రాష్ట్రీయం

విశాఖ-చెన్నై కోస్టల్ రహదారికి ఎడిబి రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 14: విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీర రహదారి నిర్మాణానికి 1350 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) నుండి నిధులు మంజూరైనట్టు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని తిమ్మాపురం అతిథి గృహంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో యనమల మాట్లాడారు. కోస్టల్ కారిడార్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కోస్టల్ రోడ్డు నిర్మాణంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల అభివృద్ధికి మార్గం సుగమం కానున్నట్టు తెలిపారు. విశాఖ-తూర్పు గోదావరి జిల్లాల మధ్య పలు ప్రాంతాలు కూడా కోస్టల్ రహదారితో అనూహ్యంగా అభివృద్ధి సాధించే అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. పురుషోత్తపట్నం వద్ద 1650 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు నిధులు విడుదల చేయనున్నట్టు మంత్రి తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనుల్లో 4,5 రీచ్‌ల పనులకు 300 కోట్లు విడుదల చేస్తున్నామని, మిగిలిన పనులకు 300 నుండి 400 కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. నిధులను కూడా త్వరలో విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో ఖజానా శాఖ నుండి బిల్లులు పొందడానికి నూతన విధానాన్ని అమలుచేస్తున్నామని తెలిపారు. ప్రతి నెలా 7నుండి 25వ తేదీ వరకు వివిధ శాఖల పనులకు సంబంధించిన బిల్లులను ఖజానాలు అనుమతిస్తాయని, 26నుండి తదుపరి నెల 6వ తేదీ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లకు చెందిన బిల్లులను అంగీకరిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ పనులకు చెందిన బిల్లులు నిర్దేశించిన కాలంలో సమర్పించి, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని సూచించారు. అన్ని కార్పొరేషన్ల నుండి లబ్ధిదారుల వ్యక్తిగత రుణాల మంజూరును ఒక లక్షగా నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ఫిష్ హేచరీస్‌ను క్రమబద్ధీకరించి, వాటికి లైసెన్స్‌లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక రంగాల్లో సాధించిన 22.7 శాతం ఆర్ధిక అభివృద్ధిలో 34 శాతం రేటు మత్స్యశాఖ నుండే వస్తున్నందున హేచరీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. హేచరీల అభివృద్ధిలో భాగంగా నాణ్యమైన ఉత్పత్తుల సాధన కోసం రైతులకు సాంకేతికపరమైన సూచనలివ్వాలని స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖలో ఈ-పోస్ ద్వారా వస్తున్న పొదుపును ఆ శాఖ బడ్జెట్‌లో ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి యనమల