రాష్ట్రీయం

నోట్ల రద్దు ‘పెద్ద’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: పెద్ద నోట్ల రద్దువల్ల రాష్ట్ర ఖజానాకు వచ్చే నాలుగు నెలల్లో (డిసెంబర్ నుంచి మార్చి వరకు) దాదాపు రూ.3000 కోట్ల నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. నెలకు దాదాపు రూ.750 కోట్ల చొప్పున వచ్చే నాలుగు నెలల్లో సంభవించే నష్టాలపై ప్రాథమిక అంచనా రూపొందించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్రానికి అందించిన నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయానికి కలిగిన నష్టానికి ప్రత్యేక సాయం అందించడంతోపాటు సిఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం నేతృత్వంలోని బృందం సచివాలయంలో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాజీవ్ శర్మ కేంద్ర బృందానికి పరిస్థితిని వివరిస్తూ పెద్ద నోట్ల రద్దు రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. దీనివల్ల పేద ప్రజలు, నిర్మాణరంగ కార్మికులు ఉపాధి కోల్పోయారని, సన్న, చిన్నకారు రైతులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. రబీ సీజన్ ప్రారంభం అవుతుండటంతో రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లతోనే ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ఇన్‌పుట్స్ కొనుగోలు చేయడానికి రైతులను అనుమతించాలని రాజీవ్ శర్మ కోరారు. స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పన్నుల బకాయిలను పాత నోట్లతో చెల్లించడానికి ప్రస్తుతం 24 వరకు గడువుందని, దీన్ని మరింత కాలం పొడిగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేల చొప్పున నగదుగా అందించడానికి అనుమతించాలని, కొత్త రూ.500 నోట్లను విస్తృతంగా చెలామణిలోకి తీసుకురావాలని, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నోట్లు సరఫరా అయ్యేలా చూడాలని, ఆసరా పెన్షన్ల చెల్లింపునకు చిన్న నోట్లు ఇవ్వాలని, పాత నోట్ల డిపాజిట్, మార్పిడి గడువును మరింత పొడిగించాలని రాజీవ్ శర్మ కోరారు. రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ భూముల కొనుగోలు, అమ్మకాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు రోజుకు రూ.23 కోట్ల, నెలకు రూ.100 కోట్ల చొప్పున వచ్చే నాలుగు నెలలు డిసెంబర్ నుంచి మార్చి 2017 దాదాపు రూ.400 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేసినట్టు వివరించారు. రెవిన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా మాట్లాడుతూ ఎక్సైజు శాఖకు నెలకు రూ.50 కోట్ల చొప్పున రూ.250 కోట్ల నష్టం వాటిల్లనుందని వివరించారు. అలాగే వాణిజ్య పన్నుల శాఖకు నెలకు రూ.420నుంచి 450 కోట్ల చొప్పున నాలుగు నెలలల్లో రూ.1800 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉందని అజయ్ మిశ్రా వివరించారు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ మాట్లాడుతూ తమ శాఖకు నెలకు రూ.90 కోట్ల చొప్పున రూ.450 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉందని వివరించారు. కేంద్ర బృందం నాయకుడు రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దువల్ల రాష్ట్రంలో తలెత్తిన ఇబ్బందులను, రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్లు, సరఫరా జరుగుతున్న తీరుతెన్నులు, బ్యాంకుల సేవలు, ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కేంద్రానికి నివేదిస్తామన్నారు. రాష్ట్ర ఆదాయానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఏవిధంగా సాయం చేయాలనే అంశాన్ని కూడా కేంద్రానికి నివేదించనున్నట్టు రెడ్డి సుబ్రమణ్యం హామీ ఇచ్చారు.

చిత్రం... నష్టాలను కేంద్ర బృందానికి వివరిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ