రాష్ట్రీయం

పోటెత్తిన గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న అసాధారణ వర్షాలతో తీవ్రస్థాయి వరద వచ్చే ప్రమాదం ఉందని కేంద్ర జల వనరుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కేంద్రం హెచ్చరికలతో తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్ర ప్రభుత్వాలు అలెర్టయ్యాయి. జిల్లా కలెక్టర్లు అప్రమత్తం కావాలని ఆదేశాలు జారీ చేశాయి. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌లో వరద ప్రభావం ఎక్కుగా కనిపిస్తోంది. వచ్చే మూడు నుంచి ఏడు రోజుల వరకూ వరద ప్రమాదం తీవ్రంగా ఉంటుందని, దానికి తగ్గట్టు అప్రమత్తం కావాలని జల వనరుల శాఖ రాష్ట్రాలను హెచ్చరించింది. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్‌లో వరద ప్రభావం ఉంటుందని సూచించింది. అదేవిధంగా కృష్ణా బేసిన్‌లో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్టల్ల్రో వరద తీవ్రతను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్రం 550 మందితో 17 ఎన్‌ఆర్‌డిఏ బృందాలను సిద్ధం చేసింది.
గోదావరి ప్రవాహంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో పది గేట్లను ఎత్తి వేశారు. వరద తీవ్రత అనూహ్యంగా ఉండటంతో, నిర్మాణంలోవున్న మిడ్‌మానేరు కరకట్టకు గండిపడింది. మహారాష్టల్రో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తెలంగాణలో గోదావరి ఉద్ధృతి గంటగంటకూ పెరుగుతోంది. మహారాష్టల్రో వర్షాల పరిస్థితిపై ఆ రాష్ట్ర నీటిపారుదల మంత్రి గిరిష్ మహాజన్ నుంచి తెలంగాణ నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే నీటి ప్రవాహంతోపాటు తెలంగాణ భూభాగంలోని వివిధ వాగులు, వంకల నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని కూడా అంచనావేసి దానికి అనుగుణంగా వివిధ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేస్తున్నారు. తెలంగాణలోని ఎస్‌ఆర్‌ఎస్‌పి, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్‌ఎండి, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల వద్ద అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గేట్లు ఎత్తివేయడం వల్ల ముంపు అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి పూర్తి నిల్వ సామర్థ్యం 90టిఎంసిలు కాగా, 85 టిఎంసిల నిల్వను స్థిరంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహారాష్టల్రో భారీ వరదలు ఉన్నందున దానికి అనుగుణంగా ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆదివారం ఉదయం నాలుగు లక్షల క్యూసెక్కులను వదిలారు. గోదావరి బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల్లోనూ పూర్తిస్థాయిలో వరద నీరు చేరిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నిజాం సాగర్ పూర్తిస్థాయిలో నిండిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండటం, ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులతో పాటు మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. గోదావరి పరీవాహక ప్రాంతాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. గోదావరి ఉప నదులు పెన్‌గంగ, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరికి వరద తీవ్రత కొంచెం తీవ్రంగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక తీవ్రతను దాటి వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
మిడ్‌మానేరుకు శనివారం అర్థరాత్రి గండిపండింది. ఊహించని ఉత్పాతంలా మారడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 115 మీటర్ల పొడవున్న కరకట్టపై వరదపారింది. మట్టికట్ట కోతకు గురైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే అక్కడి నుంచి తరలించారు. కొదురుపాక, నీలోజిపల్లి, మల్లాపూర్, మాన్వాడ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గండి విషయం తెలియగానే నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. గండిపడిన ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ నీతూ కుమారితోపాటు జిల్లా మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. అప్పర్ మానేరు, సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో గత రాత్రి భారీగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈ నీరు కూడా మిడ్‌మానేరుకు చేరింది. కేవలం మూడు టిఎంసి నీటి సామర్ధ్యమే ఉండటం వల్ల నీటి నిల్వకు అవకాశం లేక ప్రాజెక్టు పైనుంచి వరద కిందకు ప్రవహిస్తోంది. మిడ్‌మానేరు నుంచి వరద ప్రవాహం మన్వాడ, పుత్తూరు, మల్లాపూర్, కంది కట్కూరు తదితర గ్రామాల నుంచి వెళ్లాలి. దీంతో ఈ గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన మహారాష్ట్ర నుండి విష్ణుపురి, నాందెడ్‌తోపాటు మరో నాలుగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలావుంటే, మెదక్ జిల్లా రేగోడు మండలం గజవాడ గ్రామానికి చెందిన సాయమ్మ వాగును దాటే ప్రయత్నంలో గల్లంతయింది. ఆమె మరణించినట్టుగా భావిస్తున్నారు. జక్కపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు గౌడ్ బైక్‌తో సహా వాగులో కొట్టుకుపోయినట్టు సమాచారం అందుతోంది.

చిత్రం.. మిడ్‌మానేరు కరకట్టకు గండి పడిన ప్రాంతం.