రాష్ట్రీయం

దోపిడీ సాగనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్/ హైదరాబాద్, సెప్టెంబర్ 12: ప్రాజెక్ట్‌ల నిర్మాణం పేరిట ప్రజాధనం దోపిడీని సహించేదిలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులు చేపట్టిన దీక్షలు వంద రోజులకు చేరిన సందర్బంగా గజ్వేల్‌లో సోమవారం నిర్వహించిన సంఘీబావ సదస్సులో ఆయన మాట్లాడారు. తెరాస అధికారం చేపట్టి రెండేళ్లు దాటుతున్నా ఒక్క ప్రాజెక్టూ నిర్మించలేదని, కాంగ్రెస్ హయాంలో పూర్తిచేసిన వాటికే తుది మెరుగులు దిద్దుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 550 అడుగుల ఎత్తులో మల్లన్నసాగర్ నిర్మాణం చేపట్టి ఎలా సాగునీరు అందిస్తారో అర్ధం కావడంలేదని, అసలు రిజర్వాయర్ ఏర్పాటులో మతలబేంటని ప్రశ్నించారు. సిఎం కెసిఅర్ అనాలోచిత విధానాలతో రైతులను ఆవేదనకు గురి చేస్తుండగా, మల్లన్నసాగర్ ద్వారా 18 లక్షల ఎకరాలు స్థిరీకరిస్తామనడం తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. ముఖ్యంగా మల్లన్నసాగర్‌కు వెచ్చించే ఖర్చుతో ఎలాంటి ముంపు లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, అయితే గతంలో 1.5 టిఎంసి నీటి సామర్థ్యం ఉన్న మల్లన్నసాగర్‌ను 50 టిఎంసి స్థాయికి పెంచడం రైతులను ఇబ్బందులకు గురిచేయడమే అవుతుందని విమర్శించారు. రెండు పంటలు పండే ప్రాంతంలో భూములు బలవంతంగా లాక్కొని రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి ఒక్క పంటకు సాగునీరు అందించే ఆలోచన ఎంతమాత్రం తగదని, ఈక్రమంలో ప్రజాస్వామ్య పద్ధతిన నిరసన తెలుపుతున్న నిర్వాసితులపై పోలీసుల లాఠీ చార్జీలు చేసి, అక్రమ కేసులు బనాయించి జైళ్లపాలు చేయడం సిగ్గుచేటన్నారు. కాగా రైతుల్లో ఆత్మస్థయిర్యం నింపి అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అలాగే 2013 భూసేకరణ చట్టాన్ని వర్తింపజేసే వరకూ ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీగా రైతులకు సంఘీబావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర నేతలను నక్సలైట్లలా, తీవ్రవాదుల్లా, అసాంఘీక శక్తుల్లా అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతుందని ప్రభుత్వం రుజువు చేసుకుందన్నారు. కెసిఅర్ మొండిగా ముందుకెళ్తే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు. కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి స్వయంగా తాను డిఎస్పీ శ్రీ్ధర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసి మృతిచెందగా, ఆయనపై 306 సెక్షన్ నమోదు చేసి అరెస్ట్ చేయకుండా డిజిపి ఆఫీసులో ఉంచడమేంటని నిలదీశారు. రాష్ట్రంలో రైతులతోపాటు పోలీసుల ఆత్మహత్యలు జరుగుతుండటం ప్రభుత్వానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. రాష్ట్రంలో దురహంకార పాలన కొనసాగుతోందని, కోర్టులు మొట్టికాయలు వేసినా పద్ధతి మార్చుకోకుండా ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా ఒప్పందం పేరిట రాష్ట్రంలో గోబెల్ ప్రచారం చేసుకుంటూ, వేలాది ఎకరాలు నీట మునిగేలా జరిగిన ఒప్పందంతో సంబరాలు చేసుకుంటున్న ఘనత కెసిఅర్‌కే దక్కిందన్నారు. డిసిసి అధ్యక్షురాలు సునితారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి హనుమంతరావు, మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, డికె అరుణ, షబ్బీర్‌అలి, సబితా ఇంద్రారెడ్డి, జీవన్‌రెడ్డి, విజయరామారావు, శ్రీదర్‌బాబు, సురేష్‌రెడ్డి, కోదండరెడ్డి, గడ్డం ప్రసాద్, మాజీ ఎంపీలు సురేశ్ శట్కార్, సర్వే సత్యనారాయణ, మల్లు రవి, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్‌యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి
మల్లన్న సాగర్ బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూడాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కోరారు. సోమవారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే టి జీవన్ రెడ్డి, ఇతర నేతలు మల్లు రవి, కొనగాల మహేశ్ తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మల్లన్న సాగర్ బాధిత రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ చట్టం ప్రకారం బాధిత రైతులకు పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పరిహారం చెల్లించడం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు తెలిపారు.

చిత్రం.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పరిహారంపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞాపనాపత్రం సమర్పించి వస్తున్న కాంగ్రెస్ నేతలు