజీల కింద నిర్మాణం చేపట్టారు. ఇందులో మొదటి ప్యాకేజీలో 80ఎంఎల్ సామర్ధ్యం కలిగిన రిజర్వాయర్‌ను బొమ్మకల్ వద్ద నిర్మించారు. అలాగే, ముర్మూరు నుండి బొమ్మకల్ వరకు 53 కిలోమీటర్లు పైప్‌లైన్ నిర్మాణం పనులను చేపట్టారు. రెండో ప్యాకేజీ కింద బొమ్మకల్ నుండి కొండపాక వరకు 72 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన రిజర్వాయర్‌ను మల్లారం వద్ద నిర్మించారు. ప్యాకేజీ-3లో భాగంగా కొండపాక నుండి ఘన్‌పూర్ వరకు 55 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణంతోపాటు జంక్షన్ వర్క్‌లు పూర్తి చేశారు. ఘన్‌పూర్ వద్ద 150 ఎంఎల్ సామర్ధ్యం కలిగిన రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. ఇది పూర్తి కావడానికి సమయం పట్టనున్నందున అక్కడే 2.7 ఎంఎల్ రిజర్వాయర్‌ను నిర్మించారు.

గోదావరి ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న అధికారులు