రాష్ట్రీయం

గోదావరికి వరద ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని దాదాపు అన్ని ప్రాజెక్టులు వరద నీటితో నిండిపోయాయి. మూడేళ్ల నుంచి నీళ్లు లేక వెలవెలబోయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నీటితో నిండిపోవడంతో గేట్లు ఎత్తివేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42గేట్లను ఎత్తి వరద నీటిని వదిలేస్తున్నారు. నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అదే విధంగా సింగూరు ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తారు. మూసీ ఉధృతి వల్ల 15వేల ఎకరాల పంట నష్టం జరిగింది.
జూరాల ఎనిమిది గేట్లు, నారాయణపూర్ డ్యామ్ తొమ్మిది గేట్లు , అల్మట్టి డ్యామ్ మూడు గేట్లు ఎత్తివేశారు. శ్రీశైలం జలాశయానికి 1,26,484 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
గోదావరికి వరద ప్రమాదం ఉండడంతో అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అప్రమత్తం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్ని జిల్లాల ప్రాజెక్టుల పరిస్థితిపై నిరంతరం సమీక్షిస్తున్నారు. వరద ప్రమాదం తలెత్తకుండా మొత్తం పది జిల్లాలకు సీనియర్ ఐఎఎస్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు మిషన్ కాకతీయ చెరువులన్నీ వరద నీటితో నిండిపోయాయి.
మహారాష్ట్ర నాందేడ్ జిల్లా విష్ణుపురి బ్యారేజీ నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని రాత్రికి విడుదల చేస్తున్నట్టు ఎస్‌ఆర్‌ఎస్‌పి అధికారులకు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు సమాచారం అందించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని విశే్లషిస్తూ ఈ మేరకు దిగువన నీటిని వదలాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆదివారం సాయంత్రం గోదావరికి వరద పోటు వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.
కృష్ణా బేసిన్‌లోని జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 1045.01 అడుగులు కాగా, ప్రస్తుతం 1044.57 అడుగులకు నీరు చేరుకుంది. 9.36 టిఎంసిల నీటి నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టులోకి 126000ల క్యూసెక్‌ల ఇన్‌ఫ్లో, 118756 ఔట్ ఫ్లో ఉంది.
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో శ్రీశైలంలో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు సామర్థం 885.01 కాగా, ప్రస్తుత నిల్వ 876.50 అడుగులు, 170.66 టిఎంసిల నీటి నిల్వ ఉంది. 16176 క్యూసెక్‌ల ఇన్‌ఫ్లో, 2180 క్యూసెక్‌ల ఔట్ ఫ్లో ఉంది. నాలుగు రోజుల్లో శ్రీశైలం నిండే అవకాశం ఉంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 590 అడుగులు, 312 టిఎంసిలు. ప్రస్తుత నీటి మట్టం 514 అడుగులు, 139.44 టిఎంసిలు. శ్రీశైలం ప్రాజెక్టు నిండితే సాగర్‌కు నీటిని విడుదల చేస్తారు.
మూసీ ప్రాజెక్టులో వరద జలాలు ఉధృతంగా వచ్చి చేరుతున్నాయి. మూసీ ప్రాజెక్టు సామర్థ్యం 645 అడుగులు. 4.46 టిఎంసిలు. ప్రస్తుత నీటి మట్టం 642.80 అడుగులు. 3.98 టిఎంసిలు. ఇన్‌ఫ్లో 15170 క్యూసెక్కు, ఔట్ ఫ్లో 22120 క్యూసెక్కులు. పులిచింతల సామర్థ్యం 175 అడుగులు, 45.77 టిఎంసిలు. ప్రస్తుత నీటి మట్టం 30 టిఎంసిలు. ఇన్‌ఫ్లో 79107 క్యూసెక్‌లు, ఔట్ ఫ్లో 79107క్యూసెక్‌లు. కృష్ణా బేసిన్‌లో కన్నా గోదావరి బేసిన్‌లో వరద నీటి ప్రభావం ఎక్కువగా ఉంది.
నిజాం సాగర్ సామర్థ్యం 1405 అడుగులు 17.80 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి మట్టం 1380.60 అడుగులు. 1.42 టిఎంసిలు. ఇన్‌ఫ్లో 45767 క్యూసెక్‌లు.ఎస్‌ఆర్‌ఎస్‌పి సామర్థ్యం 1091 అడగులు. 90.31 టిఎంసిలు. ప్రస్తుత నీటి మట్టం 1087.80 అడుగులు. 75.14 టిఎంసిలు. ఇన్‌ఫ్లో 444000 క్యూసెక్‌లు. ఔట్ ఫ్లో 215582 క్యూసెక్కులు.ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 485.56 అడుగులు. 20.18 టిఎంసిలు. ప్రస్తుత నీటి మట్టం 484.60 అడుగులు. 19.34 టిఎంసిలు. ఇన్‌ఫ్లో 157491 క్యూసెక్‌లు. ఔట్ ఫ్లో 10,845 క్యూసెక్‌లు. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 700 అడుగులు, 7.60 టిఎంసిలు, ప్రస్తుత నీటి మట్టం 698.60 అడుగులు. 7.09 టిఎంసిలు. ఇన్‌ఫ్లో 21644 క్యూసెక్‌లు. ఔట్ ఫ్లో 10,845 క్యూసెక్‌లు.
ఎల్‌ఎండి సామర్థ్యం 920 అడుగులు. 24.07 టిఎంసిలు. ప్రస్తుత నీటి మట్టం 897.90 అడుగులు. 9.26 టిఎంసిలు. ఇన్‌ఫ్లో 20వేల క్యూసెక్కులు.
సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం 1717.93 అడుగులు 29.91 టిఎంసిలు. ప్రస్తుత నీటి మట్టం 1715.39 అడుగులు. 25.82 టిఎంసిలు. ఇన్‌ఫ్లో 116000 క్యూసెక్‌లు. ఔట్ ఫ్లో 157000 క్యూసెక్‌లు. పది మంది సీనియర్ ఐఎఎస్‌ల నియామకం
వరద పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకునే విధంగా పది మంది సీనియర్ ఐఎఎస్‌లను జిల్లాల వారిగా ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఆదిలాబాద్ వికాస్‌రాజ్, ఖమ్మం అహ్మద్ నదీం, వరంగల్ అరవింద్‌కుమార్, నల్లగొండ టి చిరంజీవులు, మహబూబ్‌నగర్ ఎం జగదీశ్వర్, మెదక్ డాక్టర్ రజత్ కుమార్, నిజామాబాద్ జి అశోక్‌కుమార్, కరీంనగర్ బిఆర్ మీనా, రంగారెడ్డి సురేష్ చంద్ర, హైదరాబాద్ జిల్లాకు రాజేశ్వర్ తివారీని నియమించారు.

చిత్రం.. ఎస్సారెస్పీ వరద గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి వదులుతున్న మిగులు జలాలు