రాష్ట్రీయం

సగం కాలం ముగిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ ఆవిర్భవించి, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి శుక్రవారంతో రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సాధించిన విజయాలను జనంలోకి తీసుకు వెళ్లాలని టిఆర్‌ఎస్ ఏర్పాట్లు చేసుకోగా, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆశనిపాతంగా మారింది. అట్టహాసంగా తలపెట్టిన బహిరంగ సభను రద్దు చేసుకోవడంతో పాటు, పార్టీ కమిటీల నియామకాన్ని సైతం నిలిపివేశారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో విద్యుత్ అంశం ప్రధాన సమస్యగా మారినా ఒకదాని తరువాత ఒకటి సమస్యలు పరిష్కరించుకుంటూ రెండున్నర ఏళ్ల పాలనను నల్లేరు మీద నడకలా సాగించారు. 15 మంది టిడిపి ఎమ్మెల్యేల్లో 12 మంది టిఆర్‌ఎస్‌లో విలీనం కావడం, కాంగ్రెస్ బలం కూడా తగ్గడం వంటి కారణాలతో విపక్షం బలహీనంగా మారింది. ఇప్పుడిప్పుడే సమస్యలు తలెత్తుతున్న సమయంలో నోట్లరద్దు నిర్ణయం ప్రభుత్వంపై ఊహించని విధంగా దెబ్బవేసింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, కేజీ నుంచి పిజీ వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఇంకా అమలుకు నోచుకోలేదు. అయితే వీటికంటే ప్రభుత్వం సైతం వీటి కన్నా ప్రాజెక్టులు పూర్తి చేయడంపై దృష్టి సారించింది. ప్రాజెక్టుల నిర్మాణానికి ఏటా 25వేల కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా గతంలో హామీ ఇచ్చిన మేరకు కోటి ఎకరాలకు సాగునీటిని అందించాలని భావించారు. చివరి రెండు ఏళ్లపాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన.
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల ద్వారా అంచనా కన్నా ఎక్కువ ఆదాయం రావడం, రియల్ ఎస్టేట్ బూమ్ మళ్లీ ప్రారంభం కావడంతో గండం గట్టెక్కినట్టే అని ప్రభుత్వం భావించింది. దీనికి తోడు ఈసారి మంచి వర్షాలు కురవడంతో మరో రెండేళ్లపాటు వర్షాలు లేకపోయినా ఇబ్బంది లేని పరిస్థితి వచ్చింది. అంతా అనుకూల వాతావరణమే ఉందని భావిస్తున్న తరుణంలో నోట్ల రద్దు తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.
నెలకు కనీసం 1000 నుంచి 15వందల కోట్ల రూపాయల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేశారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. గవర్నర్‌ను కలిశారు. కేంద్రం ఆదుకోవాలని కోరారు. కొంత వరకు నష్టం భరించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.
దీంతో ముఖ్యమంత్రి కుదుట పడినా, ఖజానా మాత్రం ఇబ్బంది కలిగించే విధంగానే ఉంది. డిసెంబర్ నెల గడిస్తే వాస్తవంగా ఎంత మేరకు ఆదాయం పడిపోతుందనేది తెలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అప్పటి వరకు కొన్ని పథకాలకు నిధుల కేటాయింపులు తగ్గించనున్నారు. రెండున్నర ఏళ్ల వరకు విపక్షాలకు బలమైన ఆయుధాలు లేకుండా పాలన సాగింది. మిగిలిన ఈ రెండున్నర ఏళ్లే టిఆర్‌ఎస్‌కు అసలైన పరీక్ష. కారణాలు ఎన్ని ఉన్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే విపక్షాల నుంచి విమర్శలు తప్పవు. ప్రధానంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం హామీ ఇచ్చిన మేరకు పూర్తి చేయకపోతే మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ముందు హైదరాబాద్ నగరంలో ఇళ్ల నిర్మాణం త్వరతిగతిన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోట్ల రద్దుతో నిర్మాణ రంగం కుదేలై కూలీలకు పని లభించడం లేదు, దీనిని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గడిచిన కాలం కంటే రానున్న రెండున్నర ఏళ్లు టిఆర్‌ఎస్‌కు కీలకమైనవి. ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపించక తప్పని పరిస్థితి. నోట్ల రద్దు ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా మారిన పరిస్థితిలో కోటి ఎకరాలకు సాగునీరు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపథకం అమలు చేయడం ప్రభుత్వానికి శక్తికి మించిన పని.