రాష్ట్రీయం

రూ. ఆన్‌లైన్ దర్శనం టిక్కెట్ల బుకింగ్ సులభతరం- ఈవో సాంబశివరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 30 : శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఇంటర్నెట్‌లో 300 రూపాయల టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసినట్టు టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 300 రూపాయల టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ఫోటో అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చినట్టు వెల్లడించారు. 2016, జనవరి 1 వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో టిక్కట్లు బుక్ చేసుకునే భక్తులు తమ పేర్లు, ఇతర వివరాలతో పాటు గుర్తింపు కార్డు నెంబరు నమోదు చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. భక్తులు దర్శనానికి వచ్చే సమయంలో ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. భక్తులు గమనించాలని ఈవో కోరారు.

షార్‌ను సందర్శించిన
ఆసియా పసిఫిక్ దేశాల విద్యార్థులు
సూళ్లూరుపేట, డిసెంబర్ 30: భారత అంతరిక్ష కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్‌ను ఆసియాలోని 14 దేశాలకు చెందిన విద్యార్థులు సందర్శించారు. డెహ్రాడూన్‌లో యునెటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో సిసిఎస్‌టిఈఎటిలో విద్యాభ్యాసం చేస్తున్న 30 మంది విద్యార్థులు రెండు రోజులు పర్యటనలో భాగంగా మంగళవారం షార్‌కు విచ్చేశారు. ఈ విద్యార్థులకు షార్ సందర్శనంతరం గ్రూపు డైరెక్టర్ విజయసారధి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్వయం సమర్థత పెంపొందచే ఈ విద్యాకార్యక్రమంలో ఉన్నత విద్యను అభ్యశించే వారికే ఇలాంటి అవకాశాలు ఉంటాయన్నారు. అనంతరం అంతరిక్ష కేంద్రం చేపట్టే కార్యక్రమాలు, ప్రయోగాల గురించి గురించి విద్యార్థులకు వివరించారు. ఇక్కడున్న ముఖ్యమైన కేంద్రాలతోపాటు ప్రయోగ వేదికలను సందర్శించే అవకాశం కల్పించారు. మంగళవారం జరిగిన 50వ ప్రయోగ వేడుకల్లో కూడా వీరందరూ ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు.
స్కూల్ బస్సును ఢీకొన్న లారీ, డిసిఎం
విద్యార్థులకు తీవ్ర గాయాలు
సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 30: ఉదయానే్న ఉత్సాహంగా పాఠశాలకు బయలుదేరిన విద్యార్థులను లారీ, డిసిఎం రూపంలో ఢీకొన్న ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడిన సంఘటన బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివలింగం కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కంది శివారులోని కేశవరెడ్డి పాఠశాలకు చెందిన బస్సు ఉదయం పటాన్‌చెరు ప్రాంతం నుంచి విద్యార్థులను తీసుకొని పాఠశాలకు బయలుదేరింది. ఈ క్రమంలో ఐఐటి ప్రధాన ద్వారం వద్ద జాతీయ రాహదారి 65 పై యూటర్న్ తీసుకుంటున్న బస్సును వెనక నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు వేగంగా ముందుకు కదలడంతో సంగారెడ్డి నుంచి పటాన్‌చెరువు వైపు వెళ్తున్న డిసిఎం వాహనం పాఠశాల బస్సును ముందు భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డిసిఎం డ్రైవర్ ఖాదర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా రెండు కాళ్లు విరిగి పోయాయి. బస్సులోని సుమారు 35మంది విద్యార్థుల్లో 10మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ సంగారెడ్డిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించి ప్రాథమిక చికిత్సను అందించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రుల వద్దకు పరుగులు తీసి గాయపడిన తమ చిన్నారులను చూసి బోరున విలపించడం అక్కడ ఉన్నవారిని కలిచి వేసింది. ఆనందోత్సవాల మధ్య సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు సమయాత్తమవుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
17 మంది వైసిపి నేతలకు
జిల్లా బహిష్కరణ
అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, డిసెంబర్ 30: గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 3 కేసుల్లో నిందితులైన 17 మంది వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట పూచీకత్తు ఇచ్చేందుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి రవి 15 రోజులు గుంటూరు జిల్లాలో నివసించరాదని, ఎవరైనా జిల్లాలో కనపడితే బెయిల్ రద్దు చేయడంతో పాటు అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... గత నెల 28న మునిసిపల్ కార్యాలయ సిబ్బంది ఓవర్‌బ్రిడ్జి వద్ద కేబుల్ వైర్లు కట్‌చేసి తొలగిస్తున్న సమయంలో 17 మంది వైసిపి నాయకులు అడ్డుకుని పట్టణంలో ధర్నా చేశారు. మరలా పురపాలక సంఘ కమిషనర్‌ను కలిసేందుకు వచ్చిన వైసిపి నాయకులు అడ్డువచ్చిన మహిళను నెట్టుకుంటూ వెళ్లిపోయారు. పొన్నూరు అర్బన్ పోలీసుస్టేషన్‌లో 252/2015, 254/15, 256/15 కింద కేసులు నమోదు చేశారు. ఆయా కేసులకు సంబంధించిన బెయిల్ కోసం బుధవారం పూచీకత్తులు ప్రవేశపెట్టారు. పూచీకత్తు స్వీకరించిన న్యాయమూర్తి గురువారం నుంచి నిందితులు గుంటూరు జిల్లాలో నివాసం ఉండరాదని ఆదేశాలు జారీచేశారు. ఎవరైనా జిల్లాలో కనిపించిన పక్షంలో బెయిల్ రద్దుచేసి అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ కేసులో జి సుబ్బారావు, డి రవి, మరో 15 మంది నిందితులుగా ఉన్నారు.
ఎదురెదురుగా
ఢీకొన్న వోల్వో బస్సులు
చంద్రగిరి, డిసెంబర్ 30 : చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని మల్లవరం బైపాస్ రోడ్డు వద్ద వోల్వో బస్సును మరొక వోల్వో బస్సు ఢీ కొనడంతో పలువులు అయ్యప్ప భక్తులు గాయాలకు గురి అయిన సంఘటన బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనలో రెండు బస్సులు పూర్తిగా దెబ్బతిన్నాయి. శబరిమలలో అయ్యప్ప దర్శనం ముగించుకొని తిరుమలకు వెళుతున్న అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వోల్వో బస్సును తిరుపతి నుంచి చిత్తూరు వైపునకు వెళుతున్న వోల్వో బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో సుమారు 10 మంది అయ్యప్ప భక్తులు గాయపడగా వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 లో రుయాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ మేరకు రెండు బస్సుల డ్రైవర్లపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ వినోద్ కుమార్ తెలిపారు.

సీలేరు నుంచి
నీటి విడుదల తగ్గింపు
సీలేరు, డిసెంబర్ 30: గోదావరి డెల్టాలో రబీ పంటకు విశాఖ జిల్లా సీలేరు కాంప్లెక్స్ నుంచి విడుదల చేస్తున్న నీటిని బుధవారం నుంచి వెయ్యి క్యూసెక్కులు తగ్గించామని సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజనీర్ మురళీమోహన్ తెలిపారు. గోదావరి డెల్టాకు సీలేరు నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఐదువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, విద్యుత్ ఉత్పత్తి లేకుండా మంగళవారం రాత్రి వరకు డొంకరాయి డ్యామ్ గేట్ల ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసామని ఆయన తెలిపారు. అయితే బుధవారం నుంచి డొంకరాయి డ్యామ్ నుంచి 1,500 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నామని తెలిపారు. దీని ప్రకారం ప్రస్తుతం సీలేరు కాంప్లెక్స్ నుంచి 6,500 క్యూసెక్కుల నీటిని డెల్టాకు సరఫరా చేస్తున్నామన్నారు. జనవరి 3వ తేదీ వరకు ఈ విధంగానే నీటిని సరఫరా చేస్తామన్నారు. గోదావరి డెల్టాకు నీటి పంపిణీ అంశంపై బుధవారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారుల సమావేశం జరిగిందన్నారు. ఆ సమావేశంలో జెన్‌కో ఉన్నతాధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొన్నారన్నారు. ఆ సమావేశంలో సీలేరు కాంప్లెక్స్ నుంచి నీటిని తగ్గించాలని తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతం నీటి విడుదల వెయ్యి క్యూసెక్కుల మేర తగ్గించామన్నారు.

ప్రజాసమస్యలపై
సర్కార్‌ను నిలదీస్తాం

వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు

ఆంధ్రబూమి బ్యూరో
శ్రీకాకుళం, డిసెంబర్ 30: ప్రజల సమస్యలపై రానున్న జన్మభూమిలో ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీస్తామని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం శ్రీకాకుళంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్ళడం లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దృష్టికి జిల్లాల వారీగా ప్రజా సమస్యలు వెళ్లినా ఆయన పట్టించుకోకుండా ‘కిరికిరి’ కమిటీలకు వదిలేసారా అని ధ్వజమెత్తారు. వచ్చే నెల రెండోతేదీ నుంచి రాష్టమ్రంతటా నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు ప్రజలపక్షాన నిలబడి సమస్యలపై నిలదీస్తారని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ వదిలేసి సింగపూర్, మలేషియా బృందాలతో, ప్రధాన మంత్రి, రాష్టప్రతులతో విందులు ఆరగించే సిఎంకి.. సంక్రాంతికి సామాన్యుడు పప్పును సైతం ఇంట్లో ఉడకపెట్టుకోలేని దుస్థితిలో ఉన్నట్టు టిడిపి ఎమ్మెల్యేలు చెప్పలేదా? అని ఫ్రశ్నించారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా మరోసారి జనాన్ని మోసం చేసేందుకు టిడిపి నేతలు, అధికారులు గ్రామాల్లోకి వస్తే ప్రజలు ఊరుకోరన్నారు. వైకాపా కార్యకర్తలు ప్రజల పక్షాన నిలబడి అధికార పార్టీ నేతలను నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించారు.

తెరాసకే ఖమ్మం ఎమ్మెల్సీ

ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 30: ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార టిఆర్‌ఎస్ పార్టీ చేజిక్కించుకుంది. పార్టీ ఆవిర్భవించిన తర్వాత గత సాధారణ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో జలగం వెంకట్రావు విజయం సాధించగా, ఆ తర్వాత అనేక మంది ఆ పార్టీలో చేరినప్పటికీ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం జిల్లాలో పోటీ చేసి గెలిచిన ఘనత బాలసాని లక్ష్మీనారాయణకే దక్కింది. ఈ నెల 27న జరిగిన ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఖమ్మంలో జరిగింది. ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉండగా అధికార, వామపక్షాల పార్టీ అభ్యర్థులైన బాలసాని లక్ష్మీనారాయణ, పువ్వాడ నాగేశ్వరరావుల మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలో 726ఓట్లు ఉండగా 692ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొదటి రౌండ్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మీనారాయణకు 313ఓట్లు రాగా, రెండో ప్రాధాన్యంలో మరో 3ఓట్లు వచ్చాయి. పువ్వాడ నాగేశ్వరరావుకు మొదటి ప్రాధాన్యంలో 275ఓట్లు రాగా, రెండో ప్రాధాన్యంలో మరో 10ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్థి లింగాల కమల్‌రాజుకు 102మాత్రమే రాగా, ఒక నోటా, ఒక ఓటు చెల్లలేదు. స్వతంత్ర అభ్యర్థులకు ఒక్క కూడా రాలేదు. ఆశ్చర్యకరంగా స్వతంత్ర అభ్యర్థులకు నామినేషన్ సమయంలో బలపర్చిన 10మంది అభ్యర్థుల ఓట్లు కూడా రాకపోవటం గమనార్హం. అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపించామని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా గెలుపొందిన బాలసాని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కానుకగా ఎమ్మెల్సీ ఎన్నికను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటే ఉండేలా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.