రాష్ట్రీయం

సకాలంలో పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 25: పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని, ఎప్పటికప్పుడు వాస్తవ ప్రాతిపదికన పనులను సమీక్షించడం ద్వారా నిర్మాణ వేగానికి మరింత ఊతాన్నిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పరిపాలనా సంస్కరణలో భాగంగా స్థానిక దుర్గాఘాట్ కమాండ్ సెంటర్‌ను గురువారం ప్రారంభించారు.డ్రోన్ కెమెరాలు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలవరం ప్రాజెక్టు సైట్‌లో జరుగుతున్న వివిధ పనులను పరిశీలించారు.అక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ఆంధ్రుల జీవనాడి అని దీనిని సకాలంలో పూర్తిచేయడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇకపై ప్రాజెక్టు పనుల ప్రగతిని ప్రతివారం వాస్తవ తనిఖీల ద్వారా, ప్రతి నెల క్షేత్రస్థాయి తనిఖీల ద్వారా సమీక్షిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తంగా 10.49 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 4.2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తి చేయడం జరిగిందన్నారు. మరొక 6.47 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తి కావాల్సి ఉందన్నారు. నదిలో నిర్మాణంలో ఉన్న ‘డయాఫ్రేమ్‌వాల్’ పనుల్లో భాగంగా 1.2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉందన్నారు. ఈ ఏడాది నవంబర్ నెల నుంచి వచ్చే ఏడాది జూలై వరకు డయాఫ్రమ్ వాల్ పనులు ప్రత్యేక దృష్టితో పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. రెండేళ్ల కాలంలో మొత్తం మిగిలిన 6.47 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపనులు పూర్తి కావడానికి రోజుకు 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకాలు జరగాలన్నారు. ఇందుకు నెలకు రూ.300 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉందన్నారు.
అదనంగా 1800కోట్లు ఖర్చు
పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1800 కోట్లు అదనంగా ఖర్చు చేసిందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లు అందాయని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్దేశించిన సమయానికి పూర్తి అయ్యేందుకు ఈ ఏడాది మరొక రూ.3 నుంచి 4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందున నిధులు విడుదల నిర్దేశించకున్న లక్ష్యాల మేరకు ఉండాలన్నారు.
ప్రతివారం జరిగే వాస్తవ తనిఖీలకు ఎటువంటి అంతరాయాలు కలుగకుండా తగు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు సైట్‌లో హైమాస్ట్ లైట్ల ఏర్పాటుతో పాటు సిసి కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాజెక్టు ప్రాంతమంతా ‘వైఫై’ అందుబాటులో ఉండేలా చేయాలన్నారు. బ్యాండ్ విడ్త్ సామర్థ్యాన్ని తగువిధంగా పెంచాలన్నారు. వీటి వల్ల సమీక్షల సామర్థ్యం పెరుగుతుందన్నారు. రాబోయే వారం రోజుల్లో పనులన్నీ పూర్తికావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల అనుభవంతో ‘రియల్ టైమ్’ పరిపాలనను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రారంభించామన్నారు. ఇంటర్‌నెట్ ఆఫ్ తింగ్స్‌ను వినియోగిస్తూ సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలు వినియోగిస్తూ పరిపాలనా సంబంధమైన ప్రతి అంశాన్ని ఇదే కేంద్రం నుంచి పర్యవేక్షిస్తామన్నారు.ఎంతో పరిపాలనా అనుభవం ఉన్న తాము కూడా ప్రతినిత్యం నేర్చుకుంటూనే ఉన్నామన్నారు. 8వ తరగతి పైన విద్యార్థులకు వ్యవసాయం అనుబంధ రంగాలు, పరిశుభ్రత వంటి ఇతర స్థానిక అవసరాల నిర్వహణకు ప్రత్యేక ప్రాజెక్టులు చేపడతామన్నారు. పోస్టర్లు అంటించడం గాని చేయడాన్ని నిషేధిస్తూ చట్టం చేస్తామన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు రియల్ టైమ్ పరిపాలన కోసం వినియోగించుచడానికి ఒక్కొక్క డ్రోన్ కెమెరాను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి డ్రోన్ కెమెరా ద్వారా 7 గంటల సమయంలో 150 కిలోమీటర్ల మేర వాస్తవ పరిస్థితులను వీడియోగ్రఫీ చేయవచ్చునన్నారు.

చిత్రం..విజయవాడ దుర్గా ఘాట్‌లో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి గురువారంనాడు
పోలవరం పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు