ఆంధ్రప్రదేశ్‌

సుందర నగరాల నిర్మాణం సవాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 16: అనివార్యమైన పట్టణీకరణలో సౌకర్యవంతమైన, సుందర పట్టణాల నిర్మాణం ప్రభుత్వాలకు అతిపెద్ద సవాలుగా మారిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ అభిప్రాయపడ్డారు. విశాఖలో జరుగుతున్న 3వ బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం ముగింపు సందర్భంగా చివరి రోజు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నివాసయోగ్య, సౌకర్యవంతమైన నగరాలను నిర్మించేందుకు కేంద్రం పెద్దపీట వేస్తోందన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణంలో భాగంగా వౌలిక సదుపాయాలు, అత్యుత్తమ సేవలను పౌరులకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే కేంద్రం లక్ష్యమన్నారు. సమీకృత అభివృద్ధి సాధనలో ఎదురవుతున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పట్టణీకరణలో ముందున్న బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా, చైనా దేశాల అనుభవాలు, అక్కడ అమలు చేస్తున్న సంస్కరణలను తెలుసుకునేందుకు ఈ వేదిక ఎంతో ఉపకరించిందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరాల నిర్మాణం జరగాలని, అందుకు బ్రిక్స్ సభ్య దేశాలు అనుభవాలు పంచుకోవాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకోవడంతో పాటు పర్యావరణ హితమైన నగరాల నిర్మాణంలో సభ్య దేశాలు ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. వచ్చే నెల గోవాలో జరగనున్న బ్రిక్స్ దేశాల కీలక సదస్సు పట్టణీకరణ సవాళ్లకు ఒక మంచి పరిష్కారం చూపుతుందని తాను భావిస్తున్నట్టు ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. గోవా సదస్సు సరికొత్త అర్బన్ పాలసీకి సంబంధించి కీలక డిక్లరేషన్స్ ఇవ్వనుందన్నారు. పట్టణీకరణ అంశంలో నూతన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో బ్రిక్స్ సదస్సు ఇక్కడ జరగడం శుభపరిణామమని అన్నారు.
ఎపి మున్సిపల్ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ పట్టణాల్లో వౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ భాద్యతని, సౌకర్యవంతమైన పట్టణాల నిర్మాణంతో ఇది సాధ్యమన్నారు. సదుపాయాల కల్పన స్థానిక సంస్థలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతోందన్నారు.
పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో కీలకనిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఎపిలో ఇప్పటికే ఆన్‌లైన్ నిర్మాణ అనుమతులు, విద్యుత్ ఆదాకు ఎల్‌ఇడి దీపాల ఏర్పాటు వంటి సంస్కరణలు చేపట్టామన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి బి ఆనంద్ మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్, రవాణా, గృహనిర్మాణం, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, పౌర రక్షణతో పాటు పౌర సేవలు సత్వరమే అందించే విధంగా నగరాలు ఉండాలన్నారు.