తెలంగాణ

ఉద్ధృతమైన ‘జిల్లాల’ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: కొత్త జిల్లాల ఏర్పాటులో చోటు దక్కని జిల్లాల కోసం రాజుకున్న నిరసన గళం రోజురోజుకు బలపడుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటును అన్ని రాజకీయ పక్షాలు స్వాగతిస్తూనే ప్రతిపాదిత జిల్లాల ముసాయిదా అశాస్ర్తియంగా ఉందని విపక్షాలు ఎండగడుతున్నాయి. ప్రతిపాదిత జిల్లాలపై విపక్షాలతో పాటు సొంత పార్టీలోనూ నిరసన గళం వినిపించడం పాలకపక్షాన్ని ఇరకాటంలో పడేసింది. కొత్త జిల్లాల ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ గడువు ముగియడానికి ఇంకా రెండు వారాలకుపైగా వ్యవధి ఉన్నప్పటికీ ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వెల్లువెత్తడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు మెజార్టీ ప్రజల మద్దతు లభించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఒకవైపు చెబుతుండగా, ప్రజల నుంచి కేవలం 10 రోజుల వ్యవధిలో 30 వేల అభ్యంతరాలు, సూచనలు, సలహాలు రావడం అధికార వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆశించిన రీతిలో మైలేజి వస్తుందా? లేదా? అనే మీమాంసలో పడేసింది. వరంగల్ జిల్లా జనగామ, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలను జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గత రెండు, మూడు నెలల నుంచి ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటికి తోడు జిల్లాల ప్రతిపాదనలపై టిఆర్‌ఎస్ తన సొంత పార్టీ ప్రజాప్రతినిధులతో జరిపిన ముఖాముఖి సందర్భంగా కరీంనగర్ జిల్లా సిరిసిల్లను కూడా జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చింది. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో అప్పటి వరకు లేని కొత్త డిమాండ్‌ను ప్రభుత్వం తెరపైకి తేవడంతో అక్కడ కూడా జిల్లా కోసం ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత కొత్త జిల్లాలపై అధికారికంగా ముసాయిదా జారీ అయింది. వీటిలో అప్పటి వరకు ప్రభుత్వ ప్రతిపాదనలో ఉన్న 24 జిల్లాలు కాకుండా కొత్తగా 27 జిల్లాలను ప్రతిపాదిస్తూ తాజాగా శంషాబాద్, హన్మకొండ, పెద్దపల్లి మూడు జిల్లాలను ప్రభుత్వమే తెరపైకి తీసుకువచ్చింది. ప్రతిపాదిత జిల్లాల్లో అదనంగా చేరిన మూడు జిల్లాల కోసం ప్రజల నుంచి డిమాండ్ లేకపోయినా వాటిని ముసాయిదాలో చేర్చి, ప్రజలు డిమాండ్ చేస్తున్న గద్వాల, జనగామకు దీంట్లో చోటు కల్పించకపోవడం పట్ల ప్రజల నుంచే కాకుండా సొంత పార్టీ శ్రేణుల నుంచీ వ్యతిరేకత వచ్చింది. ముసాయిదాలో పేర్కొన్న హన్మకొండ జిల్లా వద్దని, దీనికి బదులుగా జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలని టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు స్వయంగా సమావేశం పెట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు గళం ఎత్తలేరని, ప్రజాభిప్రాయం పేరిట హన్మకొండ జిల్లాను ఉపసంహరించుకోవడానికి వారితో మాట్లాడిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో సొంత పార్టీ నేతల నుంచి నిరసన గళం వ్యక్తం కావడంతో గద్వాల, సిరిసిల్ల జిల్లాల కోసం ఆందోళనలు ఊపందుకున్నాయి. గద్వాల జిల్లా కోసం అఖిల పక్ష కమిటీ 72 గంటల బంద్‌కు పిలుపునివ్వగా దానికి అధికార పార్టీ సంఘీభావం ప్రకటించడమే కాకుండా, గద్వాల ఎంపిపి సుభాన్ నేతృత్వంలో కూడా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో గద్వాల, జనగామ జిల్లా కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజధానిలో రెండు రోజుల నిరశన దీక్షలు జరుగగా, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. జిల్లాల ఏర్పాటు అశాస్ర్తియంగా జరుగుతోందని విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఏ ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేస్తున్నది అధికార పార్టీ కానీ, ప్రభుత్వం కానీ సమాధానం చెప్పలేకపోతోంది. ఇది నిరసన గళానికి మరింత బలం చేకూర్చినట్టు అయింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముసాయిదా విడుదల కాగానే అన్ని జిల్లాల్లో జరిగిన సంబరాల స్థానంలో ప్రస్తుతం ఆందోళనలు జరగడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.