రాష్ట్రీయం

పోలవరానికి విదేశీ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ప్రతిష్టాకరమైన పోలవరం ప్రాజెక్టుకు విదేశీ నిధులు రానున్నాయి. బహుళార్ధక సాధక ప్రాజెక్టుకు విదేశీ బ్యాంకులు, విదేశీ ఏజెన్సీలు నిధులు ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రం భరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు బ్యాంకు రుణాలు సమకూర్చుతోంది. ఈ రుణాలను తీర్చే బాధ్యత స్వీకరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. ఈ నిధులను నాబార్డు విదేశీ బ్యాంకులు లేదా అంతర్జాతీయ ఏజన్సీలతో ఒప్పందం కుదుర్చుకుని రుణం రూపంలో తీసుకుని పోలవరం ప్రాజెక్టుకు యుద్ధప్రాతిపదికన విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సాగునీటిపారుదల శాఖకు నాబార్డు నుంచి సమాచారం అందింది. నాబార్డు రెండు లేదా మూడు బ్యాంకులు లేదా విదేశీ ఏజన్సీలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఇజ్రాయిల్ ఏజన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఏజన్సీలతో పాటు అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ బ్యాంకులతో రుణాలను పొందేందుకు నాబార్డు కసరత్తును ప్రారంభించింది.
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు రూ. 28,790 కోట్ల వ్యయమవుతుంది. 2014 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5548 కోట్లను ఖర్చు చేసింది. ఇందులో కేంద్రం రూ. 935కోట్లను విడుదల చేసింది. కేంద్రం విడుదల చేయాల్సిన నిధులు మినహాయిస్తే మొత్తం వ్యయం రూ. 23,500 కోట్లని సాగునీటి శాఖ వర్గాలు తెలిపాయి. నాబార్డు మొత్తం వ్యయంలో 80 శాతం రుణాలను తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. 2011 అంచనా ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.16,010.45 కోట్లు. నాబార్డు నుంచి తీసుకునే రుణంలో సింహభాగం నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలకే ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించాలనుకున్నారు. ఈ విషయమై నివేదికలను బ్యాంకులకు అందించారు. కాని బ్యాంకులు ముందుకు రాలేదు. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా, రుణాలను రాష్ట్రప్రభుత్వం ఏ ప్రాతిపదికన చెల్లిస్తుందనేది చర్చనీయాంశమైంది. కాగా ఇక్కడ కేంద్రం గ్యారంటీగా ఉండడం, పూర్తి ఖర్చును భరించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేయడం వల్ల నాబార్డుకు విదేశీ బ్యాంకులు లేదా ఏజన్సీల నుంచి నిధులు లభించడం తేలికవుతుందని సాగునీటి రంగ నిపుణలు తెలిపారు.