రాష్ట్రీయం

నదుల అనుసంధానం శుభ పరిణామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 30: రైతాంగానికి సాగు, తాగునీరు అందించేందుకు చేపట్టిన నదుల అనుసంధానం, ప్రాజెక్టుల నిర్మాణం పనులు శరవేగంగా జరగటం శుభపరిణామమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా అన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు, వైద్య, ఆరోగ్య, వౌలిక రంగాల్లో చేపడుతున్న అభివృద్ధి క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా బుధవారం పనగరియా కృష్ణా జిల్లాలో విజయవాడ రూరల్ జక్కంపూడి వద్ద జరుగుతున్న పోలవరం కుడి ప్రధాన కాలువ అభివృద్ధి పనులు, జి కొండూరు మండల వెలగలేరు వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేపట్టటం గొప్ప విషయంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి డైనమిక్ సిఎంలా ముందుకు దూసుకుపోతున్నారన్నారు. ప్రత్యేకంగా పోలవరం కుడి ప్రధాన కాలువ, రైతాంగం సంక్షేమానికై చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణం, వైద్య, ఆరోగ్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం శుభపరిణామంగా వైస్ చైర్మన్ వ్యాఖ్యానించారు. వ్యవసాయంతోపాటు మత్స్యశాఖలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి సాధించిందన్నారు. ఇది సిఎం పనితీరుకు నిదర్శనమన్నారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైస్ చైర్మన్‌కు పోలవరం కుడి ప్రధాన కాలువ, ప్రాజెక్టుకై చేపట్టిన పనులను వివరించారు. పోలవరం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేందుకు మరికొంత కాలం పడుతుందని, ఆ ప్రయోజనాలను కొంతమేర ముందుగా అందించేందుకు పోలవరం కుడికాలువ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు అనుసంధానించి తరలిస్తున్నామన్నారు. సుమారు 80 టిఎంసిల గోదావరి నీటిని 24 మోటార్లు ద్వారా ఎత్తిపోస్తున్నామన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథక నిర్మాణానికి 186 ఎకరాలు సేకరించామన్నారు. 10ఏళ్ల కాలంలో పరిష్కారంకాని భూసేకరణ సమస్యను 60 రోజుల్లో పరిష్కరించి రూ. 700 కోట్ల భూపరిహారం కింద రైతులకు చెల్లించామన్నారు.ఈ సందర్భంగా జక్కంపూడి వద్ద జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, కరువు నివారణ చర్యలు, గ్రామీణాభివృద్ధి శాఖ నీటి సంరక్షణా పనులు, పచ్చదనం - భూసార సంరక్షణ, పూడికతీత, నీటి కుంటల పనులు, ఎపి ఎస్‌ఐడిసి, వ్యవసాయ, మత్స్యశాఖల ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను వైస్ చైర్మన్ తిలకించారు. అనంతరం జి కొండూరు మండలం, వెలగలేరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం, చౌకధర దుకాణాన్ని పరిశీలించారు. పర్యటనలో వైస్ చైర్మన్‌తోపాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌పి ఠక్కర్, నీతి ఆయోగ్ సలహాదారు ఎకె జైన్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ డా జి సృజన, నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ జి గీతాభాయ్, అడిషనల్ డైరెక్టర్ టి నీరజ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పోలవరం కుడి కాలువ పనుల తీరును పరిశీలిస్తున్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా