రాష్ట్రీయం

మాజీ మంత్రి మెట్ల కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ అమలాపురం, డిసెంబర్ 25: మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు(74) శుక్రవారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 10.30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు తరలించారు. అక్కడ కొద్ది సేపు పార్టీ నేతల సందర్శనార్థం ఉంచిన తర్వాత అమలాపురానికి తరలించారు. మెట్ల సత్యనారాయణ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఇతర సీనియర్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిపిఐ నేత నారాయణ వేరే ప్రకటనలో ఆయన మృతికి సంతాపం తెలిపారు.నిమ్స్‌లో చికిత్స పొందుతుండగానే, నాలుగు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గురువారం ఆరోగ్యం క్షీణించటంతో అత్యవసర వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాజీ మంత్రి, కాకినాడ ఎంపి తోట నరసింహం ఆయనకు స్వయానా అల్లుడు. పదేళ్ల క్రితమే మెట్ల సతీమణి రామలక్ష్మి కన్నుమూశారు. అలాగే చిన్నకుమారుడు రాంజీ కొద్ది కాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అప్పటి నుండి ఆయన మానసికంగా బాగా కుంగిపోయారని సన్నిహితులు చెబుతారు.
జిల్లాను శాసించిన నేత
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి క్రమశిక్షణ కలిగిన నాయకునిగా మెట్ల పేరొందారు. 1983, 1994లో ఆయన అమలాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కేబినెట్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, సహకార శాఖ మంత్రిగా పనిచేశారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమకే చెందిన దివంగత లోక్‌సభ స్పీకర్ జిఎంసి బాలయోగికి మెట్ల సత్యనారాయణ రావు చిరకాల మిత్రుడు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాన్నిహిత్యం కలిగిన మెట్ల ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం అనంతరం కొంత కాలం ఆ పార్టీలోకి వెళ్లినప్పటికీ, అక్కడ ఇమడలేక, తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన సొంత నియోజకవర్గం అమలాపురం ఎస్సీ రిజర్వుడు కావడంతో ఆయనకు పోటీచేసే అవకాశం లేకపోయింది. దీనితో ఆయనను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించారు. డాక్టర్ మెట్ల ఆకస్మిక మరణం సమాచారంతో జిల్లాలో ముఖ్యంగా కోనసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి.నిమ్స్‌లో మెట్ల సత్యనారాయణ రావు భౌతికకాయాన్ని యువనేత నారా లోకేశ్, మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వర రావు, ఎంపి పండుల రవీంద్రబాబు, పలువురు ఎమ్మెల్యేలు సందర్శించి, నివాళులర్పించారు. మెట్ల కుమారుడు రమణబాబు, కుమార్తె తోట వాణి, అల్లుడు తోట నరసింహంలను పరామర్శించారు. కోనసీమ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుని అమలాపురంలోని మెట్ల స్వగృహానికి చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.మెట్ల సత్యనారాయణరావు భౌతికకాయానికి శనివారం అమలాపురంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. మెట్లకు అంతిమ నివాళి అర్పించిన తరువాత చంద్రబాబు హెలికాప్టర్‌లో విజయవాడకు వెళతారని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు.

మెట్ల సత్యనారాయణ మృతదేహాన్ని నిమ్స్‌నుంచి అమలాపురానికి తరలిస్తున్న దృశ్యం