రాష్ట్రీయం

83 రోజుల తర్వాత...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఈ నెల 28న తేదీన హైదరాబాద్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో మంత్రులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ఉద్యోగ సంఘాల నేతలతో కూడా చంద్రబాబు మాట్లాడనున్నారు. హైదరాబాద్ సచివాలయానికి చంద్రబాబు గత 83 రోజులుగా దూరంగా ఉన్నారు. అన్ని కార్యక్రమాలను విజయవాడ, గుంటూరులలో నిర్వహిస్తున్నారు. సిఎం క్యాంప్ కార్యాలయం గుంటూరు జిల్లాకు మారడంతో అక్కడే సీనియర్ అధికారులతో ఆయన సమీక్షలు అనునిత్యం నిర్వహిస్తున్నారు. అనేక రోజుల తర్వాత హైదరాబాద్ రానున్న నేపథ్యంలో బుధవారం నుండి సచివాలయంలో భద్రత పెంచారు. వివిధ శాఖలలో కార్యక్రమాలు, పథకాల అమలుతీరు, రెవిన్యూ శాఖల్లో ఆదాయం, రాష్ట్ర ఉద్యోగుల తరలింపు ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడు చివరిసారిగా గత సెప్టెంబర్ 5వ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఇంత వరకూ సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లోని సిఎం కార్యాలయానికి రాలేదు. 28వ తేదీ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 27నే చంద్రబాబు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇలా ఉండగా డిసెంబర్ 1వ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని సిఎం విజయవాడలో నిర్వహించనున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో డిసెంబర్ 18వ తేదీన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని కూడా హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు. బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని తొలుత విజయవాడలో నిర్వహించాలని యోచించారు. అయితే తాజాగా హైదరాబాద్‌కు మారిందని చెబుతున్నారు.

17నుంచి అసెంబ్లీ
డిసెంబర్ 17 నుండి శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. తొలుత ఈ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని అనుకున్నా, ఐదు రోజులకే కుదించినట్టు తెలిసింది. సమావేశాలు 17 నుండి 22వ తేదీ వరకూ జరుగుతాయి. రైతుల ఆత్మహత్యలు, నూతన రాజధాని నిర్మాణం, భూముల అమ్మకాలు, ఇసుక అక్రమాలు, కరవు , భారీ వర్షాలు పునరావాసం తదితర అంశాలు సమావేశాల్లో చర్చకు రానున్నాయి.

‘హోదా’ కోసం
7న ఢిల్లీలో ధర్నా
హామీల సాధన సమితి వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిసెంబర్ 7న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఏపి ప్రత్యేక హోదా హామీల సాధన సమితి ప్రకటించింది. సమితి నాయకులు కారెంశివాజీ తదితరులు బుధవారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, డిసెంబర్ ఆరునుండి తమ ఆందోళన ప్రారంభమవుతుందని తెలిపారు. ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకే ఢిల్లీలో ఆందోళన నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఏపికి చెందిన పార్లమెంట్ సభ్యులంతా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గట్టిగా మాట్లాడాలని, అవసరం అయితే పార్లమెంట్‌ను స్తంభింప చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులకు ఈ మేరకు వినతిపత్రాలు పంపించామని కారెం శివాజీ తెలిపారు.
డిఎడ్ విద్యార్థులకు ఊరట
పరీక్ష రాసేందుకు అనుమతి
ఆదేశాలు జారీచేసిన మంత్రి గంటా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 25: కాలేజీలకు గుర్తింపు లేదనే పేరుతో డిఎడ్ విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడంతో జరిగిన రాద్ధాంతానికి మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ఫుల్‌స్టాప్ పెట్టారు. విద్యార్ధులను పరీక్షలకు అనుతించకపోతే ఎలా అంటూ యాజమాన్యాలు దండయాత్రకు దిగడంతో ఈ అంశం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే పరిష్కరించమని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావును సిఎం ఆదేశించారు. సిఎంతో సమావేశమై పరిస్థితిని వివరించిన గంటా శ్రీనివాసరావు కాలేజీల మోసపూరిత చర్యల వల్ల డిఎడ్ విద్యార్థులు నష్టపోయారని, మానవతా దృక్పథంతో డిఎడ్ సెకండియర్ విద్యార్థులను ఈ ఏడాది పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దానికి సిఎం అంగీకరించడంతో ఆమేరకు గంటా శ్రీనివాసరావు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గుర్తింపులేని కాలేజీల్లో చదివిన విద్యార్థులకు సైతం ఈ ఏడాది పరీక్షలకు అనుమతివ్వాలని మంత్రి అధికారులకు చెప్పారు.
ఫుడ్ ప్రాసెసింగ్‌పై విజయవాడలో
అంతర్జాతీయ సదస్సు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 25: ఫుడ్ ప్రాసెసింగ్‌పై అంతర్జాతీయ ప్రదర్శనను విజయవాడలో నిర్వహించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇజ్రాయిల్‌కు చెందిన కెన్స్ ఎగ్జిబిషన్ చైర్మన్ అవి రోస్నర్, జనరల్ మేనేజర్ ప్రేమా జిల్‌బర్‌మన్‌లు ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో బుధవారం నాడు భేటీ అయ్యారు. అంతర్జాతీయ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సదస్సు నిర్వహించేందుకు వారు ఆసక్తి చూపారని ప్రధాన కార్యదర్శి కార్యాలయం పేర్కొంది. ప్రదర్శన ఉద్దేశాలు, లక్ష్యాలు, ప్రయోజనాలను ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ప్రధాన కార్యదర్శికి వివరించారు. ప్రభుత్వం సైతం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు సంబంధించి తాజా విధానాన్ని ప్రకటించే యోచనలో ఉందని ప్రధాన కార్యదర్శి వారికి చెప్పారు. ఏపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సిఇఓ కె ధనుంజయరెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

డిఎస్పీల బదిలీ
పలువురు ఇన్‌స్పెక్టర్లకు పదోన్నతులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు డిఎస్పీలు బదిలీ అయ్యారు. మరో ఆరుగురు ఇనె్స్పక్టర్లకు పదోన్నతులు కల్పిస్తూ బుధవారం పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాశీబుగ్గ డిఎస్పీ, సిఐడిగా పనిచేస్తున్న ఎల్ అర్జున్‌ను 5వ, బెటాలియన్ ఎపిఎస్పీ విజయనగరంకు బదిలీ అయ్యారు. కాగా ఎల్ అజయ్‌ప్రసాద్ రిపోర్టు చేయనందున అంతకు ముందు జారీ అయిన ఉత్తర్వులు రద్దయ్యాయి. ఆర్మ్‌డ్ రిజర్వు వెయిటింగ్‌లో ఉన్న కెఎస్‌ఎస్ శ్రీనివాసరావు రాజమండ్రిలో ఖాళీగావున్న హోంగార్డ్సు డిఎస్పీగా బదిలీ అయ్యారు. అదేవిధంగా గుంటూరు రేంజ్ ఇనె్స్పక్టర్‌గా పనిచేస్తున్న కె జగదీశ్వర రెడ్డికి డిఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ సిసిఎస్ గుంటూరు అర్బన్‌కు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న కె ప్రకాష్‌బాబును డిఎస్పీ ఎస్సీ, ఎస్టీ-2 విజయవాడకు బదిలీ చేశారు. అదేవిధంగా గుంటూరు రేంజ్ ఇనె్స్పక్టర్ ఎన్ రామారావును ప్రమోషన్‌పై నెల్లూరు ట్రాఫిక్ డిఎస్పీగా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఎం జనార్ధన్‌ను కర్నూలు డిఎస్పీ (మహిళా పోలీసు స్టేషన్)గా బదిలీ చేశారు. ఏలూరు రేంజ్ డిఎస్పీగా పనిచేస్తున్న వి సుబ్రహ్మణ్యంకు పదోన్నతి కల్పిస్తూ శ్రీకాకుళం డిఎస్పీ మహిళా పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా విజయవాడలో ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీగా పనిచేస్తున్న మురళీధర్‌ను శ్రీకాకుళం డిఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.