రాష్ట్రీయం

ఇబ్బంది లేకుండా ఇసుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 30: ఇసుకను అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకుగాను వచ్చే ఫిబ్రవరి 1 నుంచి నూతన విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జనవరి 2 నుండి 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మూడో విడత జన్మభూమి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడం, అలాగే అధిక జనాభా ఉన్న 659 గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఇడి వీధి దీపాలు ఏర్పాటు చేయడం అనేక కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు. అనంతరం వీటి వివరాలను సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు తెలిపారు. లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక ఉత్పత్తి చేయగలిగిన ప్రాంతాన్ని ఒక ఇసుక రీచ్‌గా గుర్తించాలని నిర్ణయించామన్నారు. వాగులు, వంకలు వద్ద లభించే ఇసుకను ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి, ప్రభుత్వ భవనాలకు ఉచితంగా ఎడ్లబండ్ల ద్వారా తరలించాలని సంకల్పించామని తెలిపారు. నాల్గవ కేటగిరిలోని ఉపనదులు, 5వ కేటగిరిలోని పెద్ద నదులులో ఇసుక రీచ్‌లను వేలం వేయాలని కూడా కేబినెట్ నిర్ణయించిందన్నారు. రోబోశాండ్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు దీని తయారీలో విద్యుత్ పై రాయితీలు ఇచ్చేందుకు వ్యాట్‌పై రాయితీలు లభించనున్నాయి. ఇక యూనిట్ ఇసుక రేటును రూ 500 నుంచి 550 వరకు నిర్ణయించడం జరుగుతుందని, యూనిట్ ఇసుక అమ్మకంపై లోడింగ్, అన్ లోడింగ్ వంటి ఖర్చులు పోను మిగిలిన వాస్తవ ఆదాయం నుండి ప్రభుత్వానికి ఎక్కువ ప్రీమియం మొత్తాన్ని చెల్లించే ఏజన్సీలకు వీటిని కేటాయించాలని కేబినెట్ సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి ఇసుక కమిటీలను జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కమిటీలో మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కన్వీనర్‌గా, జిల్లా పరిషత్ సిఇవో ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారన్నారు. పట్టా భూముల్లో కూడా ఈ నిబంధనలకు లోబడి ఇసుక అమ్మకాలకు అనుమతులివ్వాలని నిర్ణయించామన్నారు. మొత్తం ఇసుక విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని పల్లె రఘునాథ రెడ్డి మీడియాకు తెలిపారు.
ప్రతిష్ఠాత్మకంగా జన్మభూమి
జనవరి 2 నుండి 11 వరకు నిర్వహించే 3వ విడత జన్మభూమిలో స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఆయా గ్రామం లేదా వార్డును దత్తత తీసుకున్న వ్యక్తులను ప్రజలకు పరిచయం చేసి స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధికి రూపకల్పన చేసే విధంగా జన్మభూమి నిర్వహించాలని సంకల్పించారు. 12 లక్షల పెన్షన్లు, 10 లక్షల ఫారం పాండ్లు, అర్హత కలిగిన పేదలకు ఇళ్లు మంజూరు చేయనున్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, నీరు-ప్రగతి వంటి కార్యక్రమాలతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, జన్మభూమి కార్యక్రమ నిర్వహణకు ప్రతి జిల్లాకు కోటి రూపాయలు నిధులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు.
అంగన్‌వాడీ వర్కర్లు జీతాల పెంపు
అంగన్‌వాడీ వర్కర్ల జీతాలను నెలకు రూ.4200 నుంచి రూ. 7వేల వరకు పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అలాగే మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల జీతాలనూ రూ.4500లకు పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది.
659 గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఇడిలు
అధిక జనాభా ఉన్న 659 గ్రామాల్లో ఎల్‌ఇడి వీధి దీపాలు ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదించిందని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. ఈ గ్రామాల్లో 3 లక్షల 50వేల వీధి దీపాలను ఎల్‌ఇడి దీపాలుగా మార్చడం ద్వారా 50 శాతం పైగా విద్యుత్ ఆదా అవుతుందని మంత్రివర్గం భావించినట్టు తెలిపారు. ప్రస్తుత వీధి దీపాల నిర్వహణ వ్యయం రూ.59 కోట్లు ఉంటే, ఎల్‌ఇడి బల్బులు అమర్చడం ద్వారా రూ. 25 కోట్లకు నిర్వహణ వ్యయం తగ్గుతుందని రూ.34 కోట్ల మేర నిధులు ఆదా అవుతాయని చెప్పారు.
వైద్య రంగంలో సమూల మార్పులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే పరికరాల సమగ్ర నిర్వహణ విధానాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఏడాది రోజున ప్రారంభిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ వ్యాధి నిర్థారణ యంత్ర పరికరాలు 35 శాతం మేర దెబ్బతిన్నాయని, ఇవి నిరుపయోగంగా ఉన్నాయని మంత్రివర్గం భావించింది. వీటిని తిరిగి కొనుగోలు చేయడం లేదా మరమ్మతులు చేపట్టడం కోసం మెడికల్ ఎక్విప్‌మెంట్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీని మంత్రి మండలి ఆమోదించింది. వ్యాధి నిర్థారణ పరికరాల సమగ్ర నిర్వహణ విధానాన్ని ప్రతి జిల్లా కమ్యూనిటీ ఆసుపత్రుల్లో జనవరి 15న ఆయా జిల్లాల మంత్రులు ప్రారంభించనున్నారు. 2016-17 సంవత్సరానికి షెడ్యూల్ తెగల జాతులు నివసించని (నాన్ షెడ్యూల్ ఏరియాస్)లో 50 గిరిజన సంక్షేమ హాస్టళ్లను గురుకుల పాఠశాలలుగా మార్చేందుకు మంత్రి మండలి నిర్ణయించింది. ఇందుకు 6 వందల ఉద్యోగాలు మంజూరుకు మంత్రి మండలి అనుమతించింది. వీటిలో 450 టీచింగ్, 150 నాన్ టీచింగ్ ఉద్యోగాలున్నాయని మంత్రి వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని ముతుకూరు మండలం నెలతూరు, పిడతపూలూరు గ్రామాల్లో మిని స్టేడియం నిర్మాణానికి 17 ఎకరాల స్థలాన్ని ఉచితంగా జిల్లా క్రీడ ప్రాధికార సంస్థకు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయించిందన్నారు. అదే జిల్లా పాదలకూరు మండలం తోడేరు గ్రామంలో మిని స్టేడియం నిర్మాణానికి 11 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా జిల్లా క్రీడ ప్రాధికార సంస్థకు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయించింది. విశాఖలో విద్యా, వైద్యం, పర్యాటకం, పరిశ్రమలు, వౌలిక సదుపాయాలు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు విశాఖపట్నంలో జనవరి 10, 11, 12న సన్‌రైజ్ ఇన్విస్ట్‌మెంట్ మరియు సిఐఐ సమ్మిట్ నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదించింది. ఇందులో 27 దేశాలకు చెందిన 2 వందల మంది ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి వెల్లడించారు.
మొబైల్ యాప్ ఆవిష్కరణ
పౌర సేవలను సమర్థవంతంగా, వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందించేందుకు ఉద్దేశించిన మొబైల్ యాప్‌ను సమాచార పౌర సంబంధాలు ఇన్‌ఫర్‌మెషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్‌ల మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా పౌరులకు 18 రకాల సేవలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
చిత్రం... మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు