రాష్ట్రీయం

మీ వైఖరి మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబరు 12: ‘రైతులు, వెనుకబడిన తరగతుల వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారికోసం వివిధ పథకాలు రూపకల్పన చేస్తున్నాం. అవి సక్రమంగా అమలు జరగాలంటే, బ్యాంకర్లు సహకరించాలి. కానీ అది జరగడం లేదు. ప్రభుత్వ ఆశయాన్ని బ్యాంకర్లు అర్థం చేసుకోవడం లేదు. ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములు కాకపోతే, స్వచ్ఛందంగా వైదొలగండి’ అని బ్యాంకర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమితి 195వ సమావేశం సోమవారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిఎం మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం వినూత్నంగా చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించని బ్యాంకులకు సరైన దిశానిర్దేశం చేయాలని రిజర్వ్ బ్యాంకును కోరతామని
సిఎం అన్నారు. కేవలం బ్యాంకర్లకు, అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే
రుణాలు సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయేతర వృత్తుల్లో ఉన్న వారిని కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం పథకాలను సిద్ధం చేసిందని అన్నారు. అయితే లబ్ధిదారుల పట్ల బ్యాంకర్లు కఠినంగా వ్యవహరిస్తున్నారని, వారికి పథకం ఫలితం అందకుండా చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ వర్గాల వారికి రుణాలు అందించేందుకు బ్యాంకుల మార్గదర్శకాల్లో మార్పులు తీసుకురావాలని ఆయన సూచించారు. రుణం తీసుకోవడంలో చూపించే శ్రద్ధ, దానిని తిరిగి చెల్లించడంపై కూడా చూపాలని చంద్రబాబు కోరారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించక్కర్లేదని కొన్ని కార్పొరేషన్లు చెపుతున్నాయని ఇది సరికాదంటూ కార్పొరేషన్ చైర్మన్‌లపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్షణానికి బోగస్ లోన్‌లు కొనసాగుతున్నాయా? లేదా? అని కార్పొరేషన్ చైర్మన్‌లను చంద్రబాబు ప్రశ్నించారు. దీనివలన బ్యాంకర్లు ఇరుకునపడుతున్నారని ఆయన అన్నారు. ఈ దశలో బ్యాంకర్లు మాట్లాడుతూ రుణాలు తీసుకోడానికి ముందు లబ్దిదారులకు ఆ రుణం విలువ, దానిని తీరిగి తీర్చాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. వెంటనే ఈ సూచనను అమలు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
డ్వాక్రా మహిళలు కూడా బ్యాంకుల్లో తీసుకున్న రుణాన్ని విధిగా తిరిగి చెల్లించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీతో ఇచ్చిన 15 వేల కోట్ల రూపాయల రుణాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారన్న అంశాన్ని అధికారులు పరిశీలించాలని ఆయన సూచించారు. కౌలు రైతులకు రుణాలు అందించేందుకు బ్యాంకులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. రెవెన్యూ శాఖ జారీ చేసిన రుణ అర్హత కార్టులు, లేదా వ్యవసాయాధికారి జారీ చేసిన సాగు ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకదాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు.
ఎస్‌ఎల్‌బిసి అధ్యక్షుడు సురేష్ ఎన్ పటేల్ మాట్లాడుతూ ఈ ఏడాది తొలి త్రైమాసికానికి 33,188 కోట్లు ప్రాధాన్యతా రంగానికి, 13,243 కోట్లు నాన్ ప్రియార్టీ రంగానికి రుణాలు అందచేశామని చెప్పారు. 2016-17 ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికలో ఇప్పటి వరకూ 28 శాతం రుణాన్ని అందించామని ఆయన చెప్పారు.
ఇవీ నిర్ణయాలు
* మూడు లక్షలకు పైబడి రుణం మంజూరు చేసే సందర్భంలో భూమిని తనఖా పెట్టుకున్నప్పుడు బ్యాంకులకు రిజిస్ట్రేషన్ చార్జీలను మినహాయింపు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.
* ఎస్‌ఎల్‌బిసి సమావేశాలకు కలెక్టర్లును కూడా ఆహ్వానించాలని, అలాగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు కూడా ఎల్‌డిఎంలను పిలవాలని నిర్ణయించారు.
* అన్ని సంక్షేమ శాఖలకు సంబంధించిన ఏడాది లక్ష్యాలను, యూనిట్ల స్థాపన అంశాలను అధ్యయనం చేసి తదుపరి ఆరు నెలల కాలానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను సిఫార్స్ చేసేందుకు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ సిఎం నిర్ణయం తీసుకున్నారు.
* చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన, వౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడిదారుల ద్వారా పొందిన ఆదాయ మదింపు వంటి అంశాలను అధ్యయనం చేసేందుకు పంచాయతీరాజ్ రూరల్ డవలప్‌మెంట్ కమిషనర్ రామాంజనేయులు అధ్యక్షతన ఒక కమిటీ వేస్తూ సిఎం నిర్ణయం తీసుకున్నారు.

చిత్రం.. ఎస్‌ఎల్‌బిసి ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు