రాష్ట్రీయం

చిత్తూరు జిల్లాకూ కృష్ణా జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 2: దుర్భిక్ష పరిస్థితుల్ని అధిగమించి రైతులు, ప్రజలను ఆదుకోవడానికే రాష్ట్రంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే గోదావరి, కృష్ణా జలాలను కరువు ప్రాంతాలకు తరలించామన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు హంద్రీ నీవా నీటిని శుక్రవారం ముఖ్యమంత్రి విడుదల చేసి ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం అక్కడే జరిగిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ గొల్లపల్లి రిజర్వాయర్‌కు నందమూరి తారక రామారావు రిజర్వాయర్‌గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. దివంగత నేత ఎన్‌టిఆర్ ప్రారంభించిన హంద్రీ నీవాను పూర్తి చేయడం తన అదృష్టమన్నారు. హంద్రీ నీవా నీటిని కుప్పంకు తీసుకెళ్తున్నారంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారని, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల వారు అడ్డుకుని ఉంటే అనంతపురానికి నీరోచ్చేదా అని ప్రశ్నించారు. దూరదృష్టితో ప్రణాళికలు రూపొందించి నదులు అనుసంధానం చేస్తున్నామన్నారు. త్వరలో కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు. ఎన్‌టిఆర్ తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టుల్ని ప్రారంభించినపుడు సైతం విమర్శలు చేస్తూ అడ్డుకున్నారని, అయితే నదుల అనుసంధానం ద్వారా ఆ ప్రాజెక్టులు పూర్తిచేయగలిగామన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.29 వేల కోట్లు అవసరమని, ప్రస్తుతం రూ.2519 కోట్లకు నాబార్డు అనుమతి లభించిందని సిఎం అన్నారు. గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు మళ్లించి, కృష్ణానది నుంచి 80 టిఎంసిల నీటిని హంద్రీ నీవా ద్వారా రాయలసీమకు తీసుకొస్తున్నామని అన్నారు. హంద్రీ నీవా నీటితో రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని అన్నారు. హంద్రీ నీవా ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను కర్నూలు జిల్లామల్యాల నుంచి ఎత్తిపోసి అనంతపురం జిల్లా జీడిపల్లికి తరలించామన్నారు. ప్రస్తుతం జీడిపల్లి నుంచి అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి వరకు తీసుకొచ్చి ఇక్కడి రిజర్వాయర్ నింపుతున్నామన్నారు. ఇక్కడినుంచి మడకశిర మీదుగా హిందూపురానికి తరలిస్తామన్నారు. అక్కడినుంచి చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లకు ఈ ఏడాదిలోనే నీటిని తరలిస్తామన్నారు. అలాగే చిత్తూరు జిల్లా కుప్పం, అడవిపల్లి వరకు కృష్ణాజలాలు తరలిస్తామన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. అంతకుముందు హంద్రీనీవా కాలువకు ముఖ్యమంత్రి గంగపూజ చేసి గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు.

చిత్రం..అనంతపురం జిల్లా గొల్లపల్లి రిజర్వాయర్‌కు హంద్రీ నీవా నీటిని
శుక్రవారం ముఖ్యమంత్రి విడుదల చేసి ప్రాజెక్టును ప్రారంభిస్తున్న దృశ్యం