తెలంగాణ

చదువుల భారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై సుప్రీంకోర్టు తీర్పును ఇటు ప్రభుత్వాలు, అటు పాఠశాలల యాజమాన్యాలు గాలికొదిలేశాయి. తమదైన శైలిలో లక్షల్లో ఫీజులు దండుకుంటున్నాయి. వార్షిక పరీక్షల సీజన్ దగ్గర పడటంతో బకాయిలు చెల్లించాల్సిందేనని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు హుకుం జారీ చేశాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో స్కూలు ఫీజులు తగ్గుతాయేమోనన్న తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేరకుండానే విద్యా సంవత్సరం ముగియనుంది. ఇంజనీరింగ్ , మెడికల్, మిగిలిన వృత్తి విద్యాకోర్సుల ఫీజులను నియంత్రిస్తున్న ప్రభుత్వం, పాఠశాలల, జూనియర్ కళాశాలల ఫీజులను నియంత్రించలేమన్నట్టు వ్యవహరిస్తోంది. వాస్తవానికి విద్యా చట్టంలో నిర్ధిష్టమైన నియమ నిబంధనలున్నా వాటిని పర్యవేక్షించే వ్యవస్థ కరవవడంతో యాజమాన్యాలకు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఇరు రాష్ట్రాల్లోనూ కార్పొరేట్, ఇంటర్నేషనల్, ఐబి స్కూల్స్ పేరిట బహిరంగంగానే లక్షలాది రూపాయిలు ఫీజులుగా వసూలు చేస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలు టెక్నో, ఈ-టెక్నో, ఒలింపియాడ్ తదితర పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజుల విషయంలో పాఠశాల యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగదని, ఫీజులను నియంత్రించేందుకు జిల్లాస్థాయిలో కమిటీలు వేయొచ్చని సుప్రీంకోర్టు గత సెప్టెంబర్ 19న ఆదేశాలిచ్చినా, తీర్పు పూర్తిపాఠం అందలేదన్న సాకుతో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. గత రెండేళ్లుగా కోర్టు స్టే ఇచ్చిందనే కారణాన్ని సాకుగా చూపుతూ ఫీజుల నియంత్రణలో జాప్యం చేస్తున్న ప్రభుత్వానికి, కోర్టు తన బాధ్యతను గుర్తుచేసినా నేటివరకూ తీసుకున్న చర్యలు శూన్యం. స్కూల్ యాజమాన్యాల ప్రయోజనాలను కాపాడటానికి మాత్రమే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఫీజులపై చాలాకాలంగా గట్టిగా ఉద్యమిస్తున్న హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ చెబుతున్నా అదీ పట్టించుకోలేదు. క్యాపిటేషన్ ఫీ యాక్ట్ 1983 సెక్షన్ 7 ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని వినియోగించి ప్రభుత్వం స్కూలు ఫీజుల నియంత్రణకున్న అన్ని అడ్డంకులూ తొలగిపోయాయని, దీని కోసం ఎదో పెద్ద చట్ట సవరణ అవసరం కూడా లేదని, కేవలం జీవో 91ని సవరించటం ద్వారా ప్రభుత్వం స్కూలు ఫీజులు నియంత్రించవచ్చని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఫీజులపై మాట్లాడుతున్న తల్లిదండ్రులు తమ ఇబ్బందులపైనా చర్చించి వారే పరిష్కారం చూపించాలని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. విద్యార్థి తప్పు చేస్తేనో, టీచర్లను నిందించడమో, అసభ్య ప్రవర్తననో ప్రశ్నిస్తున్నపుడు ఫీజుల సాకు చూపించి తల్లిదండ్రులు, విద్యార్ధులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని యాజమాన్యాలు అంటున్నాయి. ప్రతి పది రోజులకు పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయని, వాటికితోడు ఉద్యోగుల పిఎఫ్, ఇఎస్‌ఐ చెల్లింపులతో యాజమాన్యాలపై పడే భారం గమనించాలని, రెండేళ్లుగా ఫీజు బకాయి చెల్లించకుండా ఎన్నిసార్లు వర్తమానం పంపినా, కొంతమంది తల్లిదండ్రులు కనీసం పట్టించుకోవడం లేదని, ఒక వేళ విద్యార్థులను స్కూలుకు అనుమతించకుంటే వెంటనే మీడియా, పోలీసు అంటూ హడావుడి చేస్తున్నారని, అలాంటి తల్లిదండ్రుల నుండి బకాయిలు ఎలా వసూలు చేసుకోవాలో కూడా చెప్పాలని యాజమాన్యాలు కోరుతున్నాయి.