రాష్ట్రీయం

ఆ నీళ్లు మావే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి రాజధానిలో సగం నీటి వాటా ఏపి భరించాలి గోదావరి నీళ్లను కృష్ణకు మళ్లిస్తున్నారు
బదులుగా కృష్ణలో 40 టిఎంసిలు మాకివ్వాలి అజెండాలో మెలిక పెట్టిన తెలంగాణ
పాలమూరు-రంగారెడ్డి, డిండిల మాటేమిటి? ఏపి సర్కార్ ఎదురు ప్రశ్న నేడు వాడివేడిగా కృష్ణా బోర్డు భేటీ
శ్రీశైలం, సాగర్‌లలో కనీస మట్టాన్ని పాటించాల్సిందే తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేయనున్న బోర్డు

హైదరాబాద్, ఆగస్టు 25: శ్రీశైలం బ్యారేజిలో 834 అడుగులు, నాగార్జున సాగర్‌లో 510 అడుగులు ఉండేలా కనీస నీటిమట్టాన్ని కచ్చితంగా నిర్వహించాల్సిందేనని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నది యాజమాన్య బోర్డు తేల్చిచెప్పనుంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు అందజేసిన అజెండాలో బోర్డు ఈ అంశాన్ని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరుగనున్న కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించనున్న అంశాలపై అజెండాను ఇరు రాష్ట్రాలకు అందజేసింది. ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం తగ్గిపోవడం, వరద నీరు వచ్చే అవకాశాలు సన్నగిల్లిపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలలో నీటి వినియోగంపై నిబంధన పెట్టాలని కృష్ణా బోర్డు భావిస్తోంది. ఈ నిబంధన చాలా ఏళ్లనుంచే అమలులో ఉన్నా, రెండు రాష్ట్రాలు పట్టించుకోకుండా జల విద్యుదుత్పత్తికి దిగడంతో కష్టకాలంలో మంచినీటి కొరత తలెత్తుతోంది. ఫలితంగా ఇరు రాష్ట్రాలమధ్య వివాదాలు రాజుకుంటున్నాయి. అజెండాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చేర్చిన అంశాలను పరిశీలిస్తే శుక్రవారం కృష్ణా బోర్డు భేటీ వాడి వేడిగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానీ నగరం కాబట్టి, ఇక్కడ వినియోగిస్తున్న నీటిలో సగం వాటాను ఆంధ్రప్రదేశ్ ఖాతాలో లెక్కించాలని తెలంగాణ ప్రభుత్వం కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌కు 11 టిఎంసి వరకు కృష్ణా జలాలు సాలీనా సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నందువల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆ మేరకు ఐదు టిఎంసి నీటిని వదులుకోవలసి ఉంటుందనే వాదనను తెలంగాణ తెరపైకి తీసుకురానుంది.
అలాగే గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజికి తరలిస్తుండటంతో దానికి బదులుగా ఎగువన ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లనుంచి 40 టిఎంసిల వరకు నీటిని కేటాయించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం మెలిక పెట్టింది. ఈ అంశాన్ని కూడా బోర్డు సమావేశంలో చర్చకు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు విజ్ఞప్తి చేసింది.
కాగా, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తప్ప పట్టిసీమకు వినియోగించుకునే నీటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఇలాఉండగా అజెండాలో చేర్చిన అంశాలపట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బోర్డు ఖరారు చేసిన అజెండాను చూస్తే అది తెలంగాణ అజెండాగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఇఎన్‌సి ఎం వెంకటేశ్వర్‌రావు వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీకి ఫోన్ చేసి అభ్యంతరం తెలియజేసినట్టు ఆయన తెలిపారు. అజెండాలో పేర్కొన్న తెలంగాణ వాదనలపై దీటుగా సమాధానం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అజెండాలో చేర్చాలని కోరినట్టు తెలిసింది.

శ్రీశైలం జలాశయం (ఫైల్ ఫొటో)