రాష్ట్రీయం

పౌర సరఫరాలపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: ఆంద్రప్రదేశ్‌లో పౌరసరఫరాల వ్యవస్థను అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రజాపంపిణీ వ్యవస్థలోని ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ (ఈపోస్) వద్ద నుంచి పూర్తి స్థాయి పర్యవేక్షణ చేసేందుకు గాను వివిధ స్థాయిల్లో కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం జివో జారీ చేసింది. గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డు, మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ స్థాయిలో పర్యవేక్షక కమిటీలను ప్రభుత్వం నియమించింది. గ్రామపంచాయతీ కమిటీలో అధ్యక్షుడిగా సర్పంచ్, సభ్యులుగా ఎంపిటిసి, స్వయం సహాయక సంఘంలోని సభ్యులు ఇద్దరు, సామాజిక కార్యకర్తలు ఇద్దరిని ప్రభుత్వం నియమించింది. మున్సిపల్ వార్డు కమిటీకి అధ్యక్షుడిగా వార్డు సభ్యుడు, సభ్యులుగా ఇద్దరు స్వయం సహాయక సంఘాల సభ్యులు, ముగ్గురు సామాజిక కార్యకర్తలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లేదా డిటి సివిల్ సప్లయిస్‌ను నియమించింది. మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ కమిటీకి అధ్యక్షుడిగా సంబంధిత కార్పొరేటర్, ఇద్దరు స్వయంసహాయక సంఘాల సభ్యులు, ముగ్గురు సామాజిక కార్యకర్తలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లేదా సివిల్ సప్లయిస్ డిటిలను ప్రభుత్వం నియమించింది. మండల స్థాయి కమిటీకి అధ్యక్షుడిగా సంబంధిత ఎంపిపి, సభ్యులుగా జడ్పిటిసి, ఇద్దరు ఎంపిటిసిలు, ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, ఒక స్వయం సహాయక సభ్యుడు, తహసీల్‌దార్ లేదా సహాయ సరఫరా అధికారి ఉంటారు. మున్సిపాలిటీ స్థాయి కమిటీకి అధ్యక్షుడిగా సంబంధిత మున్సిపల్ చైర్మన్, ఒక వార్డు సభ్యుడు, ముగ్గురు సామాజిక కార్యకర్తలు, తహసీల్‌దార్ లేదా సహాయ సరఫరా అధికారి ఉంటారు. నగర పాలక సంస్థ స్థాయి కమిటీకి అధ్యక్షుడిగా సంబంధిత మేయర్, సభ్యులుగా ఒక కార్పొరేటర్, నలుగురు సామాజిక కార్యకర్తలు, ఆర్డీఓ లేదా సబ్‌కలెక్టర్ ఉంటారని ప్రభుత్వం ఆ జీవోలో స్పష్టం చేసింది. ఈ కమిటీలన్నీ తమ పరిధిలో ఉన్న చౌక ధరల దుకాణాలపై నియంత్రణ కలిగి ఉండాలని, ప్రజాపంపిణీ వ్యవస్థ ఎలా పని చేస్తోంది, అక్కడ ఉన్న ఈపోస్ విధానం పని తీరును పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ కమిషనర్, జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

ఇన్విజిలేటర్
మందలించాడని..
కావలి, డిసెంబర్ 30: నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వెక్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు రాసేందుకు వచ్చిన ఎన్ హరిప్రియ అనే ఫస్టియర్ ఇంజనీరింగ్ విద్యార్థిని చూసిరాస్తుండగా గమనించిన ఇన్విజిలేటర్ మందలించడంతో మనస్తాపం చెంది కళాశాల 3వ అంతస్థు పైనుంచి దూకేసింది. దీంతో హడలిపోయిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు బాధితురాలిని తొలుత ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు, అనంతరం మెరుగైన వైద్యం కోసం స్థానికంగా గల ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కాగా విద్యార్థినికి కాళ్ళు, చేతులు విరిగినట్లు, వెన్నుపాముకు కూడా గాయమైనట్లు వైద్య పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. దుత్తలూరు మండల కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన హరిప్రియ బోగోలు మండలం కడనూతల ఆర్‌ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం సిఎస్‌ఇ గ్రూపు చదువుతోంది. అయితే మొదటి సెమిస్టర్ పరీక్ష కాగా రాసేందుకు వచ్చిన ఆమె చిట్టిపెట్టి పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్ గుర్తించి మందలించారు. ప్రిన్సిపాల్ వద్దకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తుండగా ఉన్నట్టుండి పై అంతస్తునుంచి దూకేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

టిడిపి లబ్ధికే జన్మభూమి
వైకాపా ఎంపి వైవి సుబ్బారెడ్డి ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 30: టిడిపి ప్రభుత్వం పంచాయితీ రాజ్ వ్యవస్థను దెబ్బతీసి టిడిపి కార్యకర్తలను జన్మభూమి కమిటీల్లో నియమించి పరిపాలనను భ్రష్టు పట్టిస్తోందని ఒంగోలు వైకాపా ఎంపి వైవి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రతినిధుల అధికారాలను హరించివేసి టిడిపి తాబేదార్లను అందలమెక్కిస్తున్నారని విమర్శించారు. ఇంతవరకు రెండు విడతలుగా జన్మభూమి జరిగిందని, కాని ఏం ప్రయోజనాలు సాధించామన్నారు. జన్మభూమి సందర్భంగా గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులను ప్రజలు నిలదీస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని, టిడిపి కార్యకర్తలు సొమ్ము చేసుకునే విధంగా తయారైందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా చేస్తున్నారన్నారు. పంచాయితీ రాజ్ సంస్థల్లో అధికార వికేంద్రీకరణను మిథ్యగా మార్చారన్నారు. ఇండ్లు, పెన్షన్ల కోసమని లక్షలాది దరఖాస్తులు వస్తే వాటిని గుట్టలు గుట్టలుగా పడేస్తున్నారని, వాటిని పట్టించుకునే అధికారులు కరవయ్యారన్నారు. సంక్షేమ కార్యక్రమాలను మానివేసి ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అన్నింటిని తుంగలో తొక్కి నియంతృత్వ ధోరణితో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

ప్రభుత్వరంగ సిబ్బందికీ
వయోపరిమితిని పెంచండి
ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టు ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయోపరిమితిని 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచాలని హైకోర్టు ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావు జారీ చేశారు. తమకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పదవీ విరమణ వయోపరిమితిని 60 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ అనేక మంది పిటిషన్లను దాఖలు చేవారు. తమ పట్ల ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. కార్పొరేషన్ల సిబ్బందికి కూడా ఈ సదుపాయం వర్తింపచేయాలని ఆదేశించిన హైకోర్టు ఈ కేసు విచారణను వాయిదా వేసింది.
కడప కలెక్టర్‌ను విధులనుంచి
తప్పించండి: కాంగ్రెస్ డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 30: వైఎస్‌ఆర్ కడప జిల్లా కలెక్టర్ నూతన కార్యాలయ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటనలో కలెక్టర్‌ను తక్షణం విధుల నుంచి తొలగించాలని ఎపిపిసిసి ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా కలెక్టర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. కడప జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం అంబేద్కర్ విగ్రహం లేకుండా జరగరాదని, తక్షణమే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిఎం చంద్రబాబు అనుమతితోనే కలెక్టర్ నూతన కార్యాలయం ఆవరణలోని అంబేద్కర్ విగ్రహాన్ని, పీఠాన్ని కూల్చారని ఆయన ఆరోపించారు.

బిసి స్టడీ సర్కిళ్ల
అధ్యయనానికి కమిటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లోని బిసి స్టడీ సర్కిళ్ల పని తీరును అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్టస్థ్రాయి కమిటీని పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా బిసి సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి లేదా స్పెషల్ చీఫ్ సెక్రటరీని నియమించింది. సభ్య కన్వీనర్‌గా బిసి సంక్షేమ శాఖ కమిషనర్, సభ్యులుగా ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ, జిఏడి సర్వీసెస్ అదనపుసెక్రటరీ, బిసి సంక్షేమశాఖ అదనపు డైరక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరక్టర్, రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శిని సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జివో జారీ చేసింది.
రామకృష్ణ మఠంకు
తితిదే భూముల లీజు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 30: సమాజానికి ఉపయోగపడేలా యువతను తీర్చిదిద్దేందుకు రామకృష్ణ మఠం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సహకారం అందిస్తోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు రామకృష్ణ మఠం ప్రత్యేక శిక్షణను ఇస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని వినియక్ నగర్‌లో ఉన్న భవనాలతో సహా 0.86 ఎకరాల తితిదే భూమిని 33 సంవత్సరాల లీజుపై రామకృష్ణ మఠానికి ఇచ్చారు. ఈ మేరకు బుధవారం రెవెన్యూ (దేవాదాయ శాఖ) ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.