రాష్ట్రీయం

పిసిపిఐఆర్ ఇక లేనట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 23: పెట్రోల్, కెమికల్, పెట్రోకెమికల్ ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్ (పిసిపిఐఆర్) ఇక లేనట్టే. ఇప్పటి వరకూ ఇందుకోసం చేపట్టిన పనులన్నీ వృథా అయిపోయినట్టే, ఇందుకోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇప్పటికే సర్వేలు, భూసేకరణ, మాస్టర్ ప్లాన్‌ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పిసిపిఐఆర్ ఆద్యంతం వివాదాస్పదం కావడం, కేంద్రంలోని ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ మొత్తం అర్ధాంతరంగా నిలిచిపోయింది. విశాఖ-కాకినాడ మధ్య 603 చదరపు కిలోమీటర్ల పరిధిలో పిసిపిఐఆర్‌ను ఏర్పాటు చేయాలని 2009 అక్టోబర్ 1న కేంద్రంలోని అప్పటి యుపిఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పిసిపిఐఆర్ కోసం ఆంధ్రప్రదేశ్ సహా గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చొరవ తీసుకుని పిసిపిఐఆర్‌ను ఈ ప్రాంతానికి తీసుకురాగలిగారు. ఇందులో సుమారు 3.43 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ఆశించారు. ఈ పిసిపిఐఆర్ పరిధిలో భారీ పరిశ్రమలు వస్తాయని అనుకున్నారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున రాబట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాయి. పిసిపిఐఆర్ బాధ్యతను ప్రభుత్వం వుడా వైస్ చైర్మన్‌కు అప్పగించింది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించడానికి వుడా చర్యలు చేపట్టింది. పిసిపిఐఆర్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. ఒక ప్రైవేటు సంస్థతో ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేయించింది. పిసిపిఐఆర్ పరిధిలోని ప్రభుత్వ భూమిని ముందుగా సేకరించింది. ఆ తరువాత ప్రైవేటు భూములను సేకరించేందుకు అడుగులు ముందుకు వేస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. పిసిపిఐఆర్ ముందుకు కదలాలంటే, కేంద్ర ప్రభుత్వ అనుమతులే తప్పనిసరి. ప్రస్తుతం కేంద్రం ఇందుకు సుముఖంగా లేదు. దీనికితోడు పిసిపిఐఆర్‌లో ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు కావల్సిన అవసరం ఉంది. పిసిపిఐఆర్ పరిధిలో హెచ్‌పిసిఎల్ యాంకర్ ఇండస్ట్రీ అవుతుందని అనుకున్నారు. కానీ హెచ్‌పిసిఎల్ యాజమాన్యం ఇందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో 1500 ఎకరాల్లో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని హెచ్‌పిసిఎల్ భావించింది. భాగస్వామ్య సంస్థతో ఒప్పందం కుదరకపోవడం వల్ల హెచ్‌పిసిఎల్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. దీంతో యాంకర్ ఇండస్ట్రీ రాకుండాపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడడంతో విదేశీ పెట్టుబడులు రాకుండా పోయాయి. మరోపక్క, భూసేకరణకు ప్రజలు అంగీకరించలేదు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అడుగు ముందుకు వేయడానికి సిద్ధపడకపోవడం, అంతేకాకుండా పిసిపిఐఆర్ నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీపై స్పష్టత లేకపోవడంతో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే ప్రజాభిప్రాయసేకరణను నిలిపివేయాలని ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చారు. దీంతో పిసిపిఐఆర్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఇదిలా ఉండగా విశాఖ-చెన్నై కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అలాగే చెన్నై-బెంగళూర్ కారిడార్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఇప్పటి వరకూ ఈ కారిడార్లకు అలైన్‌మెంట్ రాకపోవడంతో ఆ పనులు కూడా మొదలు కాలేదు. విశాఖ-చెన్నై కారిడార్‌ను శ్రీకాకుళం వరకూ పొడిగించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఒకవేళ చెన్నై కారిడార్‌కు పూర్తి స్థాయిలో అనుమతులు వస్తే, దాన్ని పిసిపిఐఆర్ కోసం నిర్దేశించిన ప్రాంతం మీదుగా తీసుకువెళ్లాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్టు తెలుస్తోంది.