రాష్ట్రీయం

అధ్యాపకులకు అగ్ని ‘పరీక్ష’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 25: రాష్ట్రంలో వివిధ వర్శిటీల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీ వ్యవహారం వివాదాస్పదం కానుంది. స్క్రీనింగ్ టెస్టు ద్వారానే పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, దానిని కొంతమంది కాంట్రాక్టు అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ వర్శిటీల్లో 1385 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఇందుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసేందుకు వీలుగా ఇటీవల అనంతపురంలో వీసీలతో సమావేశం నిర్వహించారు. స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ దీనిని దాదాపు15 సంవత్సరాలుగా వివిధ వర్శిటీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 500మంది వివిధ వర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. ఎప్పటికైనా తమ సర్వీస్‌ను క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో ఉన్నారు. కానీ స్క్రీనింగ్ టెస్టు నిర్వహణ వారి ఆశలపై నీళ్లు చల్లింది. కొంతమంది కొన్ని నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు కూడా. ఈ దశలో తమకు పరీక్ష నిర్వహించడం సరికాదని ఏపి యూనివర్శిటీస్ కాంట్రాక్టు టీచర్ల జెఎసి ఆరోపిస్తున్నది. ప్రస్తుతం వారు పని చేస్తున్న పోస్టును భర్తీ సమయంలో ఎవరికి కేటాయిస్తారో అని ఆందోళన చెందుతున్నారు. ఆ పోస్టును వేరేవారికి రిజర్వు చేస్తే, తాము రోడ్డున పడాల్సి వస్తుందంటున్నారు. వేకెంట్ బడ్జెట్ పోస్టుల కేటగిరిలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయడం వల్ల ప్రభుత్వంపై భారం పడదని, ఈ పోస్టులకు యుజిసి నిధులను కేటాయిస్తుందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ పోస్టుల్లో పని చేస్తున్నవారిని మినహాయించి మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని కాంట్రాక్టు అధ్యాపకులు కోరుతున్నారు. అయితే ఉన్నత విద్యామండలిలో ఇప్పటికే పనిచేస్తున్న వారికి వెయిటేజ్ ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ, స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. స్క్రీనింగ్ టెస్టు ఎలా ఉంటుందో తెలియదు, అందులో తాము ఉత్తీర్ణులు కాకపోతే తమ ఉపాధి పోతుందని అంటున్నారు. స్క్రీనింగ్ టెస్టు నిర్వహణకు వీలుగా విధి విధానాలను త్వరగా ఖరారు చేయాలని ఇప్పటికే ఉన్నత విద్యామండలి అధికారులకు ఆదేశాలు అందాయి. వీలైనంత త్వరగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది.