రాష్ట్రీయం

లెక్కలు తేలని విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: రాష్ట్ర విభజన జరిగి 19నెలలు గడుస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపకాల వాటా తేలలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా పరిస్థితి తయారైంది. రెండు రాష్ట్రాలు జల విద్యుత్‌ను థర్మల్ విద్యుత్ తరహాలోనే పంచుకోవాలని కేంద్ర విద్యుత్ అథారిటీ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితులు కనిపించటం లేదు. విద్యుత్ పంపకాలు ఎలా ఉండాలన్న అంశంపై కేంద్ర విద్యుత్ అథారిటీ ఒక ముసాయిదా పత్రాన్ని రెండు రాష్ట్రాలకూ పంపి వారం గడువిచ్చింది. ఇదిలావుండగా, తాజాగా రెండు రాష్ట్రాల మధ్య కొత్త వివాదం మొదలైంది. ఉమ్మడి ఆంధ్రలో నిర్మాణం ప్రారంభమై త్వరలో విద్యుదుత్పత్తికి సిద్ధమైన తెలంగాణ రాష్ట్రంలోని రెండు థర్మల్ ప్లాంట్లలో తమకూ వాటావుందని ఏపి విద్యుత్ సంస్థలు కేంద్రాన్ని కోరాయి. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో 600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. ఆదిలాబాద్‌లోని సింగరేణి థర్మల్ ప్లాంట్‌లో వచ్చే నెల నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుంది. భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుదుత్పత్తి, సింగరేణిలో 600 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుంది. ఇందులోనే రెండో యూనిట్ 600 మెగావాట్లు వచ్చే మార్చినాటికి ఉత్పత్తి మొదలుపెడుతుంది. విభజన సమయంలో కేంద్రం ఆంధ్రకు 46.11 శాతం, తెలంగాణకు 53.89 శాతం థర్మల్ విద్యుత్ కేటాయించింది. తెలంగాణలోని సింగరేణి, భూపాలపల్లిలో విద్యుదుత్పత్తి ప్రారంభమైన వెంటనే కేంద్రం ఆదేశాల మేరకు తమకు 553.32 మెగావాట్ల విద్యుత్ దక్కాల్సి ఉంటుందని ఏపి విద్యుత్ అధికారులు అంటున్నారు.
కానీ ఈ విద్యుత్‌ను అడిగే హక్కు ఏపీకి లేదని తెలంగాణ విద్యుత్ అధికారులు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చెల్లవని, కొన్నింటికి ఒప్పందాలు ఖరారు కాలేదంటూ ఏపీ ప్రభుత్వం అడ్డుగోలుగా వాదించి తమ వాటా విద్యుత్ ఇవ్వలేదని తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇప్పటికే కేంద్ర విద్యుత్ అథారిటీ దృష్టికి తీసుకెళ్లాయి. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్లాంట్ 1600 మెగావాట్లలో వాటా ఇచ్చేది లేదని తొలుత ఏపీ చెప్పి ఆ తర్వాత ఇస్తామందని, ఆలోగా విద్యుత్‌ను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చిందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం విదితమే.
జల విద్యుత్‌ను కూడా థర్మల్ విద్యుత్ తరహాలోనే ఏపి 46.11 శాతం, తెలంగాణ 53.89 శాతం కేటాయించుకోవాలని కేంద్ర విద్యుత్ అథారిటీ సూచించింది. ఇంతవరకు ఉత్పత్తి అయిన జలవిద్యుత్‌లో ఎవరికి వారే సొంత రాష్ట్రంలో వినియోగించుకుంటున్నారు. సీలేరు విద్యుత్‌లో తమకు న్యాయంగా రావాల్సిన వాటాను ఆంధ్ర ఇవ్వడంలేదని కూడా తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ అథారిటీ ఆదేశాలను రెండు రాష్ట్రాలు ఏమేరకు పాటిస్తాయో సస్పెన్స్‌గా మారింది.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు మాత్రం వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రైవేట్ జనరేటర్ల నుంచి 1500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించింది. భూపాలపల్లి, సింగరేణి విద్యుత్ అందుబాటులోకి వస్తే తెలంగాణలో వచ్చే వేసవిలో విద్యుత్ కొరత ఉండకపోవచ్చు. వచ్చే వేసవిలో సగటున రోజూ 150 ఎంయు విద్యుత్ అవసరమని అంచనా. ఇటీవల తెలంగాణలో సగటున రోజూ 135 ఎంయు విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం రబీలో, అలాగే పరిశ్రమలకు ఎటువంటి అంతరాయం లేకుండా తెరాస ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేస్తోంది. ఆంధ్రలో ఇంతవరకు విద్యుత్ కొరత తలెత్తలేదు. వీలైనంత త్వరలో సిఇఏ విద్యుత్ లెక్కలను తేల్చి రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదురుస్తుందనే ఆశాభావంతో ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఉన్నాయి.