రాష్ట్రీయం

తప్పిన పెనుముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 1: భారీ వర్షాల కారణంగా సింగూరుకు తలెత్తిన పెను ముప్పు తృటిలో తప్పింది. పశ్చిమ మెదక్‌లోని జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ ఎడతెరపిలేని వర్షం గ్రామాలను అతలాకుతలం చేసింది. చెరువుల్లోకి భారీగా నీరు చేరడంతో కొన్ని చెరువులకు గండ్లుపడ్డాయి. మరోపక్క వాగుల్లోకి వరద పోటెత్తడంతో మంజీర మరోమారు పరవళ్లుతొక్కింది. అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సింగూర్ ప్రాజెక్టుకు పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. శుక్రవారం అర్ధరాత్రి 12.30కు నిర్మలంగా ఉన్న సింగూర్ ప్రాజెక్టులోకి తెల్లవారుజామున రెండు గంటలకు కూడా వరద నీరు రాలేదు. ఎగువ ప్రాంతంలో వర్షం కురుస్తున్నట్టు సమాచారం ఉండటంతో సిబ్బంది అప్రమత్తంగానే ఉన్నారు. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు ఒక్కసారిగా వరద తన్నుకొచ్చింది. సింగూర్ గరిష్ట నీటి మట్టం 523.6 మీటర్లుకాగా, 524 మీటర్లకుపైగా వరద నీరు చేరింది.
ప్రాజెక్టు గేట్లపై నుంచి నీరు ప్రవహించటంతో, ఒక్కసారిగా 9 గేట్లు ఎత్తేశారు. ప్రాజెక్టులో నీటిమట్టాన్ని ఒకేసారి తగ్గించే అవకాశం ఉన్నా, దిగువనున్న గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉన్న దృష్ట్యా కొద్దికొద్దిగా వరద ఉద్ధృతిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎగువ నుంచి 1.20 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుంటే, అంతే మొత్తంలో దిగువనున్న నిజాంసాగర్ ప్రాజెక్టుకు వదిలిపెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సింగూర్ ప్రాజెక్టులో నీటి మట్టం 523.8 మీటర్లకు చేరుకోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. రంగారెడ్డి జిల్లా నుంచి కోహీర్, జహీరాబాద్ మండలాల గుండా ప్రవహించే నారింజ వాగుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జహీరాబాద్- బీదర్ రహదారిపైకి వరద నీరు రావడంతో రాకపోకలు స్తంభించాయి. న్యాల్‌కల్ మండలంలో అత్యధికంగా 22.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక గ్రామాల రోడ్లు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. మండల కేంద్రమైన న్యాల్‌కల్‌లో సుమారు 80 ఇళ్లలోకి వరద నీరు చేరింది. పది ఇళ్లు కూలిపోయాయి.
మరో పదిహేను ఇళ్లలో విత్తనాలు, ఎరువులు, వంట దినుసులు నీట మునిగాయి. మండల కేంద్రమైన రాయికోడ్ మార్కెట్ కమిటీ ప్రహారీ కూలిపోగా, విద్యుత్ స్తంభాలు నేలొకొరిగాయి. పత్తి, సోయాబీన్, కంది, చెరకు పంటలకు అపారనష్టం వాటిల్లింది. పిప్పడ్‌పల్లి, ధర్మాపూర్, యూసూప్‌పూర్, సింగితం తదితర గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఝరాసంగం మండలం బిడకనె్న గ్రామం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండగా దాటుతున్న క్రమంలో సదాశివపేట మండలం ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమలో పని చేసే ఉద్యోగి సంగమేశ్వర్ కొట్టుకుపోయాడు.
నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామం వద్ద నలుగురు యువకులు ఈతకు వెళ్లగా, పొంగి ప్రవహిస్తున్న వాగులో పుండరీకం అనే వ్యక్తి గల్లంతై మృతి చెందాడు. ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ గ్రామం గుండం చెరువుకు గండిపడటంతో ఉన్న నీరంత ఖాళీ అయ్యింది. నీరు మొత్తం దిగువనున్న జీర్లపల్లి చెరువులోకి రావడంతో వరద ఉద్ధృతికి వంతెన కొట్టుకుపోయింది. జీర్లపల్లి గ్రామంలోకి వరద చేరటంతో గ్రామం మొత్తం తెల్లవార్లూ ప్రాణాలు గుప్పిట పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. నిండుకున్న చెరువులోని నీరు కట్టలపైనుంచి పొంగి ప్రవహించడంతో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయాందోళనలో జీర్లపల్లి వాసులు కొట్టుమిట్టాడుతున్నారు. పుల్కల్ మండలంలోని ఇసోజిపేట గ్రామానికి ఎగువనున్న పెద్ద చెరువు అలుగు పొంగి ప్రవహించడంతో, నీరంతా గ్రామంలోని ఇళ్లలోకి చేరింది. మునిపల్లి మండలంలో డబ్బావాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో తాటిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలోకి వరద నీరు చేరింది.
మెదక్, సిద్దిపేట రెవెన్యూ డివిజన్లలో చెప్పుకోదగిన వర్షపాతం నమోదుకాలేదు. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండటంతో జిల్లా ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

చిత్రాలు.. పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో మంజీర నీరు.
సదాశివపేట-సింగూర్ వెళ్లే మార్గంపై చేరుకున్న మంజీర వరద ఉద్ధృతితో నిలిచిపోయిన రాకపోకలు.