రాష్ట్రీయం

వామపక్షాలకు బుద్ధిచెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: కమ్యూనిస్టుల ఆగడాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కనె్నర్ర చేసింది. కమ్యూనిస్టుల కోటలు బద్దలుకొట్టాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఘట్‌కేసర్ అన్నోజిగుడాలో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కార్యకారిణి కీలక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్‌జీ భాగవత్ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాలు ప్రారంభించారు. సంఘ్ సర్‌కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) భయ్యాజీ సురేష్‌జీ జోషి ప్రారంభోపన్యాసం చేశారు. విహెచ్‌పి కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌భాయి తొగాడియా, కార్యనిర్వాహక కార్యదర్శి చంపత్ రాయ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, పార్టీ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి రాంలాల్, సహకార్యవాహ (సంయుక్త ప్రధాన కార్యదర్శులు) సురేష్‌జీ సోని, దత్తాత్రేయ హోసభాలే, కృష్ణగోపాల్‌జీ, భాగయ్య, ప్రాంత ప్రచారకులు శ్యాంకుమార్, ఎక్కా చంద్రశేఖర్, దేవేందర్‌జీ, కాచం రమేష్, అన్నదానం సుబ్రహ్మణ్యం, కాట వెంకటేశ్వర రావు, ఎ మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 450మంది ప్రతినిధులు సమావేశాలకు హాజరయ్యారు.
పశ్చిమ బెంగాల్, కేరళలో స్వయం సేవకులపై కమ్యూనిస్టులు దాడులకు పాల్పడటంపై సమావేశంలో పలువురు ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణాలు ఏమై ఉంటాయని మీరు భావిస్తున్నారని మోహన్‌జీ భాగవత్ ప్రశ్నించగా, వారు తమ దృష్టికి వచ్చిన విషయాలను వెల్లడించారు. కేరళలో ఇస్లాం, కమ్యూనిజం, క్రిస్టియానిటీ ఎక్కువగా ఉన్నాయని, కమ్యూనిస్టుల్లో నుంచి కొంతమంది బిజెపిలో చేరుతుండటంతో, అది జీర్ణించుకోలేక కమ్యూనిస్టులు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని వారు వివరించారు. లోగడ ఒక కమ్యూనిస్టు స్థానిక నేత తన కుమారుడు శాఖకు వెళ్ళడాన్ని చూసి తట్టుకోలేక దాడి చేయించిన ఘటన జరిగిందన్నారు. కమ్యూనిస్టుల కోటలు బద్దలుకొట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోనూ ఇదే పరిస్థితి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు తమిళనాడులోనూ స్వయం సేవకులపై దాడులు జరుగుతున్న వైనాన్ని చర్చించారు. కమ్యూనిస్టుల ఆధిపత్యం ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళలోనే స్వయం సేవకులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయన్న అంశంపై లోతుగా చర్చించారు. కమ్యూనిస్టుల కంచుకోటలు బద్దలుకొట్టడం, దాడులను ఎదుర్కొనే అంశంపై సోమవారం తీర్మానం చేసే అవకాశం ఉంది.
రాజకీయ హత్యలు: భాగయ్య విమర్శ
ఇలాఉండగా భాగయ్య మీడియాతో మాట్లాడుతూ కమ్యూనిస్టుల దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ రాజకీయ కక్షతో చేస్తున్నవేనని ఆరోపించారు. హత్యలకు పాల్పడుతూ రాక్షస కృత్యాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కోల్‌కత్తాలోని కాలీచౌక్ పోలీసు స్టేషన్ పరిథిలో ఒక దళిత మహిళపై అత్యాచారం చేయడంతో ఆమె మరణించిందని చెప్పారు. ఇలా దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని కమ్యూనిస్టులను విమర్శించారు. కమ్యూనిస్టుల అకృత్యాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నట్టు చెప్పారు. కుల వివక్షపై సంఘ్ పోరాటం చేస్తున్నదని చెప్పారు. మందిరాలు, స్మశాన వాటికలు కులాలకు అతీతంగా ఉండాలన్నారు. సమాజంలో పరివర్తన తెచ్చేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణలో 489 గ్రామాల్లో తాము సర్వే నిర్వహించగా, 431 గ్రామాల్లో కుల వివక్ష లేదని తేలిందన్నారు. ఒక గ్రామంలోని స్మశాన వాటికలో దళితుల దహన సంస్కారాలకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. ఉమ్మడి ఆంధ్రలో దళితుల సంక్షేమానికి కేటాయించిన 25 వేల కోట్ల రూపాయలు ఇతర పథకాలకు మళ్లించడమైందన్నారు. సమాజంలో మానవ విలువలు పెంపొందించడం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ, విద్వేషాలు లేకుండా చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చించి తీర్మానం చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడే విషయంపైనా చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్ పట్ల దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని భాగయ్య మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ద్వారం వద్దే ఒకటిన్నర నిమిషం..
ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాల్లో చాలా క్రమశిక్షణతో, ఠంచనుగా సమయాలు పాటించడం జరుగుతుంది. ఆదివారం ఉదయం 8.30కు మోహన్‌జీ భాగవత్ సమావేశాలను ప్రారంభించాల్సి ఉంది. శ్రీ విద్యావిహార్ పాఠశాల ప్రాంగణంలో మోహన్‌జీ విడది చేసిన గదినుంచి సమావేశం జరిగే దీన్‌దయాళ్ సభా మందిరం వద్దకు చేరుకున్నారు. ఆయనతోపాటు భయ్యాజీ కూడా వచ్చారు. శ్యాంజీ ప్రభృతులు వారిని తీసుకుని వచ్చారు. అయితే సమావేశం మందిరంలోకి ప్రవేశించేందుకు ఇంకా ఒకటిన్నర నిమిషం సమయం ఉండటంతో వారు ద్వారం వెలుపలే నిలుచుని, సమయం అయిన తర్వాతే లోపలికి అడుగు పెట్టారు. ఇలాఉండగా పలువురు మహిళలు అతిథులకు, ప్రతినిధులకు కుంకుమ తిలకం పెట్టి సభా మందిరంలోకి సాదరంగా ఆహ్వానించారు.

చిత్రం... ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కార్యకారిణి సమావేశాల్లో సర్ సంఘ్‌చాలక్ మోహన్‌జీ భాగవత్ జ్యోతి,
సంఘ్ సర్‌కార్యవాహ భయ్యాజీ సురేష్‌జీ జోషి. సమావేశాలకు హాజరైన సంఘ్ ప్రతినిధులు