రాష్ట్రీయం

‘జీవిత ఖైదీల’కూ బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: జీవిత ఖైదు పడినవారు శిక్షపై హైకోర్టుకు అపీల్ చేసుకుంటే, బెయిల్ పొందేందుకు అర్హత ఉంటుందని హైకోర్టు పేర్కొంది. కాని ఆ ఖైదీ అప్పటికి ఐదు సంవత్సరాల శిక్షను అనుభవించి ఉండాలని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం ఇచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన బచ్చు రంగారెడ్డి మరో ఎనిమిది మందికి ఒక కేసులో జీవిత ఖైదు పడింది. వారు హైకోర్టుకు అపీల్ చేసుకోగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తీర్పు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు కాశ్మీరాసింగ్, వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఒక వ్యక్తి నేరం చేయకుండా ఐదారు సంవత్సరాలు జైల్లో ఉండడం క్లిష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటువంటి కేసుల్లో తగినంత వ్యవధిలోనే కోర్టులు అపీల్‌పై వాదనలు వినని పక్షంలో నిందితులకు బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఈ కేసులో పేర్కొంది.
ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ నిందితులు జైల్లో శిక్ష అనుభవించిన సమయంలో సత్ప్రవర్తన కలిగి ఉన్నారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నామన్నారు. కాగా దోపిడీలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, ప్రజాప్రతినిధులను హత్య చేయడం, కిడ్నాపింగ్, నాసా తదితర చట్టాల కింద అరెస్టయి ఉండడం తదితర తీవ్రమైన నేరాలకు బెయిల్ ఇవ్వాలన్న నిబంధన వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ అపీల్స్ విచారణ సమయంలో విడుదలైన ఖైదీలు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది. నెలకోసారి సంబంధిత పోలీసు స్టేషన్లలో రిపోర్టు చేయాలని హైకోర్టు ఆదేశించింది. సిఆర్‌పిసి 389 సెక్షన్ కింద బెయిల్ మంజూరు చేశామని కోర్టు పేర్కొంది. ఈ కేసులో బెయిల్ పొందిన వారు పది వేల రూపాయల సొమ్ము, రెండు పూచీకత్తులను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.