రాష్ట్రీయం

ద.మ.రైల్వేకి త్వరలో మహిళా ఆర్‌పిఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: రైళ్లలో మహిళల భద్రత కోసం త్వరలో దక్షిణ మధ్య రైల్వేకి మహిళా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) రానుంది. ఇప్పటికే మెట్రోపాలిటిన్ నగరాల్లోని సబర్బన్ రైళ్లలో మహిళల భద్రత కోసం వేగంగా పని చేసేందుకు వీలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 12 మహిళా ఆర్‌పిఎఫ్ కంపెనీలను రైల్వే ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వేకి 132 మంది మహిళా సిబ్బంది, ఒక గెజిట్ అధికారితో కూడిన మహిళా కంపెనీని రైల్వే శాఖ ఆమోదించడంతో త్వరలోనే ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. రైల్వేశాఖ మంత్రిగా సురేష్ ప్రభాకర్ ప్రభు, సహాయ మంత్రిగా మనోజ్ సిన్హా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏడాదిగా ప్రయాణీకులకు సేవలందించే వివిధ విభాగాల్లో నిత్య పర్యవేక్షణ జరగడం వల్ల రైల్వే పెద్ద ఎత్తున పురోగతి సాధించింది. దేశ వ్యాప్తంగా 11 ప్రధాన రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. ద.మ.రైల్వే పరిధిలో ఎ-1-4, ఎ-31, బి-38 కేటగిరి స్టేషన్లకు కూడా వైఫై సేవలను విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రయాణీకుల ఒక్క ఫోన్‌కాల్ లేదా ఎస్‌ఎంఎస్ ఇస్తే తాము కోరుకున్న భోజనం ఉన్న సీటు వద్దకే వచ్చే విధంగా ఈ-కేటరింగ్ సౌకర్యాన్ని 45 స్టేషన్లలో 1516 రైళ్ల ద్వారా అమలు చేస్తోంది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే శాఖ ప్రయాణీకులకు మెరుగైన సేవలందిస్తోంది. బుకింగ్ వేగాన్ని నాలుగింతలు పెంచే దిశగా ఈ-టిక్కెటింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు గాను ఈ ఏడాది చివరికల్లా ద.మ.రైల్వే పరిధిలో 546 బోగీల్లో 1801 బయో టాయ్‌లెట్లు బిగించారు. రిటైరింగ్ గదుల ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యాన్ని ద.మ.రై పరిధిలో 53 రైల్వే స్టేషన్లలో అమల్లోకి తెచ్చింది. ప్రయాణీకుడిని, అతని కూలీని నివాసం లేదా, హోటల్ వద్దకు చేర్చే విధంగా భారతీయ రైల్వే నెట్‌వర్క్ 24 రైల్వే స్టేషన్లలో ఈ-ఆతిథ్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ తరహా సౌకర్యం సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి స్టేషన్లలో రైల్వే అందుబాటులోకి తెచ్చింది. భద్రత సౌకర్యాల్లో భాగంగా రైలు బోగీల్లో సిసిటివి కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సరుకును ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే ఈ-డిమాండ్ సిస్టమ్ కూడా అమలు చేసేందుకు కృషి జరుగుతోంది. అంతేకాకుండా ఈ-టెండరింగ్, ఈ-ఆక్షన్ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడి) భాగస్వామ్యంలో స్వతంగా రైల్వే డిజైన్ కేంద్రం ఏర్పాటుకు రైల్వేలు ఒప్పందం చేసుకున్నాయి. వయోవృద్ధులు, గర్భిణీ స్ర్తిలకు కింది బెర్తుల కేటాయింపు విషయంలో టిటిఈలకు ఆదేశాలు జారీ అయ్యాయి. భారతీయ రైల్వేల వ్యాపారాభివృద్ధి, మెరుగుదల, వ్యాపారాన్ని పెంపొందించే అంశాల్లో తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రతన్ టాటా చైర్మన్‌గా కాయకల్ప్ కౌన్సిల్‌ను రైల్వే ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ముంబయి విశ్వవిద్యాలయంలో రైల్వే రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది.
నేడు తిరుపతి-సాయినగర్ షిర్డీ వీక్లీకి పచ్చజెండా
తిరుపతి-షిర్డీ సాయినగర్ మధ్య వారానికి ఒక సారి నడిచే వారంతపు ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 26న రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు ప్రారంభించనున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి పచ్చజెండా ఊపి మంత్రి చేతుల మీదుగా రైలును ప్రారంభించనున్నారని రైల్వే అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ రైలు రేణిగుంట, కోడూరు, రాజంపేట, నందలూరు, కపడ, ఎర్రగుంట్ల, ముద్దనూరు, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, యాద్‌గిర్, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, మల్కాజ్‌గిరి, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముత్కేడ్, నాందేడ్, పూర్ణా, ఫర్భని, సేలూ, పాతూర్, జాల్నా, ఔరంగాబాద్, నాగర్‌సోల్, మన్మాడ్, కోపర్‌గావ్, పతంబ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి.