రాష్ట్రీయం

ఆలయ పర్యాటకానికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 3: ఆలయ పర్యాటకానికి మరింత ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వివిధ ఆలయాలను కలుపుతూ నాలుగు కారిడార్లను ఇప్పటికే గుర్తించింది. ఈ కారిడార్లలో టూర్లు నిర్వహించేందుకు వీలుగా టూర్ ఆపరేటర్లను దేవాదాయ శాఖ ప్రోత్సహించనుంది. వివిధ ప్రాచీన ఆలయాలకు ప్రాచుర్యంతో పాటు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభించే ఆలయ పర్యాటకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీశైలం, శ్రీకాళాహస్తి, ద్రాక్షారామంలను కలుపుతూ త్రిలింగ యాత్ర, 8 అమ్మవార్ల ఆలయాలను కలుపుతూ అష్టశక్తి యాత్ర, తిరుపతి-హంపి పేరుతో విజయనగరం కారిడార్, కళింగ కారిడార్ పేరుతో సింహాచలం, పూరి, శ్రీముఖలింగం వంటి ఆలయాలను కలుపుతూ ప్రతిపాదించారు. 16వ శతాబ్దం నాటి ఆలయాలు, విజయనగరం రాజులు, కళింగ రాజులు నిర్మించిన ఆలయాలు ఇందులో ఉన్నాయి.
చారిత్రక ప్రాధాన్యం ఉన్నప్పటికీ తగినంత సంఖ్యలో భక్తులు రాకపోవడంతో వీటిని ప్రొత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయ టూరిజం ద్వారా టూర్ ఆపరేటర్ల సాయంతో ఆయా ఆలయాలను మరింత మంది భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. విజయవాడలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ టూర్ ఆపరేటర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అష్టశక్తి యాత్రను మహిళల కోసం ఏర్పాటు చేశామని, ఆయా ఆలయాల్లో కుంకుమ పూజలు వంటివి నిర్వహించుకునేందుకు వీలుగా ప్రతిపాదించామన్నారు. హంపి, తిరుపతికి విదేశీయులు వస్తున్నప్పటికీ, వాటి పరిసర ప్రాంతాల్లోని ఆలయాలను వారు సందర్శించడం లేదన్నారు. తాడిపర్తి, యాగంటి, ఓంటిమిట్ట ఆలయాలు ఉన్నాయని, ఇవి పోతన, పోతులూరి వీరబ్రహ్మం వంటి మహనీయులు నడయాడిన ప్రాంతాలని తెలిపారు. ఉత్తరాంధ్రలో కూడా పురాతన ఆలయాలు ఉన్నాయన్నారు. ఆపరేటర్లు వివిధ ప్యాకేజీలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆపరేటర్లకు, భక్తులకు ప్రభుత్వపరంగా ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఒకరోజు, రెండ్రోజులతో కూడా చిన్నచిన్న టూర్లు నిర్వహించే వీలు ఉందని తెలిపారు. వివిధ ఆలయ పర్యాటక కారిడార్లను పరిశీలించి సాధ్యాసాధ్యాలను చూసుకుని ప్రతిపాదనలతో రావాలని కోరారు. ఆయా ఆలయాల్లోని ప్రత్యేక పూజలు, సౌకర్యాలు, తదితర వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. గోవాలో బీచ్ టూరిజం, కేరళలో బ్యాక్ వాటర్స్ టూరిజం వంటివి ఉన్నాయని, రాష్ట్రంలో ఆలయ, ఆధ్యాత్మిక పర్యాటకానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఆలయాలు ఉన్నాయని జెఎస్‌వి ప్రసాద్ వివరించారు.