రాష్ట్రీయం

ఆగని జలచౌర్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: కృష్ణా జలాలను ఆంధ్ర రాష్ట్రం దోపిడీ చేస్తోందని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్రానికి మరోసారి ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాల యాజమాన్య బోర్డుకు ప్రత్యక్షంగా ఫిర్యాదు చేసిన మంత్రి, కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి మంగళవారం సాయంత్రం లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా ఆంధ్ర పాల్పడుతోన్న జల చౌర్యాన్ని నియంత్రించాలని కోరారు. ఈనెల 21న ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సైతం ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చినట్టు ఉమాభారతికి రాసిన లేఖలో హరీశ్‌రావు గుర్తు చేశారు. అయినా ఆంధ్ర రాష్ట్రం తన ధోరణి మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా జలాలను మళ్లిస్తున్నారని అన్నారు. గత పది రోజుల్లో (సెప్టెంబర్ 17 నుంచి 27 వరకు) పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రకు 5.5 టిఎంసి జలాలను మళ్లించారని పేర్కొన్నారు. వెలిగొండ, బంకచర్ల నుంచి నీటిని తరలిస్తున్నారని, బంకచర్ల నుంచి ఎంత నీటిని తరలించారో ఆంధ్రప్రదేశ్ కాడా వెబ్‌సైట్‌లో చూపించడం లేదని చెప్పారు. లెక్కలో చూపించకుండా నీటిని మళ్లించుకోవడం వల్ల నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్న తెలంగాణ రైతులకు తీవ్రంగా నష్టం కలుగుతోందని అన్నారు. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకునేలా కృష్ణా జలాల యాజమాన్య బోర్డును ఆదేశించాలని హరీశ్‌రావు ఉమాభారతికి రాసిన లేఖలో కోరారు. నీటిని ఏవిధంగా మళ్లీస్తున్నారో లెక్కలు ఏవిధంగా చూపిస్తున్నారో ఉమాభారతికి రాసిన లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు.
గతంలో కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేసినా ఆంధ్ర వైఖరిలో మార్పు రాకపోవడం పట్ల కృష్ణా యాజమాన్య బోర్డు చైర్మన్‌తో జరిగిన సమావేశంలో హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డు ప్రేక్షక పాత్రను విడిచిపెట్టి కార్యాచరణ ప్రారంభించాలని కోరారు. జలసౌధలో మంగళవారం కృష్ణా యాజమాన్య బోర్డు చైర్మన్ రామచరణ్, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీలతో హరీశ్‌రావు చర్చించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి, ఇఎన్‌సి విజయప్రకాశ్, మంత్రి ఓఎస్‌డి శ్రీ్ధర్‌రావు దేశ్‌పాండే , నాగార్జున సాగర్ సిఇ సునీల్ తదితరులు పాల్గొన్నారు. పొత్తిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాల తరలింపునకు సంబంధించి ఉన్నత స్థాయి బృందాన్ని తీసుకువెళ్లి నిజ నిర్థారణ జరపాలని చటర్జీని మంత్రి కోరారు. దీనికి చటర్జీ సుముఖత వ్యక్తం చేశారు. ఈ బృందం పోతిరెడ్డిపాడుకు బయలుదేరనుంది. నాగార్జునసాగర్‌కు ఈ సమయంలో రావలసిన మేరకు నీటి నిల్వలు పెరగలేదని మంత్రి తెలిపారు. దీనికి కారణం శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో చాలా తక్కువగా ఉండడమేనని సభ్య కార్యదర్శికి మంత్రి వివరించారు. కర్నూలు జిల్లాలో పెన్నా బేసిన్‌లో ఉన్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని బహిరంగంగా, నిస్సిగ్గుగా తరలించుకు పోతున్నారని నీటిపారుదల మంత్రి వివరాలు అందించారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఇంజనీర్ల బృందం ఈ అంశంపై శాస్ర్తియంగా అధ్యయనం జరిపింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బంకచర్ల కాంప్లెక్స్‌ను ఈ బృందం సందర్శించింది. కృష్ణా జలాల తరలింపుపై రికార్డుల్లో మాత్రం వందల క్యూసెక్కులు చూపిస్తున్నారని, వాస్తవంగా వేలాది క్యూసెక్కులు తరలించుకు పోతున్నారని ఇంజనీర్ల బృందం తమ అధ్యయనంలో వెల్లడైన విషయాలతో నివేదిక అందించారు. రికార్డులకు దొరకకుండా పోతిరెడ్డిపాడు ద్వారా పెద్దఎత్తున కృష్ణా జలాలను రాయలసీమకు తరలిస్తున్నారని తెలిపారు. ఈ సీజన్‌లో మొదటి రోజు ఏడువందల క్యూసెక్కులు అంటూ మొదలు పెట్టారని, తర్వాత వెయ్యి, ఇరవై అయిదు వందల క్యూసెక్కులంటూ దొంగ లెక్కలు చూపిస్తున్నారని కృష్ణా యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. వారం పది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నా, ఎగువన కర్నాటక నుంచి వరద నీరు వస్తున్నా, ఆంధ్రప్రదేశ్‌లో పోతిరెడ్డిపాడు (తెలుగు గంగ ప్రాజెక్టు) నుంచి నీటి పంపిణీ లెక్కలు అరకొరగానే ఉన్నాయని, మంగళవారం ఉదయం ఐదువందల క్యూసెక్కులుగా చూపించారని తెలిపారు. పైన కురిసిన వానల పుణ్యమా అని కృష్ణా వరద ప్రవాహం పెరిగినా శ్రీశైలంకు నీళ్లు చేరుకుండానే స్వాహా చేస్తున్నారని కృష్ణా యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకొచ్చారు. నీటి వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ పరికరాలు అమర్చాలని ఇటీవల అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే టెలిమెట్రీ పరికరాలు అమర్చేంత వరకు జలదోపిడీ జరగాల్సిందేనా? అని మంత్రి కృష్ణా బోర్డును ప్రశ్నించారు. దీనిపై వాస్తవాలు తెలుసుకోవాలని బోర్డును కోరారు.

చిత్రం... కృష్ణా యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి పరిస్థితిని వివరిస్తున్న మంత్రి హరీశ్‌రావు