ఆంధ్రప్రదేశ్‌

మాకొద్దీ ఉచిత ఇసుక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 14: ఇసుక మాఫియా కంబంధ హస్తాల్లో గోదావరి తీరం గుల్లవుతోంది. ఉచితం మాటున ప్రభుత్వ ఖజానా డొల్లవుతోంది. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు ఏమీ తెలియనట్టుగా కళ్లు మూసుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ‘ఏ ర్యాంపులో చూసినా కానరాదు ఉచిత ఇసుక... ఇసుక ర్యాంపులు సమస్తం ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల హస్తగతం’ అన్నచందంగా తయారయ్యింది. గతంలో వేలం నిర్వహించిన సమయంలోనే ర్యాంపుల నిర్వాహకులు పోటాపోటీగా ధరలు తగ్గించి అమ్మకాలు సాగించడంతో, కావలసినంత ఇసుక చౌక ధరకు వినియోగదారుని గుమ్మంలోకి వచ్చిచేరేది. ఇప్పుడు ఉచితం ముసుగులో ర్యాంపుల్లో ప్రజాప్రతినిధుల అనుచరులు, అధికార పార్టీ నేతలు అనధికారికంగా తిష్ఠవేయడంతో ఇసుక కోసం దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దళారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి, వారు చెప్పినంత చెల్లించి, ఇసుక ఇంటికి తెచ్చుకునే స్థితికి వినియోగదారుడు చేరుకున్నాడు. బహిరంగ వేలం నుండి డ్వాక్రా సంఘాలకు ర్యాంపులు అప్పగించిన నాటినుండే పరిస్థితి దిగజారగా, ఇప్పుడు ఉచితం కారణంగా పరిస్థితి పొయ్యిమీద నుంచి పెనంలో పడినట్టయ్యింది. చివరకు ప్రజలు ‘మాకొద్దీ ఉచిత ఇసుక’ అనే స్థాయికి పరిస్థితి చేరుకుందంటే అతిశయోక్తికాదు. ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి తీరంలో ఉచిత ఇసుక మాటున నెలకు దాదాపు రూ.40 కోట్ల వరకు పక్కదారి పడుతోంది. ఇసుక ర్యాంపులను డ్వాక్రా సంఘాలకు అప్పగించిన నేపథ్యంలో ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం లభించింది. మహిళా ఆర్థిక స్వావలంబన పేరుతో ప్రభుత్వం ఇసుక ర్యాంపులను వారికి కేటాయించినా అక్కడా ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు నీడలా కమ్మేశారు. అప్పట్లో వచ్చిన ఆరోపణల దృష్ట్యా ఎట్టకేలకు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉచితం మాటున మాఫియా కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తోంది. ఇటు విశాఖ, అటు విజయవాడకు సరఫరా చేస్తూ ఐదు యూనిట్ల లారీ ఇసుక రూ.40వేల వంతున ఇటు విశాఖ నుండి అటు విజయవాడ వరకు తరలించేస్తున్నారు. ర్యాంపులను గతంలో డ్వాక్రా సంఘాలకు కేటాయించిన క్రమంలో యూనిట్ ఇసుక రూ.1700కు విక్రయించేవారు. ఏడాదిన్నర కాలంలో డ్వాక్రా సంఘాల ఇసుక వ్యాపారంలో ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వేల కోట్ల ఆదాయం లభించింది. డ్వాక్రా విధానాన్ని తొలగించి ఉచిత విధానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రజలకు ఇసుక దొరకడంలేదు, ప్రభుత్వానికి ఆదాయమూ దక్కడంలేదు. గోదావరి తీరం నుంచి నిత్యం వేల లారీల ఇసుక రవాణా జరుగుతోంది. పగటిపూట కాస్త తక్కువ సంఖ్యలో ఇసుక లారీలు తిరిగినా, అర్థరాత్రి నుండి తెల్లవారుజాము వరకు మాత్రం గోదావరి జిల్లాల్లోని రోడ్లన్నీ భారీ ఇసుక లారీలతో నిండిపోతున్నాయి. ఇసుక లారీలు విజయవాడ, విశాఖపట్నం తదితర దూర ప్రాంతాలకు తరలిపోతుంటాయి.